
ప్రజాశక్తి-గుంటూరు: కర్బన వ్యర్థాల నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుందని, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, వ్యర్థాల సేకరణకు ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ది ఇంటర్నేషనల్ వియన్నా ఎనర్జీ అండ్ క్లైమేట్ ఫోరం కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శుక్రవారం జరిగిన సొల్యూషన్ సెషన్‌లో పాల్గొన్న నగర కమిషనర్ గుంటూరులో ఘన వ్యర్థాల నిర్వహణలో తీసుకున్న ఆధునిక విధానాలను వివరించి, అనంతరం బయో ఎనర్జీ ప్లాంట్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కర్బన వ్యర్థాల నిర్వహణ అనేది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతో కీలకమని, అందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో 500 కిలో వాట్ల సామర్ధ్యంతో ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నగరంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ-ఆటోలకు చార్జింగ్‌కు ఉపయోగిస్తున్నామని తెలిపారు. నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను సాంకేతిక విదానం ద్వారా నిర్వహణ చేయడం ద్వారా జీరో ల్యాండ్ ఫిల్ దిశగా కషి చేస్తున్నామన్నారు. డంపింగ్ యార్డుల్లో గతంలో ఉన్న వ్యర్థాలను బయో మైనింగ్ విధానం ద్వారా ప్రాసెసింగ్ చేస్తున్నామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ వ్యర్థాల నిర్వహణలో తీసుకున్న వినూత్న విధానాలకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో వచ్చిన గుర్తింపును వివరించారు. రానున్న రోజుల్లో నగర ప్రజల సహకారం, భాగస్వామ్యంతో వ్యర్థాల నిర్వహణ మరింత పగడ్బందీగా చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వియన్నాలోని బయో ఎనర్జీ ప్లాంట్‌ని సందర్శించి ప్లాంట్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.