జరిగిన వ్యాక్సిన్ ఉత్పత్తిలో సగం కేంద్రానికి పోగా తక్కిన సగాన్ని రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే రేటు కన్నా ప్రైవేటు ఆస్పత్రులు చెల్లించేది ఎక్కువగా నిర్ణయించారు. అందుచేత రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనబెట్టి ప్రైవేటు ఆస్పత్రులకే ఎక్కువ భాగం వ్యాక్సిన్ లను అమ్ముకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వ్యాక్సిన్ లు దొరక్క ఎక్కువమంది ప్రైవేట్ ఆస్పత్రులకు పోవలసి వస్తోంది. ఈ ప్రైవేటు ఆస్పత్రులు ఎన్ని వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాయో ఆ లెక్కలు సక్రమంగా లేవు. ఆ విధంగా ప్రైవేటు ఆస్పత్రులకు మళ్ళిన వ్యాక్సిన్ ల వివరాలు లేనందున మనకు వ్యాక్సిన్ లు అదృశ్యం అయినట్టు కనిపిస్తోంది. నిజానికి అవి అదృశ్యం కాలేదు. ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోయాయి.
భారతదేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. మొదట 45 సంవత్సరాల పైబడ్డ వారికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీని పరిమితం చేశారు. ఇప్పుడు కొత్తగా 18-44 సంవత్సరాల మధ్య వయస్కులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నందువలన ఒక్కసారి వ్యాక్సిన్ లకు డిమాండ్ పెరిగిందని, అందుకే ఈ వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. కాని ఈ అభిప్రాయం తప్పు. 18-44 మధ్య వయస్కులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయం వలన వ్యాక్సిన్ తీసుకోవలసినవారి సంఖ్య పెరిగి వుండవచ్చు. కాని మే మాసంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ ల ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది అన్నది అంతుపట్టకుండా వున్న విషయం. ఏప్రిల్ మాసంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ల సంఖ్యతో పోల్చితే మే నెలలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ ల సంఖ్య తగ్గడమే గాక, మన దేశంలో వ్యాక్సిన్ ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నమేరకు కూడా ఉత్పత్తి జరగలేదు. వ్యాక్సిన్‌లకు డిమాండ్ పెరిగినందువల్ల మాత్రమే ప్రస్తుత కొరత ఏర్పడలేదు. ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం మేరకు కూడా ఉత్పత్తి జరగనందువల్లనే ఈ కొరత ఏర్పడింది. ఎందుకిలా జరిగిందన్నది ఇప్పటికీ గందరగోళంగా ఉంది. ఈ గందరగోళాన్ని తొలగించడానికి ఇంతవరకూ జరిగిన ఉత్పత్తి ఎంత, పంపిణీ చేసినది ఎంత, ఎంత స్టాక్ ఇంకా ఉంది అన్న వివరాలను సమగ్రంగా ప్రభుత్వం వెల్లడి చేయాలి. కాని ఆ విధంగా జరగడం లేదు.
నెలకు 6.5 కోట్ల కోవిషీల్డ్, 2 కోట్ల కోవ్యాక్సిన్ - వెరసి మొత్తం 8.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం దేశంలో ఉంది. కోవిషీల్డ్ తన ఉత్పత్తి
సామర్ధ్యాన్ని పెంచుకునే భవిష్యత్తు ప్రణాళిను దేనినీ ప్రకటించలేదు. కాని కోవ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ ఈ మే నెల నుండీ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఇప్పుడున్న రెండు కోట్ల నుండి మూడు కోట్లకు పెంచనున్నట్టు ప్రకటించింది. అటువంటప్పుడు ఈ మే నెలలో మొత్తం వ్యాక్సిన్ ల ఉత్పత్తి సామర్ధ్యం 9.5 కోట్ల డోసులకు పెరిగి వుండాలి.
