Jul 17,2021 06:21

      పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకు అత్యధిక లాభార్జనే పరమావధి. మానవ అవసరాల కంటే లాభాలే ముఖ్యం. కాబట్టి మేధో సంపత్తి హక్కుల పేరిట...వ్యాక్సిన్‌ టెక్నాలజీని దానికి సంబంధించిన విజ్ఞానాన్ని బదిలీ చేయడానికి తీవ్ర అవరోధాలు కల్పిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రైవేటు పెట్టుబడి చేతిలో బందీ అయినటువంటి వ్యాక్సిన్లు... ధనిక, బీద తారతమ్యం లేకుండా ప్రపంచ ప్రజలందరికీ చేరే అవకాశం కనుచూపు మేరలో వుందా...అనే ప్రశ్న తలెత్తింది. దీనికి చైనా, క్యూబా లాంటి దేశాలు సంతృప్తికరమైన సమాధానాలిస్తున్నాయి.
     పెట్టుబడిదారీ దేశాలకు, సోషలిజం పట్ల విశ్వాసమున్న దేశాలకు మధ్యగల మౌలికమైన వ్యత్యాసాన్ని కరోనా మహమ్మారి బట్టబయలు చేసింది. భౌగోళికంగా కొన్ని ప్రత్యేకతలు సంతరించుకొన్న, జనసాంద్రత అత్యంత పల్చగా వున్న కారణంగా న్యూజిలాండ్‌ లాంటి అతి కొద్ది దేశాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయగల్గినా బ్రిటన్‌, బెల్జియం, ఇటలీ, అమెరికా లాంటి దేశాలు మహమ్మారి ఉధృతికి ఎలా విలవిల్లాడాయో చూశాం. నిజానికి అత్యంత అభివృద్ధి చెందిన ధనిక దేశాలు...తమ అపార ధన సంపదతో, పటిష్టమైన అత్యంత ఆధునిక వైద్య ఆరోగ్య వ్యవస్థ సాయంతో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయని యావత్‌ ప్రపంచం ఆశించింది. మరోవైపు కరోనా ఎక్కడైతే పుట్టిందని భావిస్తున్నారో ఆ చైనా లోనే చేపట్టిన పటిష్టమైన చర్యలతో మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలిగారన్న వార్తలు మనం విన్నాం. క్యూబా, వియత్నాం లాంటి దేశాలు కూడా ఈ వరుసలోనే నిలుస్తాయి.
         ప్రజల భాగస్వామ్యంతో వారి బాగోగులు చూసుకుంటూ కొన్ని సామాజిక చర్యలు చేపట్టడం ద్వారా, ప్రజలకు మొదటి నుండీ మంచి వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించడం ద్వారా సోషలిస్టు దేశాలకు కరోనా కట్టడి సాధ్యమయింది. మొదటి నుండీ కరోనా కట్టడి చేయడంలో సమర్ధవంతంగా వ్యవహరించలేని ధనిక, పెట్టుబడిదారీ దేశాలు కరోనా కట్టడికి వ్యాక్సిన్లు ఒక్కటే పరిష్కార మార్గమని భావించి ఆ దిశగా కృషి చేసి విజయం సాధించాయి. అయితే తాము సాధించిన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణను ప్రపంచ మానవాళికంతటికీ అందించకుండా అవరోధాలు కల్పిస్తుండటం చూస్తున్నాం. మరోవైపు చైనా, క్యూబా లాంటి దేశాలు తమకున్న విజ్ఞాన శాస్త్ర వనరులతో పరిశోధన ద్వారా కోవిడ్‌-19 కట్టడికి సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడమే కాక ప్రపంచ మానవాళికి అంతటికీ అందించడానికి సిద్ధపడ్తున్నాయి.
