గతంలో ములాయం సింగ్ సోదరుడైన శివలాల్ యాదవ్ అఖిలేష్‌తో విభేదించి వేరే పార్టీ పెట్టుకోవడం కూడా ఓట్ల చీలిక పెంచింది. ఇప్పుడు కూడా ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ వంటి వారిని బిజెపిలో చేర్చుకుని చాలా ప్రచారం చేస్తున్నా వారి రాజకీయ పునాది నామమాత్రం. యోగి నిరంకుశ పాలనపై వ్యతిరేకత కారణంగా ఈసారి బిజెపి ఓటమి ఖాయమనే భావన బలంగా వున్నా అది ఓట్ల లోకి మారుతుందా, ప్రతిపక్షాల మధ్య చీలిక, కుల మత పొందికల ప్రభావం ఎలా వుంటుందో చూడవలసిందే.
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ ది ఎప్పుడూ ప్రత్యేక స్థానం మాత్రమే గాక సింహభాగం కూడా. ఢిల్లీ మార్గం లక్నో ద్వారానే వెళ్తుందని రాజకీయ వర్గాల్లో నానుడి. కేంద్రంలో వున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకున్నా బిజెపికి వచ్చిన 302 స్థానాల్లో 62 అంటే అయిదో వంతు అక్కడే వచ్చాయి. మోడీ యు.పి లోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిజెపి హిందూత్వ వ్యూహానికి కేంద్ర బిందువు అయోధ్య, వారణాసి, మథుర అక్కడే వున్నాయి. రేపు మోడీ మరోసారి ప్రధాని కావడమనేది యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయం పైనే ఆధారపడి వుంటుందని హోంమంత్రి అమిత్‌షా సూటిగానే ప్రకటించారు. అది ఇబ్బందికరమని తర్వాత అలాంటి మాటలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. 2014లో అమిత్‌షా స్వయంగా యు.పి బాధ్యత తీసుకుని అక్కడే మకాం వేశారని ఇక్కడ గుర్తు చేయాలి. ఇప్పుడూ మోడీ, అమిత్‌షాలు వారంలో రెండు సార్లు కూడా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రకరకాల సర్వేలు బిజెపి కి అనుకూలంగా వున్నట్టు వచ్చినా సమాజ్‌వాది పార్టీనే గెలుస్తుందని ఆత్మసాక్షితో సహా పలు సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఇండియా టుడే, సీ ఓటర్ కలసి చేసిన సర్వే దేశంలో మోడీకి ఎదురు లేదని బిజెపి మరోసారి కేంద్రంలో వచ్చేస్తుందని ప్రకటించింది. తమాషా ఏమంటే యు.పి లో యోగి విజయం మోడీకి ముఖ్యమని ఒక పల్లవి, కేంద్రంలో మోడీ వస్తారు గనక యు.పి లో యోగి ని ఎన్నుకోవాలని మరో పల్లవి బిజెపి ద్వంద్వ వ్యూహంగా వుంది.