ఏప్రిల్ నెలలో మొత్తం 9 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను ప్రజలకు వేశారు. ఆ నెలలో ఉత్పత్తి జరిగిన వ్యాక్సిన్ లతోబాటు అంతవరకూ ఉన్న నిల్వలను కూడా ఉపయోగించారు. కాని, మే నెలలో మాత్రం వ్యాక్సినేషన్ తగ్గిపోయింది. మే 24 వరకూ రోజుకు సగటున 15 లక్షల డోసులను మాత్రమే ప్రజలకు వేశారు. మే 24 నుండీ కొంత పెరిగింది. మే చివరి వారంలో పంపిణీ రెట్టింపు అయివుంటుందని, రోజుకు 30 లక్షల డోసులు వేశారని అనుకున్నా మే నెలలో మొత్తంగా చూసుకున్నప్పుడు 5.7 కోట్ల డోసులకన్నా ఎక్కువ పంపిణీ జరగలేదని చెప్పవచ్చు. అంటే ఏప్రిల్ తో పోల్చినప్పుడు మే నెలలో ఏకంగా 3.3 కోట్ల డోసుల మేరకు పంపిణీ తగ్గిపోయింది! అదే ఉత్పత్తి సామర్ధ్యంతో పోల్చితే 3.8 కోట్ల డోసులు తక్కువ.
ఇలా తగ్గిపోవడం అంతుపట్టని మిస్టరీలా ఉంది. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పుడు వ్యాక్సినేషన్ పెరగాల్సింది పోయి ఇలా తగ్గిపోవడం ఏమిటి? ఏప్రిల్ లో అప్పటివరకూ ఉండిపోయిన పాత స్టాకును కలుపుకుని అంతా పంపిణీ చేసినందువలన ఎక్కువగా వ్యాక్సినేషన్ అయిందని, అటువంటి పాత స్టాకు ఏదీ మిగలనందువలన మే నెలలో తక్కువ వ్యాక్సినేషన్ అయిందని ఒక వివరణ ఉంది. అయితే ఈ వివరణ చెల్లదు. మే నెలలో ఉత్పత్తి సామర్ధ్యం ఎంత ఉందో అంతకన్నా కూడా తక్కువగా వ్యాక్సినేషన్ ఎందుకు జరిగింది? పాత స్టాకు ఏదీ లేకపోయినా, మే నెలలో మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం 9.5 కోట్లు. ఆ మేరకైనా పంపిణీ జరగాలి కదా ? పోనీ, ముందు అనుకున్నట్టు కోవ్యాక్సిన్ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచలేకపోయిందనుకుందాం. అప్పుడు కనీసం 8.5 కోట్ల డోసులైనా పంపిణీ అయివుండాలి కదా ? కేవలం 5.7 కోట్ల డోసులు మాత్రమే ఎందుకు పంపిణీ జరిగింది ?
ప్రజలమీద కరోనా ప్రభావం చాలా తీవ్రంగా పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, వ్యాక్సిన్ పంపిణీ అత్యవసర పరిష్కారంగా ముందుకొచ్చిన ఈ దశలో భారీ మొత్తంలో వ్యాక్సిన్ లకు లెక్క తెలియకుండా పోతే దానిని ఏ ప్రభుత్వమైనా తీవ్రంగా పరిగణించి స్పందిస్తుంది. కాని మోడీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు మౌనంగా ఉండిపోయింది. పైగా నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. పాల్ వ్యాక్సిన్ సంక్షోభం ఏర్పడడానికి బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నట్టు ఆరోపించారు. ఇది చాలా అన్యాయం. మొత్తం వ్యాక్సిన్ పంపిణీ ఎందుకు తగ్గిందన్న సంగతే ఆయన ప్రస్తావించలేదు.
