ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్లలోని విస్తరణ శిక్షణా కేంద్రంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలులో భాగంగా రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ఆదివారం జరిగింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి జివి నారాయణరెడ్డి గ్రామాల్లో వ్యర్ధాల నిర్మూలన, స్వచ్ఛతా కార్యక్రమాల అమలు అంశంపై మాట్లాడారు. గ్రామాలలో రోజువారీ చెత్త సేకరణలో వచ్చిన ప్లాస్టిక్‌ని శుద్ధి చేసి, ప్లాస్టిక్ ష్రెడ్డెర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేస్తే వాటిని రోడ్లు నిర్మాణాలలో, టీషర్ట్‌ల తయారీ వంటి వాటిలో ఉపయోగించవచ్చని తెలిపారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా చేయాలని, అందుకు ముందుగా ప్రజలలో ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించి వాటి స్థానంలో జ్యూట్ బ్యాగ్, పేపర్ బ్యాగ్‌లను ఉపయోగించేలా మార్పు తీసుకొని రావాలని తెలిపారు. వర్క్ షాప్‌లో పలు అంశాలపై కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన శిక్షకులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో 13 జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు, డిపిఆర్‌సి జిల్లా సమన్యయకర్తలు, ఎండివోలు, ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు.










