Nov 09,2022 21:37

కోళ్ల వ్యర్థాలతో కొల్లేరు కలుషితం
తక్కువ వ్యవధిలో అధిక లాభాలే కారణం
హైదరాబాద్‌ నుంచి కోడి వ్యర్థాల దిగుమతి
అర్థరాత్రి సమయాల్లో దొంగచాటుగా రవాణా
అడపాదడపా దాడులతో పోలీసులు సరి
రాజకీయ నాయకుల చెరువులకూ ఇదే మేత..!
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

వ్యర్థాలతో కొల్లేరు నిండిపోతుంది.. కోళ్లవ్యర్థాల మాఫియా కబంధహస్తాల్లో చిక్కుకుని కొల్లేరు అభయారణ్యం విలవిల్లాడుతోంది.. ఆరోగ్యప్రధాయనిగా ఉండాల్సిన మత్స్యసంపదను తన స్వలాభం కోసం విషతుల్యం చేస్తోంది. సంప్రదాయ మేతలకు బదులుగా అధిక దిగుబడులు, అధిక లాభాలకు ఆశపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
కొల్లేరును కోళ్ల వ్యర్థాల మాఫియా కమ్మేసింది. అర్థరాత్రి సమయాల్లో దొంగచాటుగా ఇతర ప్రాంతాల నుంచి ఐషర్‌, బొలేరో వంటి వాహనాల్లో దిగుమతులు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా చేపల చెరువుల్లో మేతగా వేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో సుమారు 70 వేల ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. ఈ కొల్లేరులో, దాని అనుబంధ గ్రామాల్లో చేపల సాగు అధికంగా సాగుతోంది. ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌, కోల్‌కతా, ముంబాయి ఇతర ప్రాంతాలకు ప్రతిరోజూ లారీలతో చేపలను ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో చేపల మేత ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయం వైపు కొందరు చేపల చెరువుల రైతులు చూస్తున్నారు. దాన్నే అదునుగా భావించిన కోళ్ల వ్యర్థాల మాఫియా రంగంలోకి దిగింది. హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం నుంచి కోళ్ల వ్యర్థాలను ఇక్కడకు తరలించి వాటిని చేపలకు మేతగా దిగుమతి చేస్తున్నారు. ఈ మాంసాహారాన్ని తిని ఎదిగే చేపలను వినియోగిస్తే భవిష్యత్తులో భయంకరమైన రోగాల బారిన పడతారని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పెదపాడు, దెందులూరు మండలాల్లోనే..!
ప్రతిరోజూ అర్ధరాత్రి సమయాల్లో ఐషర్‌ వ్యాన్‌లలో, బొలేరో వాహనాల్లో పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల్లోని కొల్లేరు గ్రామాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల వ్యర్థాలు వెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసుల కదలికలను బట్టి ఈ వాహనాలు రూటు మార్చుకుంటూ ఈ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ హనుమాన్‌జంక్షన్‌ మీదుగా కొన్ని, పెరికీడు నుంచి పెదపాడులోకి మరికొన్ని, ఉండ్రాజవరం నుంచి ఇంకొన్ని వాహనాలు ఈ మండలాల్లోని చెరువుల వద్దకు వస్తున్నాయి. మరికొన్ని విజయరాయి మీదుగా ఏలూరు నగరం మీదుగా పోణంగి, మాదేపల్లి సమీప ప్రాంతాల్లోని చెరువులకు వెళ్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఈ వాహనాలు రావడానికి అరగంట ముందునుంచి కొందరు యువకులు ద్విచక్రవాహనాల్లో స్థానికంగా తిరుగుతూ పోలీసులు గస్తీ కాస్తున్నారా? లేదా? లేక ఇతర శాఖల అధికారులేమైనా వాహనాలను పట్టుకునేందుకు కాపుకాశారా? అనేదానిపై రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత కార్లలో ఆ వాహనాల ద్వారా వ్యర్థాలను తరలించే మాఫియా ప్రతినిధులు రంగప్రవేశం చేసి తుది రెక్కీ నిర్వహిస్తారు. అంతా పక్కా అనుకున్న తర్వాత వాహనాలను జిల్లాలోకి రానిస్తున్నారు. ఇన్ని చేసినా పోలీసులు అడపాదడపా దాడులు చేసి వాటిని పట్టుకుంటున్నారు.
తప్పించుకుంటున్నారా..? తప్పిస్తున్నారా..?
ఈ కోళ్ల వ్యర్థాల తరలింపు ఎంతోకాలం నుంచి కొనసాగుతోంది. అయినప్పటికీ దీన్ని అధికారులు అరికట్టలేకపోవడంపై సర్వత్రా విమర్శలూ, అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ మాఫియాకు అధికారుల అండదండలున్నట్లు పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ మాఫియాలో భాగస్వాములయ్యారని, వారి చెరువులకు కూడా కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఆయా శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు పంపించడం వల్ల వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. వాస్తవానికి ఈ వ్యర్థాల రాకపోకలను అడ్డుకోవాలంటే అడ్డుకోవచ్చు. చెరువుల వద్దకు వెళ్తే ఎక్కడ వ్యర్థాలు వేస్తున్నారు? ఎక్కడ వేయ్యడం లేదని గుర్తించడం చాలా సులభం.. కానీ అధికారులు ఆ దిశగా ఏనాడూ అడుగులు వేయలేదు. దీన్నిబట్టే వారు ఇందులో భాగస్వాములయ్యారని పలువురు విమర్శించడం గమనార్హం. అతితక్కువ ధరకు ఈ వర్థాలను హైదరాబాదులో కొనుగోలు చేసి ఇక్కడ కిలోల లెక్క చెరువుల యజమానులకు విక్రయించడం వల్ల అధిక లాభాలు వస్తున్నాయి. ఇటీవల పెదపాడు మండలంలో ఈ వ్యర్థాల తరలింపు విషయంలో వివాదం తలెత్తడంతో ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతడిని ఈ వ్యర్థాల మాఫియా హతమార్చిందని అతని బంధువులు ఆరోపించడం గమనార్హం.