వ్యాక్సిన్ ల అదృశ్యం విషయంలో ప్రభుత్వం పూర్తిగా మూగనోము పట్టింది. అయితే, భారత్ బయోటెక్ ఏవో కుంటి సాకులు చెప్తోంది. తమ ఉత్పత్తికి, మార్కెట్ లో సరఫరాకు మధ్యలో నాలుగు నెలల గ్యాప్ ఉంటుందని వివరణ ఇచ్చింది. ఉత్పత్తి ప్రారంభించిన కొత్తలో ఉత్పత్తికి, పంపిణీకి మధ్యలో ఇటువంటి గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. కాని, ఒక సారి ఉత్పత్తి, పంపిణీ మొదలయ్యాక, ఇక గ్యాప్ అనేదానికి అర్ధం ఉండదు. అందుచేత ఈ సాకులు చెల్లవు. ఒకవేళ ఉత్పత్తి మధ్యలో పెంచినట్టయితే ఆ విధంగా పెరిగిన ఉత్పత్తి మార్కెట్ కు చేరుకోడానికి కొంత గ్యాప్ ఉండవచ్చు. కాని ఈ లోపు అంతవరకూ సాగుతున్న ఉత్పత్తి కొనసాగాలి కదా. మరి మే నెలలో వచ్చిన వ్యాక్సిన్ లు ఏప్రిల్ నెల ఉత్పత్తి సామర్ధ్యం కన్నా కూడా తక్కువగా ఎందుకు వచ్చాయి ? అందుచేత ఉత్పత్తికి పంపిణీకి మధ్య గ్యాప్ ఉంటుందన్న వాదన చెల్లదు.
తనకున్న సామర్ధ్యానికన్నా తక్కువ స్థాయిలో ఏ సంస్థా ఉత్పత్తి చేయాలని అనుకోదు. పైగా ఆ ఉత్పత్తికి డిమాండ్ కూడా చాలా ఉన్నప్పుడు అసలే అనుకోదు. అలా ఉత్పత్తి కావాలని తగ్గించేది ఎక్కువ ధరకు దానిని అమ్ముకోవచ్చును అన్న ఉద్దేశ్యం ఉన్నప్పుడు మాత్రమే. కాని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ ఏరేట్లకు అమ్మాలన్నది ముందే నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయం అన్యాయంగా ఉంది అన్నది వేరే విషయం. ఇప్పుడు డిమాండ్ ఇంతగా ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసి తనవద్దే స్టాకు అట్టిపెట్టుకుంటుంది అని కూడా అనుకోలేము. అందుచేత మనం మే మాసంలో 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి జరిగాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని 5.7 కోట్ల డోసులు మాత్రమే పంపిణీ అయ్యాయి. తక్కిన వ్యాక్సిన్‌లు ఏమైనట్టు?
దేశంలో జరిగిన మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ వివరాలను కాగ్ ద్వారా ఆడిట్ చేయిస్తే వాస్తవాలు బైట పడతాయి. అటువంటి డిమాండ్‌ను కొన్ని ప్రతిపక్షాలు ఇప్పటికే చేశాయి. ఆ విధమైన ఆడిట్ జరిగేలోపు మనం ఈ విషయంలో కొంతవరకూ ఊహించవచ్చు. జరిగిన వ్యాక్సిన్ ఉత్పత్తిలో సగం కేంద్రానికి పోగా తక్కిన సగాన్ని రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే రేటు కన్నా ప్రైవేటు ఆస్పత్రులు చెల్లించేది ఎక్కువగా నిర్ణయించారు. అందుచేత రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనబెట్టి ప్రైవేటు ఆస్పత్రులకే ఎక్కువ భాగం వ్యాక్సిన్ లను అమ్ముకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వ్యాక్సిన్ లు దొరక్క ఎక్కువమంది ప్రైవేట్ ఆస్పత్రులకు పోవలసి వస్తోంది. ఈ ప్రైవేటు ఆస్పత్రులు ఎన్ని వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాయో ఆ లెక్కలు సక్రమంగా లేవు. ఆ విధంగా ప్రైవేటు ఆస్పత్రులకు మళ్ళిన వ్యాక్సిన్ ల వివరాలు లేనందున మనకు వ్యాక్సిన్ లు అదృశ్యం అయినట్టు కనిపిస్తోంది. నిజానికి అవి అదృశ్యం కాలేదు. ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోయాయి.
