Sep 24,2021 06:20

    గ్లోబలీకరించబడిన ప్రపంచంలో వ్యాక్సినేషన్‌ విషయంపై మొత్తం ప్రపంచాన్ని యూనిట్‌గా తీసుకుని ఆలోచించాలే గాని ఏ ఒక్క దేశం, లేక రాష్ట్రం పరిధిలో ఆలోచించకూడదు. కానీ పశ్చిమ దేశాలు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో, చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాయి, నిర్ణయాలు చేస్తున్నాయి. గనుకనే వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రపంచం నేటికీ నత్త నడక నడుస్తోంది.
    తెల్లవారితే స్వేచ్ఛ గురించీ, మానవ హక్కుల గురించి ఇల్లెక్కి ప్రచారం చేసే పశ్చిమ దేశాల కాపట్యాన్ని కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిగా ఎండగడుతోంది. ప్రపంచంలో నేడు అభివృద్ధి చెందిన టెక్నాలజీని, అందుబాటులో ఉన్న నిధులను కరోనా కట్టడికి స్వేచ్ఛగా ఉపయోగించి ఉంటే ఈ సరికే ప్రపంచంలోని ప్రజలందరికీ పూర్తిగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ జరిగి ఉండేది. వ్యాక్సిన్‌లను అధిగమించే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయన్న భయం ఉండేది కాదు. ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడేవి. కానీ పేటెంట్‌ హక్కుల ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్‌ టెక్నాలజీని తమ వద్ద బందీగా ఉంచుకున్న పశ్చిమ దేశాల బహుళజాతి సంస్థలు టెక్నాలజీని పేద, మధ్య ఆదాయ దేశాలకు అందకుండా అడ్డుకున్నాయి. వ్యాక్సిన్‌లు తయారు చేసే సంస్థల నుండి సేకరించి పేద దేశాలకు అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 'కోవాక్స్‌' పథకానికి సరిపడా నిధులివ్వకుండా బిగపట్టాయి. చివరికి ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ డోస్‌లను కూడా డబ్బుతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పేద దేశాలకు అందకుండా చేశాయి. తమ దేశాల్లో పౌరులకు వ్యాక్సిన్‌ డోస్‌లు వేయగా మిగిలిపోయిన డోస్‌లు వ్యర్ధమవుతున్నాయి గానీ పేద దేశాలకు మాత్రం అందడంలేదు. ఫలితంగా నేడు ప్రపంచ వ్యాపితంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ధనిక దేశాలకూ, పేద దేశాలకూ మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడ్డాయి.
     సెప్టెంబర్‌ 20 వరకు ప్రపపంచ వ్యాపితంగా 594 కోట్ల డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు వేశారు. ప్రపంచ జనాభా 2021 సెప్టెంబర్‌ నాటికి 790 కోట్లు. అంటే ప్రపంచం లోని ప్రతి 100 మంది జనాభాకూ 77 మందికి ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ వేశారన్న మాట. కానీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి చాలా కొద్ది వ్యాక్సిన్‌లు మినహా మిగిలినవి ఒక్క డోస్‌ వేస్తే పూర్తి వ్యాధి నిరోధకత రాదు. అందువల్ల పూర్తి వ్యాధి నిరోధకత రావాలంటే ప్రపంచంలోని పెద్దలు, పిల్లలు అందరికీ కలిపి 90 శాతం మందికి రెండు డోస్‌లు వేయాలి. అంటే ప్రతి 100 మంది ప్రజలకు 180 డోస్‌లు వేసిన దేశం పూర్తిగా వ్యాధి నిరోధకత సాధించినట్లు లెక్క. ఒక్క దేశంలో పూర్తి వ్యాధి నిరోధకత వస్తే సరిపోదు. ప్రపంచమంతా రావాలి. ఎందుకంటే ఏ ఒక్క దేశంలో పూర్తి వ్యాధి నిరోధకత రాకపోయినా ఆ దేశంలో ప్రబలిన కోవిడ్‌ వైరస్‌లో ప్రస్తుత వ్యాక్సిన్‌లకు లొంగని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ కొత్త వేరియంట్లు తిరిగి ప్రపంచమంతటా వ్యాపిస్తే మళ్లీ వాటి వ్యాప్తిని నిరోధించడానికి కొత్త వ్యాక్సిన్‌లు తయారు చేయాలి. మళ్లీ ప్రపంచ ప్రజలందరికీ వాటిని వేయాలి. అంటే మళ్లీ కొత్త చక్రం ప్రారంభమవుతుందన్న మాట. ఈ రెండేళ్లలో కోవిడ్‌-19 ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో సృష్టించిన బీభత్సాన్ని గమనిస్తే ప్రపంచమంతటా పూర్తి వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేయకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో మనకు తెలుస్తుంది. రెండు డోస్‌లు వేసినా కూడా మాసాలు గడిచే కొద్దీ ప్రజల్లో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రెండు డోస్‌లు వేసేవారికి కూడా త్వరలో బూస్టర్‌ డోస్‌ వేయాల్సి రావచ్చునని అంటున్నారు. ఇప్పటికే టర్కీ, ఇజ్రాయిల్‌ వంటి దేశాలు తమ పౌరులకు బూస్టర్‌ డోస్‌లు కూడా వేయడం ప్రారంభించాయి.