     అభివృద్ధి చెందిన హైటెక్‌ ఫార్మా మరియు బయో టెక్నాలజీ పరిశ్రమను ప్రభుత్వ నిధులతోనే ప్రోత్సహించిన ధనిక దేశాలు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ని తయారు చేయడంలో కృతకృత్యులయ్యాయి. ఆధునిక ఎమ్‌.ఆర్‌.ఎన్‌.ఎ. టెక్నాలజీ ద్వారా తయారైన ఈ వ్యాక్సిన్లు సూత్రరీత్యా ఏవిధమైన ఉత్పరివర్తనాలనైనా సమర్థవంతంగా లొంగదీస్తాయనీ, ఇటువంటి టెక్నాలజీ భవిష్యత్తులో సార్వత్రిక ఫ్లూ వ్యాక్సిన్‌కు, హెచ్‌.ఐ.వి. వ్యాక్సిన్‌ అభివృద్ధికి కూడా బాటలు వేస్తుందని చెప్తున్నారు. సాంప్రదాయ వ్యాక్సిన్‌ తయారీకి లైవ్‌ వైరస్‌లను ఉపయోగిస్తారు. కాబట్టి అత్యంత భద్రతతో కూడిన బయో సేఫ్టీ ల్యాబ్‌ (బి.యస్‌.ఎల్‌)ను ఉపయోగించవలసి ఉంటుంది. యమ్‌.ఆర్‌.యన్‌.ఎ. టెక్నాలజీ దీనికి భిన్నమైనదనీ, వ్యాక్సిన్లను తేలికగా త్వరగా ఉత్పత్తి చేయవచ్చనీ, టెక్నాలజీ బదిలీకి 4 నుండి 5 నెలల సమయం మాత్రమే సరిపోతుందని మోడర్నా కంపెనీ మాజీ డైరెక్టరు సుహైబ్‌ సద్ధికి తెలియచేశారు. అంతేకాక ఎమ్‌.ఆర్‌.ఎన్‌.ఎ వ్యాక్సిన్‌ల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిపిడ్‌ నానోపార్టికల్స్‌ అనే పదార్ధాన్ని తయారు చేసే టెక్నాలజీ జర్మనీకి చెందిన 'మెర్క్‌', కెనడా దేశానికి చెందిన 'ఎక్యూటస్‌' అనే రెండు కంపెనీలకు మాత్రమే ఉంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకు అత్యధిక లాభార్జనే పరమావధి. మానవ అవసరాల కంటే లాభాలే ముఖ్యం. కాబట్టి మేధో సంపత్తి హక్కుల పేరిట...వ్యాక్సిన్‌ టెక్నాలజీని దానికి సంబంధించిన విజ్ఞానాన్ని బదిలీ చేయడానికి తీవ్ర అవరోధాలు కల్పిస్తున్నాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వాడకం తదితరాల వలన సమస్యలేమైనా తలెత్తినా, తద్వారా న్యాయపరమైన వివాదాలు ఉత్పన్నమైనా ఖర్చులను సదరు ప్రభుత్వాలే భరించాలనీ... అందుకు అర్జంటీనా, బ్రెజిల్‌ తదితర ప్రభుత్వాలు తమ దేశ మిలటరీ స్థావరాలను, ఎంబసీ భవనాలను తనఖా పెట్టాల్సిందిగా ఫైజర్‌ కంపెనీ ఒత్తిడి తెచ్చినట్లుగా వార్తలొచ్చాయి. ఈ విధంగా సామ్రాజ్యవాదం తన మిలటరీ శక్తితోనే కాక తమ దేశాలకు చెందిన కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తదితర ప్రాణరక్షక టెక్నాలజీతో కూడా ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని శాసిస్తోంది.
        మరోపక్క దశాబ్దాలుగా అమెరికా విధించిన ఆంక్షలను తట్టుకుంటూ తమ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం తన వంతు కృషిని సమర్థంగా కొనసాగిస్తున్న అతి చిన్న దేశం క్యూబా కూడా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందంజలో వున్నది. బయో టెక్నాలజీ పరిశోధనలకు, వ్యాక్సిన్లు, మందుల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనా సంస్థని క్యూబా 1981 లోనే స్థాపించించి. ది సెంటర్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ అండ్‌ జనెటిక్‌ ఇంజనీరింగ్‌ మనుషులు మరియు పశువులకు సంబంధించిన వ్యాక్సిన్లు, మోనోక్లోనల్‌ యాంటిబాడీస్‌, జన్యు మార్పిడి పంటల రూపకల్పనలో నిమగమైంది. బయో టెక్నాలజీలో అద్భుత విజయాలను సాధించిన క్యూబా 30 సంవత్సరాల క్రితమే హవానా లోని ఫిన్‌లే ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ప్రపంచ మొదటి మెనింజైటిస్‌ (మెదడువాపు) వ్యాక్సిన్‌ను...ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు అందించింది.
       అదే ఫిన్‌లే సంస్థ నేడు 5 రకాల కరోనా వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో పురోగతి సాధించింది. ఇందులో సోబెరనా, అబ్డాలా అనే వ్యాక్సిన్లు మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకొన్నాయని క్యూబన్‌ అధికారులు తెలియచేశారు. ముక్కులో స్ప్రే చేసే 'మాంబిసా' అనే వ్యాక్సిన్‌ కూడా ప్రయోగ దశలో వున్నది. 