
వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలనేది ప్రజలందరి ఆకాంక్ష. కానీ అందుకనుగుణమైన విధానాలేవీ పాలకపక్షాలు చేపట్టడం లేదు. నిజాయితీ లోపించి, మూఢనమ్మకాలపై దృష్టి సారించడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఉన్నంతలో వేస్తున్న వ్యాక్సినేషన్ గురించీ అనేక సందేహాలు ఉన్నాయి. కోవిడ్ రెండో అల వేగవంతంగా వ్యాపిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వాస్తవాలపైనే ఈ కథనం..

గౌరవాధ్యక్షులు,
ప్రజారోగ్య వేదిక,
ఆంధ్రప్రదేశ్.
కరోనా వ్యాధి రెండో అలను ముందే ఊహించారా ?

స్పానిష్ ఫ్లూగా ప్రసిద్ధి చెందిన వైరల్ ఇన్‌ఫ్లూయంజా 1918-19లో మూడు నాలుగు అలలుగా వచ్చింది. రెండు సంవత్సరాలు విలయతాండవం చేసింది. దాదాపు నాలుగు, ఐదు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా, భారత దేశంలోనే 15 లక్షల మంది చనిపోయారని అంచనా వేశారు. ముఖ్యంగా యువతీ యువకులు చనిపోయారు. అప్పటికి ఫ్లూ వ్యాక్సిన్ తయారవ్వలేదు. అయినా అదే ఆగిపోయింది. చరిత్ర నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోలేదు.
కరోనా రెండో అల 2020 నవంబరులోనే ఇంగ్లాండు, జర్మనీలో ప్రబలింది. ఇటలీ, స్పెయిన్‌లలో కూడా రెండో అల వచ్చింది. కానీ ఆ ప్రభుత్వాలు తమ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేశాయి. ఇంగ్లాండ్‌లో పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రులే ప్రధానంగా ఉంటాయి. స్పెయిన్ ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేసింది. అందువల్ల మొదటి అల కంటే రెండో అలని వారు బాగా ఎదుర్కోగలిగారు.
మరి మన పరిస్థితి ఏంటి ?

మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నవంబర్ 2020లోనే ఆక్సిజన్, మందులు, ఐసియు బెడ్స్, వెంటిలేటర్స్ కొరత గురించి హెచ్చరించుతూ తమ సూచనలతో రిపోర్టు లోక్‌సభ స్పీకర్‌కి సమర్పించారు.
మన శాస్త్రజ్ఞులు, ఎపిడిమియాలజిస్టులు రెండో అల వస్తుందనీ, కొత్తరకం వైరస్ దేశంలో ఉందనీ, తేలికగా వ్యాప్తి చెందుతుందనీ, జబ్బు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనీ హెచ్చరించుతూ తమ నివేదికని క్యాబినెట్ సెక్రెటరీ (కేంద్రప్రభుత్వంలో అత్యున్నత అధికారి) కి మార్చి 2021 లోనే సమర్పించారు.
మన నాయకులు వీటన్నింటినీ పెడచెవిన పెట్టారు. ఎన్నికల మోడ్‌లోకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, బిజెపి పార్లమెంట్ సభ్యులు కోల్‌కతాలోని రెండు 5 స్టార్ హోటల్స్‌లో, రెండు నెలలు బస చేసి, ఎన్నికల ప్రచారంలో మునిగారు. హోమ్ మంత్రి దాదాపు రెండు, మూడు నెలలు బెంగాల్‌లోనే ప్రచారం చేశారు. ప్రధాని మార్చి, ఏప్రిల్‌లో16 సార్లు బెంగాల్ వెళ్లారు. తరువాత సంగతి మనకందరికీ తెలిసిందే !
ఈ వ్యాధి ఎప్పుడు అదుపులోకి వస్తుంది ?

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అంటారు. కానీ ఈ జబ్బుకి నయమయ్యే పరిస్థితి లేదు. ఏ మందూ పనిచేయడం లేదు. కొంతమందికి స్టిరాయిడ్స్ పనిచేస్తున్నాయి. చాలామంది ఏ బాధా లేకుండా తిరుగుతూ మిగిలిన వాళ్లకి అంటిస్తున్నారు. 20 శాతం మందికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. రెండు శాతం కన్నా తక్కువ మంది చనిపోతున్నారు. ఈ అలలో మధ్యవయస్కులు, యువత కూడా చనిపోతున్నారు.
సాధారణ ప్రజానీకంలో లక్షణాలు లేని కోవిడ్ పేషెంట్‌ను కనుగొనాలంటే, అందరికీ టెస్ట్‌లు చేయాలి. మన దగ్గర అంత సామర్థ్యం (కిట్స్, మ్యాన్‌పవర్) లేదు.
అందువల్ల త్వరగా వ్యాక్సిన్ ఇస్తేనే దీన్ని అదుపు చేయగలుగుతాం. దాదాపు 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇస్తేగానీ హెర్డ్ ఇమ్యూనిటీ రాదు. అంటే 100 కోట్ల మందికీ ఇవ్వాలి. ఇప్పటికి మనం మూడు కోట్ల మందికి మాత్రమే రెండు డోస్‌లు ఇచ్చాం. ఇదే వేగంతో వ్యాక్సినేషన్ చేస్తే మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి మరో రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది.
మన దగ్గర అన్ని వ్యాక్సిన్స్ లేవు. అందుకని వెంటనే ప్రపంచ దేశాల దగ్గర నిల్వగా ఉన్న డోస్‌లని కొనాలి. (bవస్త్ర, bశీతీతీశీష aఅస ర్‌వaశ్రీ) మన దగ్గర ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ 600 బిలియన్ డాలర్లు నిలవలు ఉన్నాయి. ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా వ్యాక్సిన్స్‌ని కొనుగోలు చేయాలి. ఆ పని చేయకపోతే మరో రెండేళ్లలో దాదాపు కోటి మంది చనిపోయే ప్రమాదం ఉంది.
ఈ వ్యాక్సిన్లలో ఏది మంచిది ?

