Aug 14,2023 18:50

నిండిన వ్యర్థాలను పరిశీలిస్తున్న నాయకులు

నిండిన వ్యర్థాలను పరిశీలిస్తున్న నాయకులు
వ్యర్ధాలతో నిండిపోతున్న పంటకాలువలు
ప్రజాశక్తి-నెల్లూరు:నెల్లూరు చెరువు నుంచి వస్తున్న పంట కాలువలు నగరంలో వ్యర్ధాలతో నిండిపోయి దుర్గందభరితంగా దోమల ఫ్యాక్టరీలుగా మారిపోయాయని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. సోమవారం నగర నియోజకవర్గం పరిధిలో 9వ రోజు 47,48, 49,50 వార్డులలో కొనసాగిన సిపిఎం- ప్రజా పోరుయాత్ర నిర్వహించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం - ప్రజా పోరుయాత్ర పేరుతో జరుగుతున్న పాదయాత్ర 9వ రోజు రాజేంద్రనగర్‌లోని మహాలక్ష్మి గుడి సెంటర్‌ నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి.చంద్రారెడ్డి ప్రారంభించారు
. పాదయాత్ర 47,48,49 ,50 డివిజన్ల పరిధిలోని విరాట్‌ నగర్‌, ఆనం వెంకటరెడ్డి నగర్‌, జయలలిత నగర్‌, ఈద్గా మిట్టా, తూకుమానుమిట్ట, సంతపేట, ములుముడి బస్టాండ్‌ సెంటర్‌ ప్రాంతాల మీదుగా కొనసాగింది.ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు చెరువు నుండి వెళ్లే పంట కాలవలు నగరంలో వ్యర్ధాలతో నిండిపోయి దుర్గంధ భరితంగా తయారయ్యాయని అన్నారు. ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ, గచ్చు కాలువ మొదలైన ప్రధాన పంట కాలవలు పూర్తిగా మురుగు కాలువలుగా తయారయ్యి ఉన్నాయన్నారు. ఇవి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారై ఉన్నాయన్నారు. వీటివల్ల ప్రజలు అంటువ్యాధులు, విష జ్వరాలు బారిన పడుతున్నారన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో కాలువల పూడికతీత పేరుతో కోట్ల రూపాయలు డ్రా చేస్తున్నారన్నారు. ఆ నిధులతో కాలువల పూడిక తీయకుండా ఏమి చేస్తున్నారన్నారు. నగర ఎంఎల్‌ఎ, ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ వీటిపై దష్టి సారించకపోవడం విచారకరమన్నారు. వర్షాకాలంలో ముంపునకు గురయ్యే సందర్భంలో పేరుకు వీటిని సందర్శిస్తారన్నారు.తక్షణమే అన్ని కాలువలు పూడికతీత తీయించి, రివిట్మెంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతాలలోని సైడు కాలువలలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందన్నారు. మున్సిపల్‌ కార్మికులు సరిపడినంత సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని,తక్షణమే కార్మికులను పెంచాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్‌ మస్తాన్‌బీ, పి.చంద్రారెడ్డి, పి.సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు అత్తిమూరి శ్రీనివాసులు, బీపీ నరసింహ, కత్తి పద్మ, పి.వేణు, శాఖ కార్యదర్శి రాజేంద్ర, ఫయాజ్‌, స్థానిక నాయకులు సురేష్‌, ఈశ్వరయ్య,చ కర్తం బాబు, రెహనుమా తదితరులు పాల్గొన్నారు.