అనంతపురం కలెక్టరేట్ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, దానిని యథావిధిగా కొనసాగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వయోజన దూర విద్య కోర్సును కొనసాగించాలని, యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం ఎస్‌కెయు ఎడి బిల్డింగ్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎఐఎస్‌ఎ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్ బాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, ఎఐఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు వేమన, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణయ్య కుళ్లాయిస్వామి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఎంఎ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును మూసివేయడానికి రంగం సిద్ధం అయ్యిందన్నారు. గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నత విద్యను అందించడంతోపాటు ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత ఎస్‌కెయకు ఉందన్నారు. ఇటీవల అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ట తగ్గుతోందన్నారు. ఒక్కొక్క విభాగాన్ని మూసి వేస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఎంఎ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్స్ మూసివేయాలని యూనివర్సిటీ అధికారులే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కోర్సులను పెంచాల్సింది పోయి, ఉన్న వాటిని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరనే సాకుతో కోర్సులు మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్లు లేకపోతే వాటికి భర్తీ చేయాలని కానీ, ఇలా కోర్సులు తీసేయడం సరికాదన్నారు. యూనివర్సిటీని అభివద్ధి చేయడానికి వైస్ ఛాన్సలర్ ఉన్నారో.. లేక ఉన్న కోర్సులను తొలగించేందుకు ఆయన ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కోర్సులను ఎత్తేలా నిర్ణయాలు తీసుకుంటున్న ఎస్‌కెయు విసి రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. కోర్సులు ఎత్తివేయాలని చూస్తే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. త్వరలో యూనివర్సిటీ సమస్యలపైన రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. అనంతరం రిజిస్ట్రార్ లక్ష్మయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కోశాధికారి హనుమంతు, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఉమా మహేష్, వంశీ, రజిని తదితరులు పాల్గొన్నారు.










