Mar 30,2023 22:02

ప్రజాశక్తి - ఏలూరు
              వ్యవసాయ రంగా భివృద్ధి వ్యవసాయ కార్మికుల అభివృద్ధితో ముడిపడి ఉందని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం 29వ మహాసభ గత డిసెంబర్‌లో జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికుల స్థితిగతులు, మహాసభ పిలుపులు తదితర అంశాలతో ప్రచురించిన సావనీర్‌ను స్థానిక అన్నే భవనంలో ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 65 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ధాన్యాగారంగా పేరొందిన గోదావరి జిల్లాల్లో వ్యవసాయ కార్మికులు రోజురోజుకీ పెరుగుతున్నారని తెలిపారు. వ్యవసాయ కూలీలకు వేతనాలు పెంచాలని దశాబ్దాలుగా వ్యవసాయ కార్మిక సంఘం పోరాడి కనీస వేతనాలను సాధించిందన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో పనులు తగ్గడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామీ పనులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిధులు తగ్గించడంతోపాటు కనీస పని దినాలు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. యంత్రాలతో పని చేయించడం వల్ల కాంట్రాక్టర్‌ జేబులు నింపడం తప్ప ఉపాధి కూలీలకు కనీస వేతనాలు అందడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలు, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాబోయే కాలంలో ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.మహంకాళిరావు, నేతలు మావూరి శ్రీనివాస్‌, జె.మహేష్‌, పి.ఆనందరావు, సునీల్‌, నాగేంద్ర, జాన్‌రాజు పాల్గొన్నారు.