Dec 13,2020 15:37

'చరిత్ర మరిచి పోయినవారు అవే తప్పుల్ని మళ్లీ మళ్లీ చేస్తారు : జార్జి శాంటాయనా
Those who do not remember the past are condemned to repeat it 
                                                                        - George Santayana 


ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలిప్పుడు. ప్రస్తుతం ప్రపంచానికి వ్యాక్సిన్‌ అవసరం ఎంతైనా ఉంది. కరోనా కల్లోలం నుండి ఇప్పట్లో బయటపడే పరిస్థితి ఉందా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. 1918-20లో వచ్చిన ఇన్‌ఫ్లూయింజా ప్యాండమిక్‌ (స్పానిష్‌ ఫ్లూ)తో దాదాపు 2 నుండి 4 కోట్ల మంది వరకూ చనిపోయారు. ఆ తర్వాత 1956 లో ఈ మహమ్మారి వచ్చింది గానీ మరణాలు ఎక్కువ లేవు. 20వ శతాబ్దానికి ముందు పరిస్థితులు ఏమిటి ? అప్పట్లో ఎలాంటి వ్యాధులతో ప్రజలు బాధపడ్డారు ? ఆ చరిత్ర ఏమిటి? ఈ టీకాలు ఏమిటి? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? రాజుల పాలనలో ఇలాంటి వైరస్‌లు ఏమైనా వచ్చాయా? వాటికి టీకాలు ఏమైనా వేశారా ? అప్పుడు వాళ్లు ఏం చేశారు ? ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారు ? ఇలాంటి విషయాలపై 'స్నేహ' ప్రశ్నలకు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ఎస్‌.సుధాకర్‌ ఎంతో విశదంగా వివరణ ఇచ్చారు. ఆ ప్రశ్నల, జవాబుల సమాచారమే ఈ వారం అట్టమీది కథనం..
 

వ్యాక్సిన్‌ అంటే ?
    వ్యాధి నిరోధక మందుని 'వ్యాక్సిన్‌' అంటారు. ఒక్కో వ్యాధికి ఒక్కో వ్యాక్సిన్‌ ఉంటుంది. పోలియో వ్యాక్సిన్‌ చుక్కల రూపంలో ఉంటుంది. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే పోలియో వ్యాక్సిన్‌ కూడా ఉంది. కొన్ని వ్యాక్సి న్‌లను రెండు మూడు జబ్బులకు ఉపయోగపడేలా తయారు చేస్తారు. కొన్నిసార్లు ఐదు జబ్బులకూ పనిచేసేలా తయారుచేస్తారు. చిన్నపిల్లలకు ఎక్కువ సూదిపోట్లు లేకుండా చేయడానికి ఇలా కలిపి చేస్తారు.
 

ఆ పేరు ఎలా వచ్చింది ?
     ఇటాలియన్‌ భాషలో 'వాకా' అంటే 'ఆవు'. ఇంగ్లీష్‌ డాక్టర్‌ ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మొదటి వ్యాక్సినేషన్‌ క్రీ.శ. 1796లో చేశాడు. ఆయనకు, మిగిలిన వైద్యులకు మశూచి ఎలా వస్తుందో తెలియదు. ఆవులకు వచ్చే వ్యాధి కూడా మశూచి అనుకున్నాడు. ఆవు పొదుగుకి వచ్చే గడ్డలు, ఆవు పాలు పితికే మహిళల (మిల్క్‌ మెయిడ్‌) చేతులకు పాకేవి. ఆ చేతి గడ్డ నుంచి రసి తీసి, అంతకుముందు మశూచి సోకని వారి శరీరంలో ప్రవేశపెట్టాడు. వారికి తరువాత మశూచి రాదని నిరూపించాడు. ఆయన గౌరవార్థం ఆ పద్ధతికి 'వ్యాక్సినేషన్‌' అనే పేరు పెట్టారు.

మశూచి అంత ప్రమాదకరమా ?

వ్యాక్సిన్‌.. ఎప్పుడు ? ఎక్కడీ ఎలా ?


       ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కొంత చరిత్ర గుర్తు చేసుకోవాలి. మానవజాతి పరిణామక్రమంలో కరువు కాటకాల తరువాత అంటువ్యాధులు ముఖ్యపాత్ర పోషించాయి. క్రీ.శ. 1348 నుంచి 1350 మధ్య యూరప్‌ జనాభాలో మూడో వంతు (రెండు కోట్ల మంది) ప్లేగు వ్యాధితో చనిపోయారు. దీన్నే బ్లాక్‌డెత్‌ అంటారు. ప్లేగు వచ్చిన వారిలో సగం మంది చనిపోయేవారు. మిగిలిన ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి పారిపోయేవారు. చాలా గ్రామాలు, పట్టణాలలో చర్చి పాస్టర్‌తోపాటు ప్రజలంతా చనిపోయేవారు. పొలాలు బీళ్లుగా మారాయి. ప్లేగు వ్యాధి సామాన్య ప్రజానీకానికి సంక్రమించేది.పాలక వర్గాలు రాజ వంశీకులు ఈ వ్యాధి నుంచి పెద్దగా బాధపడలేదు.
 

రాజులు, పాలకవర్గాలు ఎలా తప్పించుకున్నారు ?
          సామాన్య ప్రజలు ఇరుకు గదుల్లో నివసించేవారు. అప్పటికి వ్యక్తిగత, పరిసరాల పరిశభ్రత మీద ఎవరికీ అవగాహన లేదు. ఒకే ఇంట్లో వంటా వార్పు, నివసించడం, ఒకే కంబళి కింద (చలి వల్ల) నిద్రించడం చేసేవారు. ఎలుకలు, ఈగలు వారితో సహజీవనం చేసేవి. రాజులు, పాలకవర్గాలు పెద్ద పెద్ద (ఎలుకలు లేని) నివాసాల్లో ఉండేవారు. అలా ప్లేగు 16వ శతాబ్దం దాకా యూరప్‌లో అప్పుడప్పుడు మరణ తాండవం చేసేది.
 

మశూచి గురించి చెప్పండి..
       మశూచి 16వ శతాబ్దం నుంచి యూరప్‌లో ఏటా ప్రత్యక్షమయ్యేది. ఆసియా ఖండం నుంచి వచ్చే సరుకు రవాణా నౌకల నుంచి వచ్చేదని భావించేవారు. మశూచి ముఖ్యంగా పదేళ్లలోపు పిల్లలకు సంక్రమించేది. రోగులలో నూటికి 30 మంది చనిపోయేవారు. మిగిలిన వారి శరీరం మీద ముఖ్యంగా ముఖం మీద గడ్డలు తయారయ్యేవి. అవి మానేటప్పుడు గుంటలు పడి, ముఖం వికారంగా తయారయ్యేది. కొంతమంది గుడ్డి వాళ్లయ్యేవారు. సామాన్య ప్రజలే కాకుండా రాజులు, పాలకవర్గాలూ మశూచి వల్ల దెబ్బతిన్నారు. ఉదాహరణకు ఇంగ్లాండ్‌ రాణి మేరీ, ఆస్ట్రియా చక్రవర్తి జోసేఫ్‌, స్పెయిన్‌ రాజు లూయి-1, రష్యా జార్‌ పీటర్‌ -2, స్వీడన్‌ రాణి ఉల్రికా ఎలియనారా, ఫ్రాన్స్‌రాజు లూయిస్‌-4 మశూచితోనే చనిపోయారు. క్రీ.శ. 1710లో లండన్‌లో మూడువేల మంది చనిపోయారు.
 

మశూచితో పాలకవర్గాలు ఎందుకు దెబ్బతిన్నాయి ?
         మశూచి కూడా కరోనా వ్యాధి మాదిరిగానే గాల్లో వ్యాప్తి చెందుతుంది. రోగి ముక్కు, నోరులో పుండ్ల నుంచి ఊపిరి, దగ్గు ద్వారా పరిసరాల్లో ఉన్నవారికి పాకుతుంది. మరి పాలకవర్గాలు దైనందిన కార్యకలాపాలకు సేవకుల మీద, చెలికత్తెల మీద ఆధారపడతారు గదా! వారి ద్వారా వ్యాధి సోకి మరణించేవారు.
 

