ప్రజాశక్తి-పంగులూరు: నిన్న మొన్నటి వరకు ఆశాజనకంగా ఉన్న మొక్కజొన్న ధర, గత పది రోజుల నుండి రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రభుత్వ ధర కన్నా, ప్రైవేటు వ్యాపారుల ధర బాగుందని రైతులు ఆశిస్తున్న నేపథ్యంలో, ధరలు తగ్గిపోవటం రైతాంగాన్ని నిరాశకు గురిచేస్తుంది. మొదట్లో ఆశాజనకంగా ఉన్న మొక్కజొన్న ధర, రోజురోజుకూ పతనం అవ్వటం పట్ల వ్యాపారుల సిండికేట్ ప్రభావం ఉందని, పలువురు మొక్కజొన్న రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సరం రబీలో మొక్కజొన్న పైరును పంగులూరు మండలంలో 4,600 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. వాతావరణం అనుకూలించటం వలన ప్రారంభం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైరు బాగానే ఉంది. ఎలాంటి చీడపీడలు కూడా ఆశించకపోవడంతో ఈ సంవత్సరం దిగుబడులు బాగానే ఉంటాయని రైతులు భావించారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లు వరకు దిగుబడులు వస్తున్నాయి. నెల రోజులు ముందు ప్రైవేటు ధర కూడా బాగా ఉంది. ప్రభుత్వ ధర 1,960 రూపాయలు కాగా, ప్రైవేట్ వ్యాపారుల ధర రూ.2,200 వరకు ఉంది. దీంతో మొక్కజొన్న రైతులు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. గత 20 రోజులు నుంచి మొక్కజొన్న పండి రైతుల ఇళ్లకు చేరుకోవడంతో మొక్కజొన్న ధర పతనం ప్రారంభమైంది. రోజురోజుకూ ధర తగ్గుతూ ప్రస్తుతం 1,960 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో ఇంకా ధర తగ్గే అవకాశం ఉందని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ధర ఎంత ఉందో, ప్రైవేట్ ధర కూడా అంతే ఉంది. మొక్కజొన్న ఒక్కసారిగా రైతుల ఇళ్లకు చేరటం, రైతులు వ్యాపారుల చుట్టూ తిరగటం వలన వ్యాపారులు సిండికేట్ అయి, ధరలు తగ్గించడం ప్రారంభించారని రైతులు చెబుతున్నారు. రానున్న పది రోజుల్లో కూడా మిగిలిన మొక్కజొన్న రైతులు వద్దకు చేరే అవకాశం ఉందని, దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకా ధర తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సంవత్సరం మొక్కజొన్న పంట ఆశాజనకంగా ఉందని, రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు. కౌలు ధరలు కూడా ఎక్కువగా పెట్టి మొక్కజొన్నలు సాగు చేశారు. అయితే ధరలు తగ్గిపోవడం రైతాంగాన్ని, కౌలు రైతాంగాన్ని నష్టాలు పాలు చేసే విధంగా ఉన్నాయని పలువురు చెబుతున్నారు.
ప్రభుత్వం కొనకపోవడమే కారణం: రైతు సంఘం
ప్రైవేట్ వ్యాపారులు మొక్కజొన్న ధరను రోజురోజుకూ తగ్గించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవటమే కారణమని, రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు అన్నారు. ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేస్తే ,ప్రైవేట్ వ్యాపారులు ధరలు తగ్గించే వారు కాదని, ప్రభుత్వం కొనుగోలు చేసే ఆలోచన చేయటం లేదని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులు రైతుల అవసరాలను, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంకా ధర తగ్గించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.










