ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వ్యవసాయ పరిశోధన స్థానంలో పని చేస్తున్న 21 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా సిఐటియు అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనులను బహిష్కరించి నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 17 తేదీలలో నిరసనలు చేపట్టామని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వ్యవసాయ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు. వ్యవసాయ కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వీరికి ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు థర్డ్ పార్టీ ద్వారా ఇస్తుండడంతో వేతనాల్లో కోతపడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మికులకు మధ్యవర్తిత్వంగా ఉన్న కాంట్రాక్టర్‌ని రద్దు చేసి నేరుగా ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి జీతాలు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు పే స్కేలు అమలు చేయాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం త్వరితగతిన సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేశ్వరి, అర్జున్, నర్సింగరావు పాల్గొన్నారు.