జెన్నర్‌కు ముందు మశూచిని ఎలా నిరోధించేవారు ?

వ్యాక్సిన్‌.. ఎప్పుడు ? ఎక్కడీ ఎలా ?


         మశూచిని 'వేరియోలా' అనేవారు. 'వేరియోలా' అంటే లాటిన్‌ భాషలో 'గడ్డల వ్యాధి'. వేరియోలేషన్‌ అంటే మశూచి వచ్చిన రోగి శరీరంపై గడ్డ నుంచి కొంత పదార్థం తీసి, మశూచి లేని వారి శరీరం మీద గాటు పెట్టి, అంటించడం. ఇది చైనా, భారత్‌లో నాటు వైద్యంగా ఉండేది. ఈ పద్ధతి ముస్లిం దేశాలకు విస్తరించింది.
 

దీన్ని యూరప్‌లో ఎవరు ప్రవేశపెట్టారు ?
         ఇంగ్లీష్‌ పాలకవర్గాలకు చెందిన మేరీ మోంటగో తమ్ముడు విలియం ఇరవై ఏళ్ల వయసులో మశూచితో చనిపోయాడు. తర్వాత రెండేళ్లకు 26 ఏళ్ల మేరీకి కూడా మశూచి సోకింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ముఖం మీద మచ్చలతో బతికింది. తన తండ్రిని ఎదిరించి, ఎడ్పర్ట్‌ మోంటగో అనే భూస్వామిని పెళ్లాడింది. ఆయన తర్వాత ఒట్టామాన్‌ సామ్రాజ్యానికి రాయబారిగా నియమితుడయ్యాడు. ఆయనతో కానిస్టాంటి నోపుల్‌ (ప్రస్తుత ఇస్తాంబుల్‌) వెళ్లింది. అప్పటికి వారికి ఇద్దరు పిల్లలు. అక్కడ వేరియోలేషన్‌ గురించి విన్నది. తనకు పట్టిన గతి తన పిల్లలకు రాకూడదని ఆరేళ్ల కొడుకుకి వేరియోలేషన్‌ చేయమనిరాయబార కార్యాలయంలోని వైద్యుడిని అడిగింది. ఆయన పేరు చార్లెస్‌ మైట్‌లాండ్‌. ఆయన ఒక గ్రీకు నాటు వైద్యురాలితో ఆ ప్రక్రియ చేయించాడు. తర్వాత వారి కుటుంబం ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చింది. క్రీ.శ. 1721లో మళ్లా ఇంగ్లాండ్‌లో మశూచి ప్రత్యక్షమైంది. అప్పటికి చార్లెస్‌ మైట్‌లాండ్‌ ఇంగ్లాండ్‌ వచ్చాడు. ఆయనతోనే తన మూడేళ్ల ఆడపిల్లకు వేరియోలేషన్‌ చేయించింది. ఈ విషయం రాణికి (కెరోలిన్‌) తెలిసి తన ఆరుగురు పిల్లలను మశూచి నుంచి కాపాడాలని రాజుతో ఈ పద్ధతి గురించి చెబుతుంది. ఆయన వైద్యులను పిలిచి, ఈ పద్ధతి కొంతమంది మీద ప్రయోగం చేయమని ఆదేశించాడు.
        మరణశిక్ష విధించబడి కారాగారంలో ఉన్న ఆరుగురు ఖైదీలను గుర్తించి, వారి మీద ఈ ప్రయోగం చేయడానికి ఆదేశించాడు. ఈ ప్రయోగం తర్వాత చనిపోకపోతే ప్రాణబిక్ష పెడతానని మాట ఇచ్చాడు. ఆ విధంగా క్రీ.శ. 1721లో, ఆగస్టు 9న మొట్టమొదటి ఔషధ ప్రయోగం ముగ్గురు మగవారు, ముగ్గురు ఆడవారిపై చేశారు. ఆ ప్రయోగం సఫలమవ్వడంతో వారికి ప్రాణబిక్ష పెట్టారు. అయినా రాణికి నమ్మకం కలగలేదు. పిల్లలపైనా ప్రయోగం చెయ్యమని ఆదేశించింది. ఆరుగురు అనాధ పిల్లలకు వేరియోలేషన్‌ చేశారు. ఆ తర్వాత పాలకవర్గాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కూడా వేరియోలేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత రాణి తన పిల్లలకూ చేయించింది. ఆ విధంగా క్రీ.శ. 1722 నుంచి 1796 వరకు వేరియోలేషన్‌ అమలులో ఉంది.. కానీ ఈ పద్ధతి బహుళ ప్రాచుర్యం పొందలేదు. జెన్నర్‌ ఎనిమిదేళ్ల వయసులో వేరియోలేషన్‌కి గురయ్యాడు.
 

