Nov 15,2022 22:44

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
        వచ్చేనెల 8, 9 ,10 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహించే ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ నాయకులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు భూ పోరాటాలు చేసి పేద ప్రజలకు వెలాది ఎకరాల భూమి ఇచ్చిన ఘనత వ్యవసాయ కార్మిక సంఘానికి దక్కుతుందని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో భూమి పంచాలని కూలి పెంచాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోరాటాలు నిర్వహించామన్నారు. ఏజెన్సీ పోరాటాల గడ్డ జంగారెడ్డిగూడెంలో నిర్వహించటం పోరాటాలకు నాంది అని పేర్కొన్నారు. ఎనిమిదో తేదీన జరిగే బహిరంగ సభకు గిరిజన మైనార్టీ జాతీయ నాయకురాలు బృందాకారత్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పేదలకు భూమి పంచితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్‌, ఆర్‌.లింగరాజు, పల్లెం కిషోర్‌, జి.రాజు, టి.నాగమణి, పిల్లి రామకృష్ణ, ఎం.జీవరత్నం, పి.మంగరాజు పాల్గొన్నారు.