Jul 18,2021 12:17

మనలో చాలామంది నాలుగు పదులు దాటితేనే జీవితం అయిపోయినట్లు భావిస్తూ ఉంటారు. ఇకపై తామేమీ సాధించలేమని, నిరుత్సాహంతో లేని వృద్ధాప్యాన్ని మీదనేసుకుని కుంగిపోతూ ఉంటారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వయసు అడ్డంకి కాదని, అది కేవలం ఒక అంకె మాత్రమేనని తమిళనాడుకు చెందిన ధనబాకియం అమ్మాళ్‌ మరోసారి నిరూపించారు. 65 ఏళ్ల వయస్సులోనూ చదువు నేర్చుకుంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారామె.

     కోవిడ్‌-19 కారణంగా అనుకోకుండానే పాఠశాలలు మూతపడ్డాయి. దాంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తమిళనాడులో 2020 నవంబర్‌ 'కార్పోమ్‌ ఎజుధువోమ్‌(Karpom Ezhudhuvom)' బ్యానర్‌లో వయోజన అక్షరాస్యతను ప్రారంభించారు. కోవిడ్‌ రెండవ వేవ్‌ మొదలయ్యేటప్పటికీ ఇదీ మూతపడి అందులోని విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఈ సంక్షోభ సమయాన్ని కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు తమిళనాడు తిరుచ్చికి చెందిన 65 ఏళ్ల విద్యార్థిని ధనబాకియం అమ్మాళ్‌.
 

                                                                      ఆసక్తి చూపలేదు

   'ఈ కార్యక్రమం మొదలెట్టినప్పుడు గడప గడపా తిరిగి ప్రచారం చేశాము. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అమ్మాళ్‌ మాత్రం తనకు చదువంటే ఇష్టమనీ.. తాను తరగతులకు వస్తాననీ ఆసక్తి చూపింది. ఆమె గతంలో అంగన్వాడీ ఆయాగా పనిచేసి, రిటైర్‌ అయ్యింది. తానెప్పుడూ ఒక్కసారైనా జీతం తీసుకునే సమయంలో వేలిముద్రకు బదులుగా సంతకం చేయాలని చెబుతూ ఉండేది. ఆ సంకల్పబలమే మేము చెప్పగానే ఆమె ఒప్పుకునేలా చేసింది. ప్రతిరోజూ తప్పకుండా క్లాసులకు హాజరయ్యేది. చాలా తెలివైన విద్యార్థిని. చెప్పినవి చెప్పినట్టే వెంటనే నేర్చుకోగలదు. ప్రస్తుతం మూడవ తరగతి విద్యార్థి ఎలా చదవగలరో అలా చదువుతోంది. మూడు అక్షరాల పదాలను స్వయంగా రాయగలదు. వార్తా పత్రికల్లోని శీర్షికలను చదవగలుగుతోంది. ఒక్కోసారి చదువుపై ఆమె చూపే ఆసక్తి చూసి మాకే ఆశ్చర్యమేస్తోంది. కోవిడ్‌ సమయంలోనూ ఆమె వయస్సును పట్టించుకోకుండా ప్రతిరోజూ నా దగ్గరకు వచ్చి, పాఠాలు నేర్చుకునేది. ఆమెకు చదువు నేర్పే అవకాశం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఊర్లో 75 ఏళ్ల యశోదా బాగా చదువుతారుగానీ ఆమె వయసురీత్యా రాయలేరు' అంటోంది కోతమంగళం గవర్నమెంట్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్రారాణి.

వయసు అంకె మాత్రమే..


                                 

                                                                   సమయం దొరకలేదు

    'మొదటి నుంచి చదువు నేర్చుకోవాలనే ఆసక్తి నాకెప్పుడూ ఉంది. కానీ సమయం ఉండేది కాదు. ఈ జన్మకు నిరక్ష్యురాస్యురాలినే అనుకున్నా. కానీ చిత్రారాణి మేడం ప్రేరణ వల్లే ఇదంతా సాధించగలిగాను. మనలో సాధించాలనే పట్టుదల ఉంటే ప్రపంచమే తన మార్గాన్ని మార్చుకుంటుందనే విషయాన్ని తెలుసుకున్నా' అంటోంది అమ్మాళ్‌. ఇప్పుడు టీచర్స్‌ వాట్సప్‌ గ్రూప్స్‌, సోషల్‌ మీడియాల్లో ఎక్కడ చూసినా అమ్మాళ్‌ చదువు నేర్చుకుంటున్న వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న తిరుచి చీఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ఆర్‌ అరివజగన్‌, జిల్లా ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌తోపాటు మరికొంత మంది అధికారులు ఆమెను ఘనంగా సన్మానించారు.