మంత్రుల నిష్క్రమణ, ఎస్.పి లో చేరిక
బయిట ఎంత హంగామా చేసినా అంతర్గతంగా బిజెపిలో, యోగి ప్రభుత్వంలో ఆ విశ్వాసం లేదు. ఏకంగా ముగ్గురు మంత్రులు, దాదాపు పదిహేనుమంది ఎంఎల్ఎలు ఎన్నికల తరుణంలో బయిటకు రావడం సమాజ్‌వాది పార్టీలో చేరడం ఇందుకు అద్దం పడుతుంది. గతంలో వారు ఆ పార్టీకి బద్ద వ్యతిరేకులు. ఈ వెళ్లిన వారిలో బిసి, దళిత వర్గాల సీనియర్ నాయకులు, పలుసార్లు మంత్రులు, ఎంఎల్ఎలైన వారు వున్నారు. ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు హానికరంగా వ్యవహరిస్తోందని వారు సోదాహరణంగా ప్రకటించారు. టికెట్టు వచ్చే అవకాశం లేదని తెలిసి వారు వెళ్లిపోయారని బిజెపి నాయకత్వం తీసిపారేసి మాట్లాడుతున్నా వాస్తవంలో మాత్రం చాలా కంగారు పడుతున్నది. హఠాత్తుగా ముఖ్యమంత్రి యోగి ఒక దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేసి ఫోటోలు విడుదల చేయడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇదేగాక ఒక్కో నియోజక వర్గానికి యాభైమంది బి.సి నాయకులను పంపి వ్యతిరేకత పెరగకుండా ఆపాలని తంటాలు పడుతున్నారు. బి.సి ల విషయంలో బిజెపి ఇంతగా ఆందోళన చెందడానికి చాలా కారణాలే వున్నాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ ప్రచారంతో రెచ్చగొట్టడం బిజెపి మౌలిక ప్రాతిపదిక అయినా గుజరాత్లో వలెనే యు.పి లో కూడా ప్రత్యేక తరహా కుల కూటములు కట్టింది. ఎస్.పి ని ప్రధానంగా బలపర్చే యాదవ్ యేతర బి.సి లు, ఎంబిసి లు, బిఎస్పి ని బలపర్చే జాతవ్ యేతర ఎస్సి లు, స్వతహాగా తమతో వుండే అగ్రవర్ణాలు ఆ కూటమిలో వుండేవి. 2014లోనూ, 2017లోనూ మళ్లీ 2019లోనూ దాని ఆధారంగానే బిజెపి విజయం సాధించింది. ఇప్పుడు ఎంబిసిలు యాదవ్ యేతర బిసిలు ఎస్.పి వైపు వెళ్లడం వల్ల అఖిలేష్ బాగా బలపడే అవకాశమే దాన్ని భయపెడుతున్నది. ఎస్.పి కూడా గతంలో తనపై వున్న యాదవ ముస్లిం పార్టీ అన్న ముద్ర పోగొట్టుకుని విస్త్రుత తరగతులను కలుపుకోవడం అవసరని అఖిలేష్ గుర్తించారు. బిజెపి బి.సి నేతలలో ప్రజ్వరిల్లిన అసంతృప్తి ఇందుకు బాగా కలసివచ్చింది. ఇప్పుడు రాజీనామాలే కాదు, 2018 లోనే వంద మంది బి.సి ఎంఎల్ఎలు శాసనసభ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. వారిని దారికి తెచ్చుకునేందుకు బిజెపి అగ్ర నాయకత్వం నానా తంటాలు పడాల్సి వచ్చింది.
అమానుషాలు, అశాంతి
ఎస్.పి, బిఎస్పి పాలనలో నిర్లక్ష్యానికి గురైన బి.సి, ఎస్.సి కులాలను ప్రత్యేక శ్రద్ధతో చూస్తానని హామీ ఇచ్చిన యోగి ప్రభుత్వం ఆచరణలో దాన్ని ఘోరంగా ఉల్లంఘించింది. ఈ తరగతుల విద్యార్థులు సంఖ్యలో అగ్రవర్ణాల కంటే అయిదు రెట్లు ఎక్కువున్నా మధ్యాహ్న భోజనానికి సమానంగానే 700 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది వారాల్లోనే దళిత వర్గాలపై దాడులు పెరిగాయి. కోవిడ్ లోనూ కింది వర్గాలకు సహాయం తక్కువగా అందింది. గోరక్షణ పేరుతో దాడులు దేశంలోనే సంచలనం కలిగించాయి. హత్రాస్‌లో దళిత బాలికపై అత్యాచారంతో సహా ఎందరో దళిత మైనార్టి యువతులపై పాలక పక్ష ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల చేసిన అఘాయిత్యాలు జాతీయ స్థాయిలో శీర్షికలైనాయి. ఇటీవల రైతాంగ ఉద్యమం పశ్చిమ యు.