ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ సామాన్యునికి సమస్య పరిష్కారం కాకపోతే తమ గళాన్ని అధికారులు వినిపించుకునేందుకు ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను వ్యాపారులు అడ్డాగా మార్చుకున్నారు. వ్యాపారుల కోసమే ధర్నాచౌకను ఏర్పాటు చేశారా అనేలా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఉండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా ధర్నా చేయాలంటే కాకినాడ కలెక్టరేట్ గేట్ ఎదురుగా నిర్వహించేవారు. ట్రాఫిక్, ఇతర సమస్యల కారణంగా అప్పటి కలెక్టర్ హరికిరణ్ ధర్నా చౌక్‌ను బాబూ జగ్జీజ్జీవన్‌రామ్ విగ్రహం వద్దకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నా చౌక్‌ను మార్చడంపై ప్రజా సంఘాలతో పాటుగా, అన్ని పార్టీలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు ధర్నా చౌక్ మార్చి వేశారు. ప్రస్తుతం ధర్నా చౌక్ పరిస్థితి చూస్తే తీవ్ర అధ్వానంగా మారింది. డ్రైనేజీ పూర్తిస్థాయిలో అధ్వానంగా ఉండడంతో పాటుగా రాత్రి సమయాల్లో, మందుబాబుల ఆగడాలు, మలవిసర్జన అక్కడే చేయడంతో ధర్నా చేసేవారికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు అక్కడే ఉంచుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటు పోలీస్ అధికారులు, ఇటు కలెక్టరేట్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో ధర్నా చేసే స్థానికులకు ప్రజాసంఘాల నాయకులకు ఇతర పార్టీ నాయకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.










