
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరంలో దుస్తుల వ్యాపారుల కడుపుకొట్టాడని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక ఎన్‌టిఆర్ సర్కిల్‌లో ఉన్న పలు దుస్తుల వ్యాపారుస్తులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో మాంగళ్యషాపింగ్ మాల్ ప్రారంభించినప్పటినుండి వ్యాపారాలు జరగక ఇబ్బందులుపడుతున్నామన్నారు. దసరా పండుగ సందర్భంగా వ్యాపారాలు జరుగుతాయని లక్షల రుపాయలు పెట్టుబడి పెట్టామని అయినా వ్యాపారాలు జరగలేదని అన్నారు. ఇలాగైతే తాము బాడుగలు, పనిచేసేవాళ్లకు వేతనాలు కూడా చెల్లించలేమని వాపోయారు. ఈసందర్భంగా చిలకం మాట్లాడుతూ ధర్మవరంలో ఇటీవల కార్పొరేట్ సంస్థ మాంగళ్యషాపింగ్ మాల్ ప్రారంభించాక దుస్తుల వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. ఈ షాపింగ్‌మాల్‌ను స్వయానా ఎమ్మల్యే ప్రారంభించి దుస్తుల వ్యాపారుల కడుపుకొట్టాడని విమర్శించారు. వచ్చే ఏడాది దసరాకు ధర్మవరంలో మాంగళ్యషాపింగ్ మాల్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని దుస్తుల వ్యాపారులకు చిలకం హామీ ఇచ్చారు.