     ఇదంతా పరిశీలించినప్పుడు మనకేం అర్ధమవుతుంది? గ్లోబలీకరించబడిన ప్రపంచంలో వ్యాక్సినేషన్‌ విషయంపై మొత్తం ప్రపంచాన్ని యూనిట్‌గా తీసుకుని ఆలోచించాలే గాని ఏ ఒక్క దేశం, లేక రాష్ట్రం పరిధిలో ఆలోచించకూడదు. కానీ పశ్చిమ దేశాలు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో, చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాయి, నిర్ణయాలు చేస్తున్నాయి. గనుకనే వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రపంచం నేటికీ నత్త నడక నడుస్తోంది.
     మొత్తం ప్రపంచ జనాభాలో 30.6 శాతం మందికి మాత్రమే నేటికి పూర్తిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరిగింది. ధనిక దేశాలు ఇతర వ్యాక్సిన్‌ సంస్థల నుండి వ్యాక్సిన్‌ను కొనేసి నిల్వ పెట్టుకుని తమ దేశ పౌరులకు మాత్రమే ఉపయోగించడం వల్ల అవి వ్యాక్సినేషన్‌లో ఇతర దేశాల కన్నా ముందున్నాయి. అమెరికా 54.4 శాతం పౌరులకు పూర్తిగా (రెండు డోస్‌లు) వ్యాక్సిన్‌ వేయగా, బ్రిటన్‌ 66.4 శాతం, ఫ్రాన్స్‌ 63.7, జర్మనీ 62.4, జపాన్‌ 52.4, కెనడా 68.8, ఇటలీ 64.6 శాతం చొప్పున పూర్తి వ్యాక్సినేషన్‌ చేశాయి. ఇవన్నీ జి7 దేశాలు. ఐరోపా లోని మిగిలిన ధనిక దేశాలు కూడా చాలా వరకు 50 శాతం పైగా పౌరులకు పూర్తి వ్యాక్సినేషన్‌ చేశాయి.
     వీటితో పోలిస్తే ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా ఖండాల్లోని పేద దేశా పరిస్థితి మరీ ముఖ్యంగా ఆఫ్రికా లోని అనేక దేశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకు నైజీరియాలో ఇప్పటి వరకు 0.82 శాతం మంది పౌరులకు మాత్రమే పూర్తి వ్యాక్సినేషన్‌ జరిగింది. అంగోలాలో 3.1 శాతం, మొజాంబిక్‌లో 2.5, ఉగాండాలో 0.91, ఘనాలో 1.3, సూడాన్‌లో 0.8 శాతం పౌరులకు వ్యాక్సిన్‌ వేశారు. సెప్టెంబర్‌ నాటికి మొత్తం ఆఫ్రికాలోని 54 దేశాల్లో 10 శాతం ప్రజలకు పూర్తి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 42 దేశాలు లక్ష్యానికి బారెడు దూరంలోనే ఉండిపోయాయి. మొత్తంగా చూసినప్పుడు ఆఫ్రికాలో సగటున 3 శాతం మందికి మాత్రమే రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇందులో కూడా తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. యూరప్‌కు దగ్గరగా ఉన్న ఉత్తరాఫ్రికా దేశాలు బాగా ముందున్నాయి. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఒక్క శాతం కన్నా తక్కువ మందికి పూర్తి వ్యాక్సిన్‌ వేసిన దేశాలు అత్యధికం ఉన్నాయి.
     భారత దేశంలో మోడీ ప్రభుత్వం వ్యాక్సిన్‌ విధానంలో చూపించిన నిర్లక్ష్యం, అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రమైన మన దేశం ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయడంలో బాగా వెనుకబడిపోయింది. డిసెంబర్‌ నాటికి దేశంలో 80 శాతం మంది ప్రజలకు పూర్తి వ్యాక్సిన్‌ వేయాలన్న లక్ష్యానికి మనం ఇంకా చాలా దూరంలోనే ఉండిపోయాం. దేశంలో ఇప్పటి వరకు 80.5 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ వేశారు. మన దేశ జనాభా 136 కోట్లు. 56 శాతం మందికి ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ వేశారు. కానీ పూర్తి వ్యాక్సిన్‌ (రెండు డోస్‌లు) వేసింది మాత్రం 13.3 శాతం మందికే. పిల్లలతో సహా దేశంలోని 90 శాతం మందికి వ్యాక్సిన్‌ వేయాలంటే ఇంకా సుమారు 160 కోట్ల డోస్‌లు వేయాలి. అంటే ఇప్పటి వరకు పూర్తయింది మూడింట ఒక వంతు మాత్రమే. ప్రజలను మోసగించడం కోసం ప్రతి రోజూ మోడీ ప్రభుత్వం వేయాల్సిన డోస్‌లు గురించి చెప్పకుండా వేసిన డోస్‌ల గురించి, ఇతర దేశాలతో పోల్చి చెబుతోంది. కానీ కరోనా ప్రమాదం వ్యాక్సిన్‌ వేసిన వారితో కాదు వేయనివారితో వస్తుంది. అందువల్ల కరోనా మహమ్మారిని అరికట్టాలన్నా, కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి సరికొత్త ప్రమాదం రాకుండా ఉండాలన్నా మాటల గారడీలు చేయడం కన్నా దేశం లోని 90 శాతం ప్రజలకు అతి త్వరగా వ్యాక్సిన్‌లు వేయడం ముఖ్యం.
