Nov 03,2022 21:45

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
           వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర నాయకురాలు వి.శివనాగరాణి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మహిళా ముఖ్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షురాలు యాగంటి సీత, అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వి.శివ నాగరాణి మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని తెలిపారు. సంపదను సృష్టించే వ్యవసాయ కార్మికుల స్థితిగతులు రోజురోజుకీ దిగజారుతున్నాయన్నారు. కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధి చూపడంలో, వేతన జిఒ అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ఉపాధి చూపిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టం లేకుంటే రాష్ట్రంలో లక్షలాది మంది రోడ్డున పడేవారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే వ్యవసాయరంగంలో యంత్రాలు పెరగడంతో కూలీలకు పని దినాలు పడిపోయాయని, తద్వారా కూలీలు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, పొట్టకూటి కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ సమస్యలపై వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది, పది తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించి, కార్యాచరణ రూపొందిస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిదో తేదీన జంగారెడ్డిగూడెంలో భారీ ప్రదర్శన, వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ఉపాధి హామీ సృష్టికర్త గిరిజన మైనార్టీ హక్కుల పోరాట యోధురాలు బృందాకరత్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని తెలిపారు. 9, 10 తేదీల్లో దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో మహాసభ జరుగుందన్నారు. రైతులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, పార్టీల నాయకులు, ప్రజలు సహకరించి, విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తామ ముత్యాలమ్మ, మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్‌రావు, మండల కమిటీ సభ్యులు పూసం దుర్గ, బోడిక లక్ష్మి, తోణం సోమలమ్మ, ఎర్రమల కుమారి, రెడ్డిబోయిన సత్యవతి, జి.దీప పాల్గొన్నారు.