'సొబెరానా 1, 2 మరియు ప్లస్‌' అంటే సార్వభౌమత్వమనీ, క్యూబా విప్లవ సాహిత్యకారుడు 'జోస్‌ మార్తి' విఖ్యాత కవిత లోని కథానాయకుని పేరు మీద 'అబ్డాలా' అనే వ్యాక్సిన్‌ తీసుకొచ్చారు. అదేవిధంగా, క్యూబా గెరిల్లా యుద్ధ యోధుడు ''మాంబిసా'' పేరు 'నాసల్‌ స్ప్రే' కు పెట్టారు. గతంలో మెనింజైటిస్‌ వ్యాక్సిన్‌ను ప్రపంచ మానవాళికి అందించిన క్యూబా ప్రస్తుతం న్యుమోకాకస్‌, వూపింగ్‌ కాఫ్‌తో పాటుగా అత్యంత క్లిష్టమైన ఊపిరిత్తుతుల క్యాన్సర్‌కి కూడ వ్యాక్సిన్‌ రూపొందించే కృషిలో వుంది. ఇప్పుడు రూపొందిస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్ల ప్రయోగ పరీక్షలకు వలంటీర్లను ఎంపిక చేసే క్రమంలో అవసరానికి 3 రెట్లు మించి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే క్యూబన్‌ ప్రజలకు వారి దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ పట్ల ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 11 మిలియన్ల జనాభా కలిగిన అతి చిన్న దేశం 1 లక్షా 50 వేల మంది తమ ఆరోగ్య రంగ కార్యకర్తలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు ఇచ్చి ఎవ్వరూ సాహసించని ఒక్క పెద్ద అధ్యయనం చేస్తోందంటేనే వారి పరిశోధనాశక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క కోవిడ్‌ వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుపుతూనే మరోపక్క ఇరాన్‌, వెనిజులా దేశాల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసి ఏడాదికి 100 మిలియన్‌ డోసుల సామర్ధ్యాన్ని పెంచుకొనే పనిలో పడింది. పైగా వీరి వ్యాక్సిన్లు సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకోవచ్చనీ, 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలను కూడ తట్టుకోగలదు కనుక ఉష్ణమండల దేశాల ప్రజలు కూడ ఈ వ్యాక్సిన్లను వాడవచ్చనీ తెలుస్తోంది. ధనిక దేశాలు తమ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఇవ్వడానికి ఎన్నో అడ్డంకులు సృష్టించడంతో వెనిజులా, బొలీవియా, ఇరాన్‌, మెక్సికో, అర్జెంటీనా, ఆంటిగ్వా లాంటి అనేక దేశాలు క్యూబా రూపొందించిన కోవిడ్‌-19 వ్యాక్సిన్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ క్లినికల్‌ పరీక్షలు, అధ్యయనాలన్నీ పూర్తయ్యేటప్పటికి జూన్‌ లేదా జులై మాసాలు పడ్తుందని అప్పుడే వ్యాక్సిన్‌ అందించడానికి వీలవుతుందని క్యూబా అధికారులు ప్రకటిస్తుంటే వ్యాక్సిన్‌ పరిశోధనలో అత్యంత ప్రతిభ, ప్రగతి ప్రదర్శిస్తున్న క్యూబా అంటే గిట్టనివారు క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కాకుండానే వ్యాక్సిన్లను ప్రజానీకానికి ఇస్తున్నారనే విష ప్రచారం చేస్తున్నారు.
      ఏప్రిల్‌ మొదటి వారాంతానికే 160 మిలియన్‌ డోసుల కోవిడ్‌-19 వ్యాక్సిను తమ ప్రజలకిచ్చిన చైనా, 80 మిలియన్‌ డోసుల్ని ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. ఇవిగాక 90 మిలియన్‌ అదనపు డోసుల్ని బ్రెజిల్‌, ఇండొనేషియా లోని ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నట్లు 'చైనా మార్నింగ్‌ పోస్ట్‌' పత్రిక ప్రకటించింది. చైనా తనదైన శైలిలో 120 మిలియన్‌ డోసుల ఎమ్‌.ఆర్‌.ఎన్‌.ఎ. వ్యాక్సిన్లు తయారు చేయడానికి ఏర్పాట్లు మొదలైనాయి. చైనా పరిశోధనలో అభివృద్ధి అయ్యే ఎమ్‌.ఆర్‌.ఎన్‌.ఎ. కోవిడ్‌ వ్యాక్సిన్‌ 2021 చివరి నాటికి రావచ్చనీ, దాన్ని గది ఉష్ణోగ్రత లోనే నిల్వ చేసుకోవచ్చనీ తెలుస్తోంది. అంతేకాక ఎమ్‌.ఆర్‌.ఎన్‌.ఎ. వ్యాక్సిన్ల తయారీకి అత్యంత కీలకమైన 'లిపిడ్‌ నానో పార్టికల్‌ కోటింగ్‌'ను చైనా దేశం సొంతంగా రూపొందించింది.
      ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు అపార ధనరాశులు పోగేసుకోవడానికేనా? మానవత్వపు ఛాయలు కనీసం లేవా? ప్రజారోగ్య ఎమర్జెన్సీని వాడుకొని ప్రైవేట్‌ ప్రాఫిట్లుగా మార్చు కోవడమేనా? అందరికీ ఆరోగ్యం ఎప్పుడు? వంటి మౌలికమైన ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చనీయాంశాలయ్యాయి. ఈ తరుణంలో ప్రైవేటు పెట్టుబడి చేతిలో బందీ అయినటువంటి వ్యాక్సిన్లు...ధనిక, బీద తారతమ్యం లేకుండా ప్రపంచ ప్రజలందరికీ చేరే అవకాశం కనుచూపు మేరలో వుందా...అనే ప్రశ్న తలెత్తింది. దీనికి చైనా, క్యూబా లాంటి దేశాలు సంతృప్తికరమైన సమాధానాలిస్తున్నాయి.
 

/ వ్యాసకర్త ఎ.పి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్స్‌ యూనియన్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి /
పి. దక్షిణామూర్తి

పి. దక్షిణామూర్తి