Mar 14,2021 13:01

పాతికేళ్లుగా మార్చి 16వ తేదీన 'జాతీయ టీకా దినోత్సవం' జరుపుకుంటున్నాం. 1995లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విజయవంతంగా నిర్వహించాం. దాని ఫలితమే 2014 నాటికి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా తయారుచేసుకున్నాం. ఈ ఏడాది జరుపుకునే 'టీకా' దినోత్సవానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. అతికొద్ది కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా నియంత్రణకు శరవేగంతో కరోనా టీకాను తయారుచేసి, ప్రజలకు అందుబాటులోకి తేవడం ఈ ఏడాది ప్రత్యేకత. కరోనా నివారణకు అతి ముఖ్యమైన ఆయుధం వ్యాక్సిన్‌. వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలు, వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకు రాకపోవడం ఒక విచిత్రం. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను వ్యాధి తీవ్రతనీ, ప్రజల ఆర్థిక పరిస్థితినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఆ మేరకు ప్రజలకు ఉచితంగా టీకాను అందించకపోవడం బాధాకరం. గత పాతికేళ్లలో అంటురోగాల నివారణలో వ్యాక్సినేషన్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. కరోనా వ్యాక్సిన్‌, అసలు వాస్తవాలను ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎం.వి. రమణయ్య ఎంతో విశదంగా 'స్నేహ' ప్రతినిధితో సంభాషించారు. ఆ సమాచారమే ఈ వారం అట్టమీది కథనం..

 

నివారణ కోసం....

ప్రపంచాన్ని మూడువేల సంవత్సరాలు అల్లాడించిన స్మాల్‌పాక్స్‌ 1977న మన దేశం నుంచి మటుమాయమైంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్మాల్‌పాక్స్‌ టీకా కార్యక్రమంలో మన వంతుగా, మన దేశంలోనూ ఈ కార్యక్రమం జరపడమే. ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మొట్టమొదటగా 1697లో స్మాల్‌పాక్స్‌కి వ్యాక్సిన్‌ని కనుగొన్నారు. 1967 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్మాల్‌పాక్స్‌ నిర్మూలన కోసం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగింది. 1977న భారతదేశాన్ని స్మాల్‌పాక్స్‌ రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. 1980న స్మాల్‌పాక్స్‌ రహిత ప్రపంచాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. అదేవిధంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం కారణంగా 2014లో మన దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించుకున్నాం. మన సరిహద్దు దేశాలలో పోలియో ఉన్న కారణంగా పోలియో కేసులు నమోదు కాకపోయినా పోలియో చుక్కల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం.

 

 

వ్యాక్సిన్...వాస్తవాలు

కరోనా కాల చక్రం

+ 30-11-2019న - చైనాలో మొట్టమొదటగా కరోనా వైరస్‌ను గుర్తించారు.
+ 30- 1- 2020న భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసును గుర్తించారు.
+ 30-6-2020న కోవ్యాక్సిన్‌ తయారీకి క్లినికల్‌ ట్రయిల్స్‌కు డి సి సి ఐ అనుమతిచ్చారు.
+ 24-8-2020న కొవిషీల్డ్‌ వ్యాక్స్‌న్‌ ట్రైల్స్‌కి పర్మిషన్‌ ఇచ్చారు.
+ 3-1-2021న కొవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి.
+ జనవరి 16 కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారతదేశంలో మొదలైంది.
కోవిడ్‌ వ్యాధి తీవ్రత, వ్యాధి వ్యాప్తి, ఈ వ్యాధి వల్ల సమాజానికి జరిగినటువంటి నష్టాలను దష్టిలో పెట్టుకొని, వ్యాక్సిన్‌ను శరవేగంగా తయారుచేసి పద్ధతి ప్రకారం జరగాల్సిన మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాకుండానే అత్యవసర వినియోగానికి కరోనా వ్యాక్సిన్‌కి మనదేశంలో అనుమతి వచ్చింది. క్రిమిని కనుగొన్న సంవత్సరంలోపే వ్యాక్సిన్‌ తయారుచేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ విజయంలో శాస్త్రసాంకేతిక అభివద్ధి, శాస్త్రవేత్తల, ప్రభుత్వ అధికారుల కషి చాలా ముఖ్యమైనది, అభినందించదగినది.