పి లో పెద్ద ప్రభావం చూపింది. మామూలుగానే అది చరణ్‌సింగ్ కుటుంబ నాయకత్వాన్ని అనుసరించడం పరిపాటి. వారికి సంబంధించిన రాష్ట్రీయ లోక్‌దళ్ ఎస్.పి ని బలపరుస్తున్నది. లఖింపూర్ఖేర్లో స్వయంగా కేంద్రమంత్రి అజరు మిశ్రా కుమారుడు అభరు మిశ్రా ప్రజల పైకి కారు నడిపి ప్రాణాలు తీయడం అమానుషత్వానికి పరాకాష్ట. ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ రేట్లు తగ్గిస్తానని యోగి వాగ్దానం చేస్తున్నారు. ఆరోగ్య రక్షణ దేశంలోకెల్లా యు.పి లోనే అధ్వాన్నంగా వుందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. గంగానదిలో శవాలు కొట్టుకుపోవడం గగుర్పాటు కలిగించింది. నిరుద్యోగం పెరుగుదల అన్నిటికన్నా పెద్ద సవాలుగా వుంది. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి స్వయంగా అనేకసార్లు ఆందోళన వెలిబుచ్చుతూనే అందుకు మరెవరో కారణమన్నట్టు వారిపై కఠిన చర్యలు తీసుకుంటు న్నట్టు ప్రకటించినా పాలక పార్టీ నేతలే వరుసగా నేరాలలో నిందితులుగా కోర్టుకెక్కాల్సి వచ్చింది. తాజాగా హరిద్వార్ ధర్మ సంసద్‌లో నారాయణ సింగ్ కోర్టులు, ప్రభుత్వాలు, పార్టీలన్నిటిపైనా విషం గక్కుతూ చేసిన విద్వేష ప్రసంగం ఎంత దాచినా దాగకుండా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
ఇవన్నీ తన పునాదిని బాగా దెబ్బ తీశాయని తెలిసినా మేకపోతు గాంభీర్యంతో యోగి గత ఏడాది పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. భారీ ఖర్చుతో ప్రచారం నిర్వహించారు. కోవిడ్ రెండవ వేవ్‌లో ఎన్నికలు జరపడం వల్ల 700 మంది సిబ్బంది చనిపోయారు. వ్రతం చెడినా ఫలం దక్కలేదన్నట్టు ఇంత చేసినా బిజెపి ఫలితాల్లో వెనకబడిపోయింది. ఎస్.పి కి చెందిన 900 మందికి పైగా అభ్యర్థులను తనవారిగా ప్రకటించుకని జెడ్.పి ల కోసం భారీగా ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది. మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసి లోనూ అయోధ్య, మధుర లోనూ కూడా ఎస్.పి ఎక్కువ స్థానాలు సాధించింది. అలాగే యోగి అదివరకు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో లోక్‌సభó ఉప ఎన్నికలలో బిజెపి ఓటమి చవిచూసింది. ఈ పరిస్థితులలో చిన్నచితక పార్టీలతో పొత్తు పెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకుంది గాని తమ నుంచే భారీ ఫిరాయింపులు జరగడంతో అంతా బెడిసికొట్టింది. అయినా ఆరెస్సెస్ స్వయంగా బాధ్యత తీసుకుని వివిధ అనుబంధ సంఘాలకు ప్రచారం, పోలింగు బాధ్యతలు అప్పగిస్తున్నది. అయోధ్యలో రామమందిరం గురించి ప్రచారం పెంచడంతో పాటు వారణాసి ఆలయంలో విస్తరణ పేరిట మోడీ భారీ ప్రచారంతో పర్యటించడం ఇందుకోసమే. ఎవరేమి చేసినా హిందూత్వ తమను గట్టెక్కిస్తుందనీ, మైనార్టీ వ్యతిరేక ప్రచారం పనిచేస్తుందని, ప్రతిపక్షాల ఓట్ల చీలికతో సీట్లు వస్తాయని కొన్ని బలమైన భావనలు బిజెపి ప్రచారంలో పెట్టింది.