ఇదొక్కటే మొత్తం లెక్కల తేడాకు కారణం కాకపోవచ్చు. కాని దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రైవేటీకరించబడుతోందన్న వాస్తవాన్ని ఇది వెల్లడి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నీ అందుబాటులో ఉంచనందువల్ల వారంతా ప్రైవేటు ఆస్పత్రులకు పోవలసివస్తోంది. సగం వ్యాక్సిన్ డోసులు కేంద్రం సేకరిస్తున్నది. అవి 45 ఏళ్ళ పైబడినవారికి ఉద్దేశించినవి. ఆ లోపు వయస్కులకు రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు పంపిణీ చేయడానికి పోటీ పడాలి. కోవిషీల్డ్ ధర రాష్ట్రానికి డోసుకు రూ. 400 గా నిర్ణయిస్తే, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600 గా నిర్ణయించారు. ఎక్కువ ధర చెల్లించే వాడితో తక్కువ ధర చెల్లించేవాడు ఏవిధంగా పోటీ పడగలడో ఎవరి ఊహకూ అందని విషయం. ఇక కోవ్యాక్సిన్ విషయంలో రాష్ట్రం చెల్లించేది రూ. 600 అయితే ప్రైవేట్ ఆస్పత్రి చెల్లించేది రూ. 1200. పోనీ రాష్ట్రాలకు ఎంత వాటా ఉత్పత్తి అమ్మాలో, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంత వాటా అమ్మాలో నిర్ణయించారా అంటే అదీ లేదు. ఇంతకన్నా బుర్రతక్కువ విధానం ఇంకొకటి ఉండదు. కాని ఇదే కేంద్ర ప్రభుత్వ విధానం! దీనికి మూల్యం చెల్లిస్తున్నది మాత్రం ప్రజలు.
వ్యాక్సిన్‌ల పంపిణీ లెక్కల్లో తేడాకు ఈ విధానం ఒక్కటే కారణం అనుకోలేం. బహుశా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు తమకున్న ఉత్పత్తి సామర్ధ్యం కన్నా ఎక్కువ సామర్ధ్యం ఉన్నట్టు ప్రకటించి వుండొచ్చు. అదే గనుక వాస్తవమైతే కంపల్సరీ లైసెన్సింగ్ విధానం ద్వారా అర్జెంటుగా మన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి ఇతర కంపెనీలకు కూడా అనుమతులు ఇవ్వవలసి వుంటుంది.
కాని నీతి ఆయోగ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎటువంటి కంపల్సరీ లైసెన్సింగ్ విధానాన్నీ అమలు చేసేది లేదని స్పష్టంగా ఉంది. ఒకవైపు వ్యాక్సిన్‌ల విషయంలో పేటెంటు నిబంధనలు అమలు జరగకూడదని వాదిస్తున్న మన ప్రభుత్వం ఇంకొకవైపు కంపల్సరీ లైసెన్సింగ్ ఉండరాదని ఏ విధంగా నిర్ణయించగలదో బోధపడని విషయం. పేటెంటు నిబంధనల విషయం తేలేసరికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు కంపల్సరీ లైసెన్సింగ్ విధానం అమలు చేసి ఎక్కువ కంపెనీలకు వ్యాక్సిన్ ల ఉత్పత్తి కి అనుమతులిస్తే మన తక్షణ అవసరాలు తీరుతాయి. పేటెంల్ నిబంధనల విషయంలో మనదేశం చేస్తున్న వాదనకు బలమూ చేకూరుతుంది. కాని పొంతన లేని విధానాలకు మోడీ ప్రభుత్వం పెట్టింది పేరు కదా!
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్