Beggar’s can't be choosers Pfizer, Moderna, J&J, Sputnik, Sinopharm (chinese) అన్నీ దాదాపు 90% కంటే ఎక్కువే పనిచేస్తాయని నిపుణులు తేల్చారు. ఏ వ్యాక్సిన్ అయినా 60% పనిచేసినా మంచిదనే అంటారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ 70% కంటే ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయి. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవడం మంచిది. ఇవన్నీ కచ్చితంగా వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి.
కోవిషీల్డ్‌కి, కోవాక్సిన్‌కి తేడా ఏమిటి ?

కోవాక్సిన్ పాత పద్ధతితో చేస్తారు. ఇది నిరూపితమైన పద్ధతి. చనిపోయిన వైరస్ పదార్థంతో చేస్తారు. కోవిషీల్డ్ లైవ్ అడెనోవైరస్ లోకి కరోనా వైరస్ జెనిటిక్ మెటీరియల్ చొప్పించి, చేస్తారు. ఈ రెండింట్లో దేనివల్లా కరోనా వ్యాధి రాదు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. జబ్బు సంక్రమించినా మైల్డ్‌గా వస్తుంది. మొదటి డోస్ ప్రైమింగ్ డోస్ అంటారు. రెండోదాన్ని బూస్టర్ డోస్ అంటారు.
మొదట్లో కోవాక్సిన్ గురించి కొంత వివాదం నడిచిందిగదా ?
కోవిషీల్డ్‌ని అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా దేశాలలో 50 లక్షల మందికి పైగా క్లినికల్ ట్రైల్స్‌గా ఇచ్చారు. ఆ రిపోర్డ్స్ వచ్చినాకే అప్రూవల్ చేశారు. కోవాక్సిన్ మూడోదశ ప్రయోగాలు పూర్తికాకుండానే దాన్ని ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చారు. పూర్తిగా భారతదేశంలో కనుగొని, తయారుచేసిన వ్యాక్సిన్‌గా దాన్ని ప్రచారం చేశారు. అందువల్ల చాలామంది శాస్త్రజ్ఞులు అభ్యంతరాలు లేవనెత్తారు. రెండునెలలు ఆగి, అప్రూవల్ చేస్తే ఈ వివాదం వచ్చేదే కాదు. ఈ రెండూ మంచివే.
మొదటి డోస్ తరువాత కరోనా సోకితే, రెండో డోస్ ఎప్పుడు వేయించుకోవాలి ?
మూడు నెలల తరువాత వేయించుకోవాలి.
రెండు డోస్‌ల తర్వాత కరోనా వస్తే, మళ్లీ వ్యాక్సిన్ వేయించుకోవాలా ?
అవసరం లేదు. అయితే, ప్రతి సంవత్సరం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందే.
సింగిల్ డోస్ వ్యాక్సిన్ సంగతేమిటి ?
జాన్సన్ డ జాన్సన్ వ్యాక్సిన్ అమెరికా, యూరప్‌లో అందుబాటులో ఉంది. స్పూత్నిక్ లైట్ వస్తుందని అంటున్నారు.
గర్భవతుల సంగతేమిటి ?

ఈ వ్యాధి అంతమయ్యే దాకా వీలైతే గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించి, గర్భం రాకుండా జాగ్రత్తపడితే మంచిది. వస్తే మొదటి మూడునెలల్లో ఏ వ్యాక్సిన్‌నూ వేసుకోకూడదు. ఆ తరువాత కరోనా వ్యాక్సిన్ ఇస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.
పిల్లల సంగతేమిటి ?
రెండు నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలకు ఇప్పుడే వైద్యపరమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ఫలితాలు వచ్చాకే అడ్వైజరీ ఇస్తారు. రెండు సంవత్సరాలలోపు పిల్లలకి ఇప్పుడు ప్రయోగాలు కూడా జరగడం లేదు.
వాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేదాకా ఏ జాగ్రత్తలు పాటించాలి ?

