ప్రజాశక్తి- పలాస: వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని పలాస శాఖాగ్రంథాలయ సంచాలకులు రాంబాబు అన్నారు. మండలంలోని నీలావతిలో ఉద్దాన విద్యాభివృద్ధి వేదిక ఆధ్వర్యాన యువివి గ్రంథాలయం ప్రథమ వార్షికోత్సవం వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ వ్యక్తిత్వ, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహిస్తే విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గ్రంథాలయాల్లో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, వాటిని పఠనం చేస్తే భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో అతిపెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా అవకాశం కల్పించిన ఉద్దానం విద్యాభివృద్ధి వేదిక నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 65 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. 6,7 తరగతులకు జరిగిన జూనియర్ విభాగంలో డి.అస్మిత, టి.నవసాహిత్, పి.చిరంజీవి, జాష్ణవి ,హిందూలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 8,9,10వ తరగతులకు జరిగిన సీనియర్ విభాగంలో బి.లాస్య, ఎస్.జ్యోష్ణ, జె.హిందూ, కె.అమృత, కె.హాసిని ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు. వారికి బహుమతులు, షీల్డ్ ప్రదానం చేశారు. స్థానిక లైబ్రేరియన్‌గా సేవలు అందిస్తున్న గీతాంజలిని కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఇసాకోటి జోగారావు, కార్యదర్శి బొడ్డు చిన్నారావు, గ్రంథాలయ నిర్మాణ కమిటీ కుత్తుం ప్రకాశరావు, గ్రంథాలయ నిర్వహణ కమిటీ కన్వీనర్ పాలిన కృష్ణారావు, ఉపాధ్యక్షులు పి.గీతమ్మ, ఆర్థిక కార్యదర్శి యంపళ్ల కామేష్, అకడమిక్ సెల్ కన్వీనర్ పోతనపల్లి బాలరాజు పాల్గొన్నారు.