ఎందువల్ల ప్రాచుర్యం పొందలేదు ?
         మశూచి రోగి నుంచి తీసే పదార్థంతో చేయడం వల్ల కొంతమంది మశూచి బారిన పడేవారు. వారివల్ల వారి చుట్టుపక్కల వారికి మశూచి సోకేది. నూటికి ఇద్దరు మశూచితో చనిపోయేవారు. చాలామంది వైద్యులు ఈ పద్ధతికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఈ పద్ధతి డబ్బులున్న వారికే అందుబాటులో ఉండేది. అందువల్ల ప్రతి సంవత్సరం మశూచితో మరణాలు సంభవించేవి. దీనికంటే మెరుగైన, ప్రమాదంలేని పద్ధతి గురించి జెన్నర్‌ ఆలోచించాడు.
 

జెన్నర్‌ రచనల్లో 'వైరస్‌' అనే పదం వాడారంటారు కదా ?
          'వైరస్‌' అంటే లాటిన్‌లో 'విషం' అని అర్థం. సూక్ష్మక్రిముల వల్ల అంటువ్యాధులు వస్తాయని ఆ రోజుల్లో వైద్యులకు తెలియదు. ఫ్రెంచ్‌ సైంటిస్ట్‌ లూయిస్‌ పాస్టర్‌ క్రీ.శ. 1870లో బ్యాక్టీరియాను కనుగొన్నాడు. క్రీ.శ. 1892లో రష్యా సైంటిస్ట్‌ డిమిట్రీ ఇవనోవ్సకీ వైరస్‌ని కనుగొన్నాడు. జెన్నర్‌ వైరస్‌ అనే పదార్థాన్ని విషం అనే అర్థంతో వాడాడు. అప్పుడు వ్యాధులకు కారణం గాలిలో ఉండే విషపదార్థాలని అనుకునేవారు. వైద్యంలో ఎక్కువభాగం కక్కించడం, సుఖ విరోచనం కావడానికిచ్చే మందులతో ఉండేది.
 

స్మాల్‌పాక్స్‌ వాక్సినేషన్‌ గురించి చెప్పండి..
        పల్లె ప్రజల్లో ఉండే నమ్మకాలను మనం మూఢనమ్మకాలని తోసిపారేస్తాం. జెన్నర్‌ వైద్యం చేస్తున్న మొదట్లో ఒక మిల్క్‌మెయిడ్‌ నవ్వుతూ 'నాకు మశూచి రాదుగా!' అన్న మాట వింటాడు. ఎందుకని ఆమెను అడిగితే.. 'నాకు చేతులకు కౌపాక్స్‌ వచ్చింది. అది వచ్చిన వారికి మశూచి రాదు అని ప్రజల నమ్మకం!' అని చెబుతుంది. ఈ విషయాన్ని గురించి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాల పరిశీలన తర్వాత దాన్ని పరీక్ష చేద్దామనుకుంటాడు. తన తోటమాలి కొడుకు జేమ్స్‌ఫిప్స్‌ మీద ప్రయోగం చేద్దామనుకున్నాడు. ఆ బాబుకు అంతకుముందు మశూచి రాలేదు. క్రీ.శ. 1796లో ఆ గ్రామంలో ఆవులకు కౌపాక్స్‌ వచ్చింది. మిల్క్‌మెయిడ్‌ (సారా) చేతికి గడ్డలు సోకాయి. ఆమె చేతి గడ్డ నుంచి కొంత రసి తీసి, సూదితో జేమ్స్‌ఫిప్స్‌ చేతి మీద గాటు పెట్టి రసిని అంటించాడు. తొమ్మిది రోజుల తర్వాత ఫిప్స్‌కి జ్వరం, చంకలో వాపు, తలనొప్పి వచ్చి, రెండు మూడు రోజులు తరువాత కోలుకున్నాడు. ఏడువారాల తర్వాత జులై1న ఫిప్స్‌కి వేరియోలేషన్‌ చేశాడు. కొద్దిరోజుల నలత తర్వాత ఫిప్స్‌ ఆరోగ్యంగా ఉన్నాడు. మరో ఐదుగురికి ఇదే పద్థతి చేసి, వైద్య పత్రికలో ప్రచురించమని తన పరిశోధన పత్రం పంపాడు. వాళ్లు తిరస్కరించారు. తర్వాత సొంత ఖర్చులతో పుస్తకం ప్రచురించాడు.
 