వ్యాక్సిన్...వాస్తవాలు
ప్రస్తుతం రెండు రకాల టీకాలు...
- ఏప్రిల్‌ నెలలో మరో మూడు రకాల వ్యాక్సిన్లు.
- రష్యా అన్ని దేశాల కంటే ముందుగా స్పుత్నిక్‌ వీ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని మరికొన్ని దేశాలతోనూ రష్యా పంచుకుంది. ఆ దేశాల్లో మన దేశమూ ఉంది.
- మనదేశానికి చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఆధ్వర్యంలో స్పుత్నిక్‌ వీ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి లభించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వ్యాక్సిన్...వాస్తవాలు

అందరికీ అందాలి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి విడతలో జనవరి 16 నుంచి వైద్య సిబ్బందికి, పోలీసులకు ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్న వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. మార్చి 1 నుంచి రెండో విడతగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయస్సు పైబడి, 59 ఏళ్ల వయసుకు లోబడి ఉన్న వారికి ప్రభుత్వ/ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ వేయించుకోవాలి అంటే సంబంధిత వ్యక్తులు తమ పేర్లను ఓపెన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.
చాలామందికి రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకొనే అర్హులు ఆధార్‌ కార్డు చూపిస్తే చాలు. అలాగే ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు టెస్ట్‌ రిపోర్ట్‌గా డాక్టర్‌ ఇచ్చిన మందుల చీటీలు వంటి ఇతర ఆధారాలు చూపిస్తే చాలు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోతే టీకా తీసుకోవాలని అనుకునేవారు అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి, వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. ఈ రెండో విడత కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు కోట్ల మందికి టీకాలు వేశారు. జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరగాలని ప్రణాళిక జరుగుతుంది. 45-59 ఏళ్ల మధ్యలో వారికి మూడో విడతలో టీకా వేయడం జరుగుతుంది. ఈ రెండో దశ ఎప్పుడు పూర్తవుతుందో? మూడో దశ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ వాడింది 31 కోట్ల డోసులు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 116 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిద్వారా ఇప్పటివరకూ 31.2 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 80 లక్షల డోసుల పంపిణీ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో తొమ్మిది కోట్ల డోసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఎవరెవరు వేయించుకోకూడదు
టీకా అందరూ వేయించుకోవాలి. కానీ కొందరి విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
నగర్భవతులు, పాలు ఇచ్చు తల్లులు వ్యాక్సిన్‌ వేయించుకోకూడదు.. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకిగానీ, పాలుతాగే పిల్లలకుగానీ ఏమైనా సమస్య అవుతుందేమోనని. తగిన పరిశోధనలు జరగలేదు.
- 45 ఏళ్ల లోపు ఫ్రంట్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. కానీ వారిలో గర్భవతులు ఉంటే వారు వేయించుకోకూడదు.
-18 ఏళ్లలోపు వున్న వారు వేయించుకోకూడదు. వీళ్లకు వేస్తే ఏమవుతుందో పరిశోధనలు జరగకపోవడమే కారణం.
- అలర్జీవున్న వారు, ప్రధానంగా కొన్ని మందులు సరిపడని వారికి ఈ వ్యాక్సిన్‌ రియాక్షన్‌ రావొచ్చు. వీళ్లు సంబంధిత డాక్టర్ల పర్యవేక్షణలో వేయించుకోవాలి.
నగుండె, ఊపిరితిత్తులు, రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. కానీ సంబంధిత సమస్యలు అదుపులో ఉన్నదీ లేనిదీ పరీక్ష చేయించుకుని, డాక్టర్ల పర్యవేక్షణలో వ్యాక్సిన్‌ వేయించుకుంటే మంచిది.
- విపరీతంగా ఆయాసపడుతున్న వారు.. ఐసియులో ఉన్నవారు, డయాలసిస్‌ తీసుకుంటున్నవారిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు. ఇంకా చెప్పాలంటే అడ్మిషన్‌ అవసరం ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేయకూడదు. వీరంతా ఆ తీవ్రత నుండి బయటపడతేనే వ్యాక్సిన్‌ వేయాలి. అదీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వేయాలి.
- 45 ఏళ్ల లోపు ఉన్న వారికి ఇవ్వడంలేదు.. కారణం వ్యాక్సిన్‌ కెపాసిటీ లేకపోవడం.