ముస్లిం, ఎస్.సి ఓటర్ల ప్రభావం
ముప్పై ఏళ్ల కిందట 1992లో బాబ్రీ మసీదు విధ్వంసంతో ఆ రాష్ట్రంలోనే గాక దేశమంతటా మైనార్టీలలో అభద్రత పెంచిన మాట నిజమే గాని వారు యు.పి లో సంప్రదాయికంగా ఎస్పి కి ఓటు వేస్తూ వస్తున్నారు. ఇది సహించలేకనే యోగి ప్రచారం ప్రారంభంలోనే 'ఇది 80 శాతానికి 20 శాతానికి మధ్యన పోటీ' అంటూ హిందూ ముస్లిం విభజనకు ప్రయత్నించారు. కాని స్వతహాగా సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన బిజెపి తన అసలు రూపం బయిట పెట్టుకోవడంతో మంత్రులే బయిటకు నడుస్తున్నారు. ముస్లింల విషయానికి వస్తే యు.పి జనాభాలో 20 శాతం (19.6) ముస్లిములున్నారు. 143 నియోజక వర్గాల్లో వీరు జయాపజయాలను ప్రభావితం చేయగలరు. 36 చోట్ల వారే గెలుస్తుంటారు. మజ్లిస్ నేత ఒవైసీ యు.పి లో రంగప్రవేశం చేసి ఈ ఓట్లను చీల్చడం ద్వారా బిజెపి కి మేలు చేశారనే ఆరోపణలున్నాయి. గతసారి 38 చోట్ల పోటీ చేసిన మజ్లిస్ ఈదఫా ఇప్పటికే 25 మందిని ప్రకటించింది. పైకి తీవ్రంగా విమర్శించుకున్నా పరోక్షంగా ఇది బిజెపి కి మేలు చేస్తుందని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయం కూడా వుంటుందని బలమైన అభిప్రాయం.
యు.పి లో రిజర్వుడు నియోజక వర్గాల ఫలితాలు కూడా నిర్ణయాత్మక ప్రభావం చూపిస్తాయి. 21 శాతం ఎస్.సి జనాభా వుందని అంచనా. 84 ఎస్.సి, రెండు ఎస్.టి స్థానాలున్నాయి. గత రెండు దశాబ్దాల ఎన్నికలను పరిశీలిస్తే ఈ స్థానాలలో ఎవరు 60 శాతం పైన తెచ్చుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాయావతి బిఎస్పి తోనే ఈ సీట్లు వెళతాయనుకోవడానికి అవకాశం లేదు. అందుకే ఆమె పలుసార్లు బిజెపితో చేతులు కలపడం, సర్వజన సిద్ధాంతం తెచ్చి బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం చూస్తాం. 2002లో ఈ సీట్లలో బిజెపి 35, బిఎస్పి 24 తెచ్చుకున్నాయి. 2007లో బిఎస్పి నే 61 స్థానాలు తెచ్చుకోవడంతో మాయావతి పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2012, 2017లోనూ ఈ పరిస్థితి మారింది లేదు. కాకుంటే 2017లో సుప్రీం కోర్టు తీర్పు కారణంగా రెండు ఎస్.టి సీట్లు కేటాయించారు. మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఈ ఎన్నికలలో బిజెపి 70 స్థానాలు అంటే 81 శాతం తెచ్చుకుంది. అప్నాదళ్, ఎస్‌బిఎస్‌పి దానితో పాటు చెరి మూడు తెచ్చుకోగా బిఎస్పి రెంటికే పరిమితమైంది. ఎస్.పి ఏడు, ఒకటి ఇండిపెండెంటు పొందారు. ఈ స్థానాలలో తన బలం పెద్దగా పెరిగిందనే విశ్వాసం లేకనే మాయావతి ఎన్నికల పోరాటంలో ఒకింత నిరాసక్తయోగం ప్రదర్శిస్తున్నారు. తను గట్టిగా పోటీలో దిగితే గెలవడం వుండదు గాని ఓట్ల చీలిక ఎస్.పి ని గెలిపిస్తుందనే అంచనా ఆమెను వెనక్కు లాగుతున్నది. గతంలో నాలుగుసార్లు బిజెపితో జతకట్టిన మాయావతి ఏ అవకాశమైనా ఉపయోగించుకోగలరని చరిత్ర చెబుతున్నది.