     పశ్చిమ దేశాలు ఒక వైపు వ్యాక్సిన్‌లను పెద్దఎత్తున కొనేసి తమ దేశ పౌరుల కోసం నిల్వ పెట్టుకుంటున్న సమయంలో ఇతర దేశాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ సరఫరా చేయడానికి భారత్‌ ముందుకొచ్చింది. మన ఇరుగు పొరుగు దేశాలతోబాటు అనేక దేశాలకు సరఫరా చేస్తామని అడ్వాన్సులు కూడా పుచ్చుకుంది. కానీ దేశంలోనే ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో 95 ప్రపంచ దేశాలకు 6.63 కోట్ల డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేసి మధ్యంతరంగా ఆపేసింది. ఈ నెలాఖరుకు మళ్లీ ఎగుమతులు పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
     కానీ చైనా మాత్రమే తను తయారు చేసిన వ్యాక్సిన్‌లను తన దేశ పౌరులతో పాటు ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు సరఫరా చేస్తోంది. ఒకవైపు తన దేశంలోని 63.4 శాతం పౌరులకు పూర్తి వ్యాక్సినేషన్‌ చేసింది. మరోవైపు ఈ ఏడాది (2021) ప్రపంచ దేశాలకు 200 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ సరఫరా చేస్తామని చైనా వాగ్దానం చేసి అందులో ఇప్పటి వరకు (సెప్టెంబర్‌ మధ్యకు) 79.7 కోట్ల డోస్‌లు సరఫరా చేసింది. పశ్చిమ దేశాలు కోవిడ్‌ వ్యాక్సిన్‌తో వ్యాపారం చేస్తే చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ మాత్రం తమ దేశంలో తయారయ్యే వ్యాక్సిన్‌లు ప్రపంచ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు.
      ఈ విషయంలో మరో చిన్న దేశం సోషలిస్టు క్యూబా గురించి ఘనంగా చెప్పుకోవాలి. సుమారు 1.8 కోట్ల మంది జనాభా ఉన్న క్యూబా దేశంలోని ప్రతి 100 మందికి 160 డోస్‌ల వ్యాక్సిన్‌ వేసింది. అంటే జనాభాలో సుమారు 80 శాతం మందికి రెండు డోస్‌లు వేసింది. ఈ విషయంలో అది అమెరికా, చైనా ఇతర అభివృద్ధి చెందిన దేశాల కన్నా చాలా ముందుంది. అంతేకాదు. చిన్న దేశం అయినా, అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూ కూడా అది 'అబ్దాలా' పేరుతో తన స్వంత కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసుకుని లాటిన్‌ అమెరికా లోనే స్వంత వ్యాక్సిన్‌ తయారు చేసుకున్న దేశంగా ఘనత వహించింది. 'అబ్దాలా' వ్యాక్సిన్‌ కాకుండా సోబెరనా-2తో సహా మరో మూడు వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తోంది.
      చైనాలో తన దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంతోపాటు, దాదాపు దేశ ప్రజలందరికి వ్యాక్సిన్‌ వేయడమే కాకుండా ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తుండడంతో అమెరికా ఇతర పశ్చిమ దేశాల మీద ఒత్తిడి పెరిగింది. స్వార్ధ బుద్ధి, స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో వారు ఆడుతున్న కపట నాటకం ప్రపంచ దేశాల ముందు బట్టబయలైంది. దాంతో విధిలేని పరిస్థితుల్లో తాము కూడా ప్రపంచానికి 100 కోట్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ను ఈ ఏడాది చివరికి సరఫరా చేస్తామని గత నెల జరిగిన జి7 శిఖరాగ్ర సభ ప్రకటించింది. ఇందులో అమెరికా 50 కోట్ల డోస్‌లు, బ్రిటన్‌ 10 కోట్ల డోస్‌లు... ఇలా వాగ్దానాలు చేశాయి. కానీ ఇప్పటి వరకు ఈ దేశాల వాగ్దానాలు మాటల్లోనే వున్నాయిగానీ ఆచరణ రూపం దాల్చలేదు.
     ఏదేమైనా ప్రపంచ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌లు వేయడం, అది కూడా అతి త్వరగా వేయడం నేడు తక్షణం జరగాల్సిన పని. లేకుంటే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే గత రెండు సంవత్సరాలుగా విలయాన్ని చవిచూసిన ప్రపంచం మరో కొత్త విలయం లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దాన్నుండి పేద దేశాలే కాదు...ధనిక దేశాలు కూడా తప్పించుకోలేవు.
 

ఎస్‌. వెంకట్రావు

ఎస్‌. వెంకట్రావు