టీకా తప్పక వేయించుకోవాలి
కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నా కరోనా రాదు అనే నమ్మకం ఉందా? అంటే వ్యాక్సిన్‌ వల్ల ఏర్పడిన రక్షణ ఎంతకాలం ఉంటుందని కానీ, వచ్చిన రక్షణ భవిష్యత్తులో కరోనా వ్యాధి సోకడాన్ని ఎంతవరకూ ఆపగలమనిగానీ శాస్త్రీయ నిర్ధారణలు అందుబాటులోకి రాలేదు. కానీ వ్యాక్సిన్‌ తరువాత సోకినటువంటి జబ్బు తీవ్రత అంత ఎక్కువగా ఉండే అవకాశం లేదు. సోకిన వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందే తీవ్రతా చాలా తక్కువగా ఉంటుంది. కచ్చితంగా కొద్దిపాటి ఉపయోగమైనా ఉంది. కాబట్టి అందరూ తప్పక టీకాలు వేయించుకోవాలి.

 ఇదే  ప్రభుత్వమూ చేయొచ్చుగా..
'మా ఉద్యోగులకు మేం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటాం!' కెనరా బ్యాంక్‌, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, రిలయన్స్‌ వంటి సంస్థలు చెప్తున్న మాట. వీరి ఉద్యోగులకు కరోనా టీకా వేయించకపోతే, వీరి సంస్థలకు నష్టం వస్తుందనో లేక వారి ఉద్యోగుల కుటుంబాలకు కష్టం వస్తుందనో? ఏదైతేనేం వారి బాధ్యతగా ఆ సంస్థలు వారి ఉద్యోగుల కుటుంబసభ్యులందరికీ టీకాలు వేయిస్తున్నారు. ఇదే తరహాలో మరికొన్ని కార్పొరేట్‌ సంస్థలూ ముందుకు వస్తున్నాయి. 'ఉద్యోగులకు అయ్యే కరోనా వ్యాక్సిన్‌ ఖర్చును భరించాలి!' అని అన్ని బ్యాంకులకూ ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ సూచించడమూ జరిగింది. కార్పొరేట్‌ సంస్థలు వారి ఉద్యోగులను వారు కాపాడుకుంటుంటే గవర్నమెంట్‌ వారి పౌరులను అది కాపాడుకోలేదా?

వ్యాక్సిన్...వాస్తవాలు


తీసుకోవాల్సిన జాగ్రత్తలు
టీకాలు తీసుకున్నవారు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తీసుకున్న వెంటనే కరోనా వైరస్‌ నుండి ముప్పును నిరోధించలేము. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తీసుకున్న వ్యాక్సిన్‌ పనిచేయడానికి రెండో డోసు తీసుకున్న తరువాత రెండు వారాలు పడుతుంది. టీకాలు వేసిన తర్వాతా కరోనా వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతా భౌతికదూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి రక్షణ చర్యలను మానవద్దు.