వివిధ పార్టీల పోటీలు
ఈ క్రమంలో కాంగ్రెస్ విషయం కూడా తప్పక చెప్పుకోవాలి. 2017లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పట్లో కాంగ్రెస్‌కు 105 సీట్లు కేటాయించగా 11 మాత్రమే తెచ్చుకుంది (ఒక విధంగా ఇది బీహార్‌లో ఆర్జేడీ విషయంలోనూ పునరావృతమైంది). 2019లో రాహుల్ గాంధీ కుటుంబ నియోజక వర్గమైన అమెథీ లోనే ఓడిపోయారు. ఇప్పుడు ప్రియాంక వదేరా అక్కడే మకాం వేసి కొంత మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నా పెద్ద తేడా లేదు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని అర్థం వచ్చేట్టు మాట్లాడి మళ్లీ సవరించుకుంటున్నారు. సిపిఐ నలభై స్థానాల వరకూ పోటీ చేస్తుంటే, సిపిఎం పోటీకి ఆరు స్థానాలను నిర్ణయించింది. బిజెపి వ్యతిరేక ఓట్ల చీలిక నివారించడం కోసం, తాము ఎస్.పి కి మద్దతునిస్తామని ప్రకటించింది. అన్ని స్థానాలలో తాము పోటీ చేస్తామన్న ఆప్ పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించింది. జెడియు బిజెపితో పొత్తు పెట్టుకోగా ఆర్జేడీ వంటరిగానే తలపడుతున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదట టిఎంసి పోటీ చేస్తుందని చెప్పినా తర్వాత ఎస్పికి మద్దతు ప్రకటించడమే గాక ప్రచారానికి వస్తున్నారు. కెసిఆర్ కూడా బిజెపి వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటారని మొదట చెప్పినా ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల వెళ్లరంటున్నారు. గతంలో ములాయం సింగ్ సోదరుడైన శివలాల్ యాదవ్ అఖిలేష్‌తో విభేదించి వేరే పార్టీ పెట్టుకోవడం కూడా ఓట్ల చీలిక పెంచింది. ఇప్పుడు కూడా ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ వంటి వారిని బిజెపిలో చేర్చుకుని చాలా ప్రచారం చేస్తున్నా వారి రాజకీయ పునాది నామమాత్రం. ఎవరితో పొత్తులు వుండవని 2020లో ప్రకటించిన అఖిలేష్ ఇప్పుడు చరణ్‌సింగ్ మనవడైన జయంత్ చౌదరి నాయకత్వం లోని ఆర్ఎల్డి తో అవగాహన కుదుర్చుకున్నారు. బిజెపి అప్నాదళ్, నిషద్ పార్టీలతో సర్దుబాట్లతో సామాజిక తరగతులను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నది. యోగి నిరంకుశ పాలనపై వ్యతిరేకత కారణంగా ఈసారి బిజెపి ఓటమి ఖాయమనే భావన బలంగా వున్నా అది ఓట్ల లోకి మారుతుందా, ప్రతిపక్షాల మధ్య చీలిక, కుల మత పొందికల ప్రభావం ఎలా వుంటుందో చూడవలసిందే. యు.పి శాసనసభ లోని 403 స్థానాలకు ఫిబ్రవరి మార్చి మధ్య ఎనిమిది దశల పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకూ బహిరంగ సభలను ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. వర్చ్యువల్ ప్రచారం నడుస్తున్నది. కోవిడ్ తీవ్రతను బట్టి ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుంది.
తెలకపల్లి రవి











