ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
వచ్చేనెల 8, 9, 10 తేదీల్లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘ సమావేశం టి.రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ వ్యవసాయ కూలీల, ఉపాధి కూలీల, పేదల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న సంఘం వ్యవసాయ కార్మిక సంఘమన్నారు. రాష్టంలో రైతాంగ ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతూ వాళ్ల పోరాటాలకు సంపూర్ణ మద్దతిస్తూ, కార్మికుల ఐక్యతను చాటుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చేస్తున్న పోరాటంలో తమవంతు మద్దతు తెలుపుతున్నామన్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగే ఈ మహాసభ జయప్రదానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశామన్నారు. ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ ఆరో తేదీన పోలవరం నిర్వాసితులు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మిక కర్షక ఐక్యతను చాటే ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శన, పేదలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు.
ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, డ్వామా పీడీ డి.రాంబాబు హాజరవుతున్నారని తెలిపారు. డిసెంబర్ ఏడో తేదీన సాంస్కృతిక సమ్మేళనం ఉంటుందన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా అభ్యుదయ కవి గోరేటి వెంకన్న హాజరవుతున్నారని తెలిపారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథులుగా మాజీ ఎంపీ బృందాకరత్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష కార్యదర్శులు ఎ.విజయ రాఘవన్, బి.వెంకట్, రైతు సంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం నాయకులు డిఎన్‌విడి.ప్రసాద్, పి.కిషోర్, ఎం.నాగమణి, కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ, ఎం.జీవరత్నం, జివిఎల్ నరసింహారావు, మడివి దుర్గారావు, తుమ్మల సత్యనారాయణ, ఎస్‌కె.సుభాషిణి, ఎ.ప్రభాకర్ పాల్గొన్నారు.