వ్యాక్సిన్...వాస్తవాలు

దేశాధినేతలే ముందుండాలి

ఈ నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. ఆ తరువాత నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు, రాజకీయ నాయకులు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆలస్యంగానైనా చాలా మంచిపని చేశారు. సాధారణ ప్రజలకు ధైర్యం కల్పించారు. మనదేశంలో జనవరి 16న కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా ఉపద్రవంలో ప్రాణాలను ఫణంగా పెట్టి, వైద్య సేవలు అందించిన వైద్య రంగాన్ని గౌరవించి, మొదటి ప్రాధాన్యతనిస్తూ వైద్యులు, సిబ్బందికి ఉచితంగా టీకాలు వేయడం చాలా సంతోషం. అదే సమయంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి వారూ వ్యాక్సిన్‌ వేయించుకుని ఉంటే దేశ ప్రజలకు వ్యాక్సిన్‌పై ఉన్న భయాలు చాలావరకూ తొలగిపోయి ఉండేవి. బ్రిటన్‌, రష్యా లాంటి దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ వారి దేశ అధ్యక్షులతోనే ప్రారంభమైంది. అది ఆ దేశ ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆ దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అది ఎంతో ఉపయోగపడింది. మన దేశంలోనూ అదే విధంగా చేసి ఉంటే ఎంతో బాగుండేది. వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుని ఉండేది.

వ్యాక్సిన్...వాస్తవాలు

ఉచితంగానే వేయాలి..

ఉచితంగా వేస్తానని వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకముందు కేంద్రప్రభుత్వం చెప్పింది. తీరా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రమే ఉచితం. ప్రైవేట్‌ ఆస్పత్రిలో 250 రూపాయలు చెల్లించాలన్నది. 15 శాతం వైద్యరంగం మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మనదేశంలో ఈ పద్ధతి సాధ్యమవుతుందా? మన దేశ ఆర్థిక పరిస్థితులలో ఎంతమంది కొనుక్కుని, టీకాను వేయించుకోగలరు? అందరూ గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లి, ఈ టీకాను వేయించుకోవాలి అంటే ఎంతకాలం పడుతుంది? అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యరంగ సేవలను ఉచితంగా ఉపయోగించుకోలేమా? ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ని ఉచితంగా ప్రజలకు అందిస్తున్నారు. ఇది సంతోషకరమైన విషయం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.250కు అమ్ముతున్నారు. ఇది చాలా బాధాకరం. ఇందులో రూ.150 వ్యాక్సిన్‌ ఖరీదు. వంద రూపాయలు వైద్య సేవల ఖరీదు. వ్యాక్సిన్‌ వేసిన ఆస్పత్రికి ఈ వంద రూపాయలు చెందుతుంది. ఈ 150 రూపాయలను ప్రభుత్వం భరించి, వైద్య సేవల ఖర్చు లేకుండా ప్రైవేట్‌ హాస్పిటల్‌ వైద్య సేవలను ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్య రంగం తమ సామాజిక బాధ్యతగా ఈ సేవలను ప్రజలకు అందించాలని ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయకూడదు? కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ కోసం 35 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ఈ డబ్బుతో గవర్నమెంట్‌ ఆధీనంలో ఉన్న వ్యాక్సినేషన్‌ సెంటర్లను అభివృద్ధిపరచాలి. తక్కువ ధరకే టీకాను అందుబాటులోకి తెచ్చి, ఈ కార్యక్రమాన్ని ఉచితంగా సజావుగా జరపగలిగే అవకాశం ఉంది. వాక్సిన్‌ ఖరీదునంతా ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య రంగాలను రెండింటినీ ఉపయోగించుకుని, ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడమే మన దేశంలో కరోనా కట్టడికి సరైన పరిష్కారం. అలా చేయగలిగినప్పుడే వ్యాక్సిన్‌ని వేయించుకోవడానికి ఎక్కువ మంది ప్రజలు ముందుకు వస్తారు. అలా చేసినప్పుడే 135 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతుంది. అలా కాని పక్షంలో సంవత్సరాలు గడిచినా, అందరికీ వ్యాక్సిన్‌ అందించలేని పరిస్థితి వస్తుంది. రెండు నెలలుగా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా, ఇప్పటికీ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య రెండు కోట్లు మాత్రమే. 'వ్యాక్సిన్‌ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలుగా ఆ ఖర్చు మేమే భరిస్తాం. ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తాం!' కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న పరిస్థితుల్లో చెప్పిన మాట ఇది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఢిల్లీ, బీహార్‌ రాష్ట్రాలు మాత్రమే చెప్పిన మాట మీద నిలబడి, ఆ రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వాస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్‌ని ఉచితంగా అందిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా ఇవ్వడం కోసం బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా పట్టించుకోవడం చాలా సంతోషం. మిగిలిన రాష్ట్రాలూ ఇదే పద్ధతిలో ఆలోచించడం మంచిదేమో. ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలూ భరించలేమన్న పరిస్థితి ఉంటే, కనీసం వారి రాష్ట్రాల్లో ఉన్న తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారందరికైనా ఉచితంగా వ్యాక్సిన్‌ని అందించాలి.