ఇప్పుడు కూడా వ్యాక్సిన్‌ ఆవుల నుంచే చేస్తున్నారా ?
          జెన్నర్‌ కాలంలోనే కౌపాక్స్‌ని గుర్రాలకు వచ్చేటట్లు చేసి, గుర్రాల నుంచి వ్యాక్సిన్‌ తయారుచేసేవారు. ఇప్పుడు సింథటిక్‌ వ్యాక్సిన్‌ చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్‌లను కోడిగుడ్లతో తయారుచేస్తారు.
 

ఇప్పుడు కూడా మశూచి వ్యాక్సిన్‌ చేస్తున్నారా ?
       డబ్ల్యుహెచ్‌ఒ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) 1980లో మశూచిని పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించింది. ఇది ఆధునిక వైద్యం సాధించిన గొప్ప విజయం. దీని వెనుక కొన్ని వేల మంది కృషి ఉంది. సైంటిస్టులు, డాక్టర్లు, ప్రజారోగ్య (పబ్లిక్‌ హెల్త్‌) వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బంది ఎంతో శ్రమించారు. ప్రపంచదేశాల ప్రభుత్వాలు, డబ్ల్యుహెచ్‌ఒ, యునిసెఫ్‌ సంయుక్తంగా పనిచేశాయి.
 

మిగిలిన జబ్బుల సంగతేంటి ?
       పిల్లలకు వచ్చే చాలా జబ్బులని చాలా వరకూ తగ్గించగలిగాం. పోలియో, ధనుర్వాతం, తడపర, న్యూమోకోకల్‌ న్యూమోనియా, డిప్తీరియా, పెర్టూసిస్‌ (ఊపింగ్‌ కాఫ్‌), తట్టు, హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లూయింజా, క్షయ వంటి వ్యాధుల వల్ల కొన్ని లక్షల మంది చనిపోయేవారు. వీటన్నింటినీ చాలా వరకూ నివారించగలిగాం. జాపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌, హెపటైటిస్‌, కలరా, టైఫాయిడ్‌, రోటా వైరస్‌ వల్ల పిల్లలకి వచ్చే విరోచనాల వ్యాధికి కూడా వ్యాక్సిన్స్‌ ఉన్నాయి. ఫ్లూ వల్ల ఏటా చలి దేశాలల్లో వేల మంది చనిపోతుంటారు. దీనికి కూడా వ్యాక్సిన్‌ ఉంది. 60 సంవత్సరాలు దాటిన వారందరికీ ఫ్లూ వ్యాక్సిన్‌ వేస్తున్నారు.
 

