మాచర్ల: వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించి సహాయం పొందాలని సీనియర్ సివిల్ జడ్జి శారద అన్నారు. స్థానిక వివేకానంద స్టూడెంట్ హోమ్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వృద్ధులు తమ కుటుంబ సభ్యుల నుంచి, ఆస్తి వివాదాల్లో కానీ ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా అనాధ పిల్లలకు, వయోవృద్ధులకు వివేకానంద స్టూడెంట్ హోమ్,వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఏడుకొండలు, శ్రీనివాసరావు, అనిల్, ఉపాధ్యాయులు మాధవి, ప్రసాద్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.










