ప్రజాశక్తి-గుర్ల : జగనన్న ఆరోగ్య సురక్షలో వ్యక్తుల భవిష్యత్ వైద్య చికిత్సలో ఆరోగ్య ప్రొఫైల్ కీలకం కానుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైద్య శిబిరాల్లో నిర్వహించిన వ్యాధి నిర్ధారణ పరీక్షల సమాచారంతో ప్రతి వ్యక్తికీ ఒక హెల్త్ ప్రొఫైల్ రూపొందించడం జరుగుతుందని అన్నారు. శిబిరాల్లో అందజేసే హెల్త్ ప్రొఫైల్‌ను ప్రతిఒక్కరూ భద్రపరచి జాగ్రత్తగా వుంచుకోవాలని సూచించారు. గుర్ల మండలం చింతలపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం సందర్శించి శిబిరం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కంటివెలుగు కింద ఇద్దరు మహిళలకు కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి ప్రజలంతా ఈ శిబిరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పరిష్కరించి నయం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అంతకు ముందు వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌరీశంకర్, ఆర్‌డిఒ అప్పారావు, ఎంపిపి పొట్నూరు ప్రమీల, జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు, డిఎస్‌పి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
గరివిడి : ప్రజల ఆరోగ్య రక్షణ కోసం క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇక్కడ అందజేసే కార్డులు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయని భద్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం గ్రామాల్లో ఇంటింటికీ వచ్చి ఆరోగ్య వివరాలను నమోదు చేయటం గతంలో ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామస్థాయిలో శిబిరాలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు. గరివిడి మండలం వెదుళ్లవలసలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలతో మాట్లాడారు. దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఈ సందర్భంగా మంత్రిని కలిసి సమస్యను విన్నవించుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, డిఎంహెచ్‌ఒలను ఆదేశించారు. శిబిరంలో భాగంగా సుమారు 500 మందికి సురక్ష కిట్లను, 98 మందికి కళ్లజోళ్లను మంత్రి, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపిడిఒ, , ఇతర వైద్య అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










