కరోనా మహమ్మారిని అరికట్టడంలో కీలకమైన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యం వల్లే భారత్ నేడు ప్రపంచ కోవిడ్ 'ఎపిసెంటర్' గా మారింది. కోవిడ్ సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సిన్‌తోనే సాధ్యం. అటువంటి ప్రాముఖ్యత కలిగిన విషయంలో మోడీ ప్రభుత్వం క్షమించరాని నిర్లక్ష్యానికి పాల్పడింది. కరోనా మొదటి దశకు, రెండో దశకు మధ్య ఎనిమిది మాసాలు వ్యవధి దొరికినా ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచుకోవడానికి కానీ, వ్యాక్సిన్, ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుకోవడానికి ఎలాంటి ప్రణాళికను రూపొందించలేదు. దావోస్ సదస్సు నుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మార్చిలో మన దేశంలో కోవిడ్ మహమ్మారి రెండో దశ విజృంభణ మొదలవుతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ, కోవిడ్‌పై అంతిమ విజయానికి భారత్ అతి చేరువలో ఉందని అన్నారు. కానీ, కెేంద్ర బడ్జెట్‌లో ప్రజా రోగ్య రంగానికి కేటాయింపులు గత సంవత్సరం కన్నా కుదించడాన్ని బట్టే ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమైపోయింది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తగినంత వ్యవధి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చొరవ చూపలేదు.కోవిడ్ మహమ్మారికి ముందు వరకు ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల దేశంగా భారత్‌కు ఉన్న పేరు మోడీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కసారిగా మంటగలిసిపోయింది.దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఒక లెక్క ప్రకారం కనీసం 188 కోట్ల డోసులు అవసరం. దేశీయంగా పెద్ద యెత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు తగిన వసతులు ఉన్నాయి. తగినంత మంది నిపుణులు ఉన్నారు. అయినా మోడీ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధం కావడం లేదు. ప్రభుత్వ అధీనంలోని ఈ టెక్నాలజీని భారత్ బయోటెక్ అనే ప్రైవేట్ కంపెనీతో మాత్రమే పంచుకుంది. సీరమ్ ఇనిస్ట్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంస్థతో కలసి విదేశీ టెక్నాలజీని ఉపయోగించి కోవి షీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండు కంపెనీలు నెలకు గరిష్టంగా ఎనిమిది కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారు చేయగల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ లెక్కన వ్యాక్సిన్ దేశంలో అందరికీ అందాలంటే రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రైవేట్ రంగమే అన్నీ చూసుకుంటుందన్న మోడీ ప్రభుత్వ దివాళాకోరు విధానమే దాని చేతులు కట్టిపడేసింది. జాతీయ విపత్తుల చట్టం కింద అధికారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్న కేంద్రం వ్యాక్సిన్ సరఫరాలో వైఫల్యానికి రాష్ట్రాలపై నిందలు వేయడం మోడీ ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం. పిఎం కేర్స్ నిధులు, కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35 వేల కోట్లను విడుదలజేస్తే ఈ దేశ జనాభాకంతటికీ టీకా అందించడమే గాక, మనపై ఆధారపడిన 92 దేశాల ప్రజలకు కూడా టీకాలు అందించవచ్చు. మోడీ ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఈ పరిస్థితుల్లో కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశీయంగా అందుబాటులో ఉన్న మేరకు వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయడమే గాక, గ్లోబల్ టెండరింగ్ ద్వారా విదేశాల నుంచి పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్నది. మన రాష్ట్రంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలహీనపరచి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే కరోనా మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత, సిబ్బంది కొరత, ఆక్సిజన్ కొరత, ట్యాంకర్ల కొరత, వెంటిలేటర్ల కొరత, అంబులెన్సుల కొరత ఇలా అన్ని సమస్యలు ఒక్కసారి చుట్టుముట్టాయి. ఈ పరిస్థితినే ఆనందయ్య వంటి నాటు వైద్యులు సొమ్ము చేసుకునే యత్నం చేస్తున్నారు. మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో లేని స్థితిలో సామాన్య జనం ఈ నిర్ధారణ కాని మందు కోసం వేలం వెర్రిగా ఎగబడ్డారు. ఇందుకు ప్రజలను నిందించలేం. ప్రజలను ఈ స్థితికి నెట్టిన ప్రభుత్వాలే దీనికి బాధ్యత వహించాలి. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రజలే గొంతెత్తాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి.