వ్యాక్సిన్...వాస్తవాలు

అవగాహన అవసరం
వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలు, వచ్చిన తర్వాత వేయించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్‌ వస్తుందా అని ఎదురుచూసిన ప్రజలే వ్యాక్సినేషన్‌ ఇప్పుడు వద్దులే మళ్ళీ చూద్దాం అనే దశకు వెళ్ళిపోయారు. దీనికి ప్రధానకారణం ప్రభుత్వం. వ్యాక్సిన్‌ను జనబాహుళ్యం ఉపయోగించడానికి అనుమతించే ముందు జరగవలసిన క్లినికల్‌ ట్రైల్స్‌ పూర్తికాకుండానే అత్యవసర వినియోగ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తేవడం. టీకా వేయించుకున్న వారిలో కొద్దిమందికి టీకా వికటించి, చనిపోవడం. టీకా వేయించుకుంటే వచ్చే రక్షణ ఎంతవరకూ ఉంటుందోనన్న భరోసా లేకపోవడం. కరోనా వ్యాధి వ్యాప్తి తగ్గడం. ఇలాంటి కారణాలతో టీకా వేయించుకోవడానికి ప్రజలు వెనకంజ వేస్తున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా దీనివల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి టీకాను అనుమతించడం తప్పని పరిస్థితి. ఏదైనా మందును వాడినప్పుడు కొద్దిమందికి వికటించడం సర్వసాధారణం. అది మనం వాడే ముందు కావచ్చు లేదా మనం వాడే టీకాకి కావచ్చు. విస్తృతమైన స్థాయిలో వాడినప్పుడు ఈ సంఖ్య కొద్దిగా ఎక్కువని అనిపించవచ్చు. ఈ టీకా వల్ల వచ్చే వ్యాధి నిరోధకశక్తి ఎంతకాలం ఉంటుందన్నది నిర్ణయించడానికి చాలా సమయం పడుతుంది. ఈ వ్యాధి వ్యాప్తి కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ అనేక దేశాల్లో మళ్లీ విజృంభిస్తోంది. మన దేశంలోనూ క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడమే ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ వల్ల జరిగే నష్టం కన్నా వచ్చే ఉపయోగం ఎక్కువ. కాబట్టి టీకా వేయించడానికే మనం సన్నద్ధం కావాలి.   

వ్యాక్సినేషన్ గ్రాఫ్

డాక్టర్ ఎంవి రమణయ్య, ప్రజా రోగ్య వేదిక రాష్ర్ట అధ్యక్షులు                                                                                                                                                                                                                      

               వ్యాక్సిన్...వాస్తవాలు       -    డాక్టర్ ఎంవి రమణయ్య, ప్రజా రోగ్య వేదిక రాష్ర్ట అధ్యక్షులు

                                                                                                            - సేకరణ : బాలకృష్ణ