ప్రజాశక్తి -పిఎం.పాలెం : చెత్త పోగులు తొలగింపులో అలసత్వం ప్రదర్శించరాదని శానిటేషన్ అధికారులను జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్‌వర్మ ఆదేశించారు. శుక్రవారం ఆయన జోన్ -2లోని 5, 7 వార్డుల పరిధి శ్యామ్‌నగర్ కాలనీ, స్వతంత్రనగర్, మల్లయ్యపాలెం, ఆర్‌టిసి కాలనీ తదితర ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వార్డులో అధికంగా చెత్తపోగులు కనిపిస్తున్నాయని, రోడ్లు స్వీపింగ్ సరిగా చేయడం లేదని, వెంటనే చేత్తపోగులు ఎత్తించి రోడ్లను శుభ్రపరచాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. శ్యామ్‌నగర్ కాలనీ బాలుర వసతి గృహం వద్ద అధికంగా వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 6 గంటల నుండి విధుల్లో ఉండాలని, పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేసి, ఎవ్వరికి నిర్దేశించిన పనులను వారిచే చేయించాలని ఆదేశించారు. ప్రధానంగా కాలువలు, గెడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహించి శుభ్రపరచాలన్నారు. నిర్ణీత సమయానికే క్లాప్ వాహనాలు పాయింట్‌లలో ఉండాలని, వాహనాలు డైరీ తప్పనిసరిగా రాయాలని చెప్పారు. వార్డులలో పందులు అధికంగా కనిపిస్తున్నాయని, వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. ఫ్రైడే -డ్రైడే సందర్భంగా దోమలు వృద్ధిని అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం సీతకొండ వద్ద వైఎస్‌ఆర్ వ్యూ పాయింట్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజినీరు రవికృష్ణ రాజు, పట్టణ ప్రణాళికా అధికారి బి.సురేష్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంసన్ రాజు, జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