మరో రెండు, మూడు సంవత్సరాలు కోవిడ్ నిరోధక పద్ధతులు పాటించాలి. బయటికి వెళ్లినపుడు తప్పనిసరిగా మంచి మాస్క్ (మూడు పొరల వస్త్రంతో ఇంట్లో తయారుచేసుకోవచ్చు) ముక్కూ, నోరు మూసేట్లుగా వాడాలి.
ఆరుబయట తిరగవచ్చు. ఇద్దరు ముగ్గురున్నా దూరంగా (10 అడుగులు) ఉండాలి. మూసి ఉన్న గదుల్లో ఉండకూడదు. కిటికీలు, తలుపులు తెరిచి, క్రాస్ వెంటిలేషన్ ఉండేట్లు చూడాలి. ఏదైనా వస్తువులను తాకినప్పుడు చేతులు ఎక్కువసార్లు సబ్బుతో కడుక్కోవాలి. ఇలా చేస్తే శానిటైజర్ వాడాల్సిన అవసరం ఉండదు.
ఫంక్షన్లకి వెళ్లినవారు, కారులో ప్రయాణం చేసిన వారు చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. అందుకని, ఫంక్షన్లకి, సినిమా హాళ్లకి పూర్తిగా మానుకోవాలి. తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే కారు కిటికీలు తెరిచి ఉంచాలి.
మన ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ గురించి వివరించండి..
మన పాలకులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారని నేను అనుకోవడంలేదు. బీహార్ ఎలక్షన్ ముందు ఆర్థికమంత్రి బిజెపి గెలిస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రధానిగానీ, మంత్రులుగానీ ఉచితంగా అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ఎప్పుడూ ప్రకటించలేదు. బడ్జెట్‌లో 35 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అవసరమయితే ఇంకా కేటాయిస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ రూ. 4,500 కోట్లే ఖర్చు పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలని ఖర్చు పెట్టమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరించే వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా ఇస్తున్నారు.
ఇంగ్లాండ్‌లో వ్యాక్సినేషన్ కోసం ఏకంగా ఒక క్యాబినెట్ మంత్రిని నియమించారు. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఇంగ్లీష్ వ్యాక్సిన్ అయినా, దానితో బాటు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ కూడా కొనుగోలు చేసి ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నారు.
అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, కెనడా ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకి రీసెర్చ్‌కి వ్యాక్సిన్ తయారుచేయడానికి ముందు పెట్టుబడి పెట్టారు. వాళ్లు తయారుచేసిన డోస్‌లన్నీ ముందే కొన్నారు. వాళ్లకున్న జనాభాకు కావాల్సిన డోస్‌ల కంటే కొన్ని రెట్లు అధికంగా వ్యాక్సిన్‌లు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. యూరప్ అనేక స్వతంత్ర రాజ్యాల సమూహం. అందరూ ఒక కమిటీని ఏర్పరచి, కంపెనీలతో బేరం చేసి వ్యాక్సిన్ కొన్నారు. మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని మీ చావు మీరు చావమంటున్నాం.
పూనాలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆస్ట్రాజెనికా కంపెనీతో ఒప్పందం చేసుకొంది. మూడు డాలర్లుకు ఒక్కో డోస్ చొప్పున ఇస్తామని ప్రకటించింది. సొంత పెట్టుబడితో అప్రూవల్ రాకముందే కొన్ని లక్షల వ్యాక్సిన్ డోస్‌లని తయారుచేసి, నిలవ చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి, వ్యాక్సిన్ సామర్థ్యం పెంచడానికి మూడు వేల కోట్లు అవసరం అవుతాయని మన ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే దీనిపై మన ప్రభుత్వం స్పందించలేదు.
ఈ కంపెనీ సామర్థ్యంలో పది శాతం సామర్థ్యం ఉన్న సంస్థ భారత్ బయోటెక్. దీనితో మన ప్రభుత్వ సంస్థలు సహకరించి, కోవ్యాక్సిన్‌ని తయారుచేశారు. వాళ్లకైనా పెట్టుబడి పెట్టారో లేదో తెలీదు.
మన ప్రభుత్వ రంగంలో దాదాపు ఐదు సంస్థలు వ్యాక్సిన్ తయారుచేయగలవు. తమిళనాడులోని కూనురులో, తూతికోడిలో వ్యాక్సిన్ తయారుచేసే సంస్థలు ఉన్నాయి. పూనేలో హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇదికాక ప్రయివేటుగా హైదరాబాద్‌లో బయోలాజికల్ ఇవాన్స్ అనే సంస్థ కేవలం వ్యాక్సిన్స్ మాత్రమే తయారుచేస్తుంది. ఇదే మాదిరిగా ఎన్నో సంస్థలు ఉన్నా వాటికి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయలేదు.
మనకు, శాస్త్రజ్ఞులు, టెక్నీషియన్లు, డబ్బు కొరత లేదు. లేనిదల్లా సంకల్పమే. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు, కార్పొరేట్‌లను బలోపేతం చేసే కర్తవ్యాన్ని మన పాలకులు చాలా సంవత్సరాలుగా, మరీ గత ఏడు సంవత్సరాలుగా పాటిస్తున్నారు.