Sep 01,2023 22:52

సమావేశంలో మాట్లాడుతున్న బొమ్మాళి తాతయ్య

ప్రజాశక్తి- పలాస: పలాస-కాశీబుగ్గ జీడి ఉత్పత్తి సంఘం నాయకులు కార్మికులను దొంగలుగా ముద్ర వేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జీడి పరిశ్రమలు వెంటనే తెరిపించి కార్మికులకు భతి కల్పించాలని జీడి కార్మికుల సంఘం అధ్యక్షులు కొవ్వూరు భీమారావు, కార్యదర్శి బొమ్మాళి తాతయ్య, గౌరవ అధ్యక్షులు అంబటి కష్ణమూర్తి అన్నారు. శుక్రవారం కార్మిక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీడి పరిశ్రమల్లో పలాస, కాశీబుగ్గకు చెందిన సుమారు 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, గతంలో దొంగతనం ఆరోపణలు ఏ కార్మికుడిపై రాలేదని గుర్తు చేశారు. పలాసకు చెందిన పొట్నూరు బాలాజీ జీడి పరిశ్రమలో ప్రతి రోజు ఆ కంపెనీలో పని చేస్తున్న మహిళా కార్మికులపై నిందలు వేస్తున్నారన్నారు. లండ రమణ అనే కార్మికుడు బాలాజీ పరిశ్రమలో రెండేళుగా 10 లక్షల రూపాయలు విలువైన జీడిపప్పు దొంగతనం చేశాడనే ఆరోపణలతో జీడి ఉత్పత్తిదారుల సంఘం ఇటీవల సమావేశం నిర్వహించి పరిశ్రమలకు బంద్‌ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లండ రమణపై వ్యాపారులు తప్పుడు ఆరోపణలు చేస్తూ దొంగగా ముద్ర వేశారని, యజమానిపై కార్మికుడు లండ రమణ దాడి చేశారని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా బంద్‌కు ఉపక్రమించడం వ్యాపారులు ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, నిజనిర్ధారణ చేసి పరిశ్రమలను తెరిపించాలన్నారు. బంద్‌ వలన రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని ఉపాధి రూపేణా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తామడ రాము, కోనేరి ఈశ్వరరావు, బాబూరావు, తాతయ్య, కార్మికులు పాల్గొన్నారు.