          మశూచిని నిర్మూలించగలిగినపుడు మిగిలిన వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులను ఎందుకు నిర్మూలించలేము ?
    మశూచి వైరస్‌ మానవ శరీరంలోనే ఉంటుంది. మిగిలిన జంతువుల్లో ఉండదు. అందువల్ల దాన్ని పూర్తిగా నిర్మూలించగలిగాం. మిగిలిన వైరస్‌లు రకరకాల జంతువుల్లో నివశిస్తాయి. ఆ జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తాయి. అడవులను మానవులు ఆక్రమించడం వల్ల జంతువులతో సంబంధం ఏర్పడుతుంది. అలాగే పెంపుడు జంతువులు, పక్షుల వల్ల వైరస్‌లు మనుషులకు సంక్రమించవచ్చు. కుక్కల నుంచి రాబిస్‌ సంక్రమించిన వారు వందశాతం చనిపోతారు. దానికి కూడా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. కుక్కలకు కూడా వ్యాక్సినేషన్‌ చేయించాలి. ఊర కుక్కలను మున్సిపల్‌ అధికారులకు అప్పగించాలి. వాటికి వ్యాసెక్టమీ చేస్తారు.
 

                    కరోనాకి వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాట్లోకి రావచ్చు ? ఇంత సమయం ఎందుకు పట్టింది ?

వ్యాక్సిన్‌.. ఎప్పుడు ? ఎక్కడీ ఎలా ?


       మామూలు పరిస్థితుల్లో ఒక జబ్బుకి వ్యాక్సిన్‌ తయారుచేయడానికి పదేళ్లు పడుతుంది. కోవిడ్‌-19ను కనుగొని, దాని జెనిటిక్‌ సీక్వెన్సింగ్‌ 2020 జనవరిలోనే చైనీస్‌ శాస్త్రవేత్తలు చేశారు. మిగిలిన ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలకు వాళ్ల పరిశోధనా ఫలితాలను అందించారు. పది నెలల్లో వ్యాక్సిన్‌ తయారుచేసి, ఔషధ ప్రయోగం చేయడం ఒక అద్భుతమైన ముందడుగు. ప్రపంచ దేశాలు, డబ్య్లుహెచ్‌ఒ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. వ్యాక్సిన్‌కి ఫండ్స్‌ అందించే ప్రపంచ దేశాల సంస్థ (+AV×) కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా అవసరమైన నిధులు సమకూర్చాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఆస్ట్రాజనికా కంపెనీతో కలిసి 'కోవిషీల్డ్‌' వ్యాక్సిన్‌ తయారుచేసింది. దానికోసం 270 మంది శాస్త్రవేత్తలు, కొన్ని వందల మంది సిబ్బంది రేయింబవళ్లూ శ్రమించి, వ్యాక్సిన్‌ను తయారుచేశారు. ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌, ఇండియాలో 40 వేల మందితో ఔషధ ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో చేస్తున్నారు. ఫైజర్‌ కంపెనీ జర్మనీ కంపెనీతో కలిసి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారుచేసింది. ఈ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను 90 ఏళ్ల మార్గరెట్‌ అనే మహిళకు ఈ నెల ఎనిమిదో తేదీన ఇంగ్లాండులో ఇచ్చారు. అయితే, చైనా, రష్యాలో (స్పుత్నిక్‌) వ్యాక్సిన్‌ తయారుచేసి ఇస్తున్నారు. మిగిలిన దేశాల్లో డబ్ల్యుహెచ్‌ఒ, ఎఫ్‌డిసి అనుమతి ఇచ్చిన తర్వాత మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ముందు వైద్య రంగంలో పనిచేసే వారికి, వృధ్ధాశ్రమంలో ఉన్నవారికి ఇస్తారు. సాధారణ ప్రజలకు ఏప్రిల్‌ 2021 నుంచి ఇవ్వవచ్చు. ప్రపంచ ప్రజలందరికీ ఇవ్వడానికి మూడు నాలుగేళ్లు పట్టవచ్చు. అందుకని ఈలోపు ఇప్పుడు తీసుకుంటున్న (మాస్క్‌లు, చేతుల పరిశుభ్రత) జాగ్రత్తలు కొనసాగించాలి.

వ్యాక్సిన్‌.. ఎప్పుడు ? ఎక్కడీ ఎలా ?


 

ఎన్ని రకాల వ్యాక్సిన్స్‌ రావచ్చు ?
దాదాపు 50 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయి.
 

