Dec 07,2022 21:49

నేడు భారీ ప్రదర్శన, బహిరంగ సభ
పాల్గొనున్న గిరిజనోద్యమ నేత బృందాకరత్‌, జాతీయ నేతలు
మండల, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జంగారెడ్డిగూడెంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభకు ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ మహాసభకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రవి తెలిపారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం వివిధ రూపాల్లో నిర్వహించామన్నారు. తొలిరోజు నిర్వహించే ప్రదర్శన, బహిరంగ సభల్లో వేలాది మంది వ్యవసాయ కార్మికులు, పేదలు, గిరిజనులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే ప్రతినిధుల సభకు 350 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వానితులు మొత్తం 400 మంది హాజరుకానున్నారని చెప్పారు. బహిరంగ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు ఎ.విజయరాఘవన్‌, ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, కేరళ ఎంపీ శివదావన్‌, రైతుసంఘం మాజీరాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు షేక్‌ సాబ్జీ, ఐ.వెంకటేశ్వరరావు పాల్గొంటారని వివరించారు.