Nov 29,2022 22:00

ప్రజాశక్తి - ఏలూరు
           డిసెంబర్‌ ఆరో తేదీ నుండి పదో తేదీ వరకూ జిల్లాలోని ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెంలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభ, వివిధ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.రవి కోరారు. మంగళవారం స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద మహాసభల ప్రచార యాత్ర ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అధ్యక్షత వహించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి సిఐటియు జిల్లా నాయకులు పి.కిషోర్‌, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్‌ పి.ఆదిశేషులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. సంఘం రాష్ట్ర మహాసభ జిల్లాలో తొలిసారిగా జరగడం సంతోషదాయకమన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి, కూలీల ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. డిసెంబర్‌ ఆరో తేదీన ప్రజా సమస్యలపై ఫొటో ఎగ్జిబిషన్‌, ఉచిత వైద్య శిబిరం, ఏడో తేదీన హైస్కూల్‌, కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. వీటికి ప్రముఖ కళాకారుడు గోరటి వెంకన్న ముఖ్య అతిధిగా హాజరవుతారన్నారు. ఎనిమిదో తేదీన జంగారెడ్డిగూడెంలో వేలాది మందితో ప్రదర్శన, బహిరంగసభ ఉంటుందని తెలిపారు. ఎంపికైన 500 మంది ప్రతినిధులతో మహాసభ జరుగుతుందన్నారు. ఇందులో వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయ కార్మికుల భూమి, కూలీ, ఉపాధి అంశాలపై పోరాట కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ సంపూర్ణంగా జయప్రదం కావాలని కె.శ్రీనివాస్‌ ఆకాం క్షించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి రైతు, వ్యవసా య కార్మికుల ఐక్యత ఎంతగానో దోహదపడు తుం దన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు బి.సోమయ్య, ఎస్‌.మహంకాళీ, బి. జగన్నా ధరావు, వి.సాయిబాబు, ఎ.శరత్‌ చంద్ర, గోపి, మీసాల సత్యం, కోటేశ్వరరావు, జాన్‌ బాబు పాల్గొన్నారు.
ఉంగుటూరు:వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి జంగారెడ్డిగూడెంలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని గొల్లగూడెం, గోపినాథపట్నం, నారాయణపురం, ఉంగుటూరు గ్రామాల్లో ప్రచారయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉంగుటూరు మండల కార్యదర్శి కొక్కిరిపాటి వెంకట్రావు, ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు నక్క సుబ్బారావు, పుల్ల పెద్దిరాజు, కొయ్యే బజారు, పుల్ల నరసింహమూర్తి, కె.జయరాజు, సిహెచ్‌.గోపి, పి.రాజు, ఆనందరావు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : వచ్చేనెల 8, 9, 10 తేదీల్లో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం పిలునిచ్చారు. మంగళవారం మహాసభ నేపథ్యంలో డిసెంబర్‌ ఎనిమిదో తేదీన జరిగే బహిరంగ సభలో కార్మికులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచారయాత్రను సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడారు. సంపద సృష్టికర్తలైన వ్యవసాయ కార్మికుల రాష్ట్ర మహాసభ ప్రచారం నిమిత్తం పట్టణంలో ప్రారంభమైన యాత్ర కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుకునూరు, టి.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో మూడు రోజులపాటు పర్యటించి మహాసభ ప్రచారం చేస్తారని తెలిపారు. ఈ ప్రచారయాత్రలో సంఘం రాష్ట్ర నాయకురాలు తామ ముత్యాలమ్మ, తుమ్మల సత్యనారాయణ, ఆర్‌ దానియేలు, సముద్రాల సాయి కృష్ణ, పి.సూర్యారావు, జి.సూర్యకిరణ్‌, ప్రభాకర్‌రావు, చంటి పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్ల బోయిన రాంబాబు అన్నారు. మంగళవారం వచ్చేనెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభ ఆటో ప్రచారయాత్ర కొయ్యలగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం నుండి ప్రారంభమై ఈ యాత్ర బయ్యనగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం మీదుగా పోలవరం వెళ్లనుందన్నారు. ఈ ప్రచారయాత్రలో అన్నవరం సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి తామ ముత్యాలమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు కారం భాస్కర్‌రావు, జిల్లా నాయకులు సముద్రాల సాయికృష్ణ, సిఐటియు నాయకులు ముళ్లపూడి సురేష్‌, షేక్‌ జానీ పాల్గొన్నారు.