మనదేశ పరిస్థితి ఏమిటి ?
      డబ్ల్యుహెచ్‌ఒ ప్రపంచంలో వాడే వ్యాక్సిన్స్‌ అన్నింటిలో 70 శాతం మనదేశంలోనే తయారవుతున్నాయి. పుణేలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), ఆస్ట్రా జెనికాతో ఒప్పందం కుదుర్చుకుని, ఇప్పటికే రెండు కోట్ల డోస్‌లు తయారుచేసింది. అలాగే హైదరాబాదులోని భారత్‌ బయోటెక్‌, బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీ తదితర కంపెనీలు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారుచేస్తున్నాయి. మన ప్రభుత్వం ఎస్‌ఐఐ వ్యాక్సిన్‌ ఒక్కోడోస్‌ రూ. 250 చొప్పున కొంటోంది. ఎస్‌ఐఐ మార్కెట్లో మాత్రం ఒక్కో డోస్‌ను రూ.500 చొప్పున అమ్ముతానని ప్రకటించింది.
 

అందరికీ ఉచితంగా ఇస్తారా ?

కేంద్ర ప్రభుత్వం బీహారు ఎన్నికల్లో ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఇంకా ప్రకటించలేదు.


మిగిలిన వ్యాక్సిన్స్‌ ఖరీదు ఎంత ఉండవచ్చు ?
       మహమ్మారి సమసిపోయే వరకూ ఆస్ట్రాజెనికా ఒక్కో డోస్‌ మూడు డాలర్లకు ప్రపంచంలో ఎవరికైనా అమ్ముతానని ప్రకటించింది. తర్వాత ధర పెంచుతానంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ 70 డాలర్లు, మోడెర్నా 40 డాలర్లు అని అనుకుంటున్నారు.
 

మరో మహమ్మారి రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
          మనం ఈ భూమి మీద అతిథులుగా ఉన్నామని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచం సూక్ష్మక్రిములు, చెట్లదే. నీటిలో ఉండే  సైనో బ్యాక్టీరియా, సముద్రంలో ఉండే ఆల్గే, నేలపై ఉండే చెట్లు ఆక్సిజన్‌ను తయారుచేసి, వాతావరణంలోకి విడుదల చేస్తాయి. అవి లేకపోతే ఆక్సిజన్‌ ఉండదు. ఆక్సిజన్‌ లేకపోతే జంతువులు, మానవులు జీవించలేరు. జననం నుండి మరణం వరకు మానవుడు సూక్ష్మక్రిములతో పోరాటం చేస్తూ ఉండాల్సిందే. శరీరంపైన, లోపల ఉన్న సూక్ష్మక్రిములతో మనం సహజీవనం చేస్తున్నాము. మన చుట్టూ ఉన్న పరిసరాలలో, మట్టిలో కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. శరీర, పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే ఆ సూక్ష్మక్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మన పూర్వీకులు కొన్ని వందల, వేల సంవత్సరాల నుండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, సూక్ష్మక్రిముల నుండి కాపాడుకోగలిగారు. ఆ రోజుల్లో యాంటిబయోటిక్స్‌, శానిటైజర్స్‌ లేవు కదా! స్వాతంత్య్రం నాటికి మన జీవన కాలం 35 ఏళ్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 70 ఏళ్లకు పెరిగింది. దీనికి ముఖ్యకారణం అంటు వ్యాధులను వ్యాక్సిన్స్‌, పరిశుభ్రత, క్లోరినేటెడ్‌ వాటర్‌తో నివారించగలగడమే.
        ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఆయుధాలకు తగలేసే డబ్బును వైద్య పరిశోధనలకు, ప్రజలందరికీ సరైన ఆహారం, వైద్యం, మంచి గాలి, పరిశుభ్రమైన నీరు, పరిసరాల పారిశుధ్యం కోసం ఖర్చు చేయాలి. అట్లాగే మనం కూడా ఇల్లు, శరీర శుభ్రత కోసం నిరంతరం శ్రద్ధ చూపాలి. జనాభాలో ఒక్క శాతంగా ఉన్న బిలియనీర్ల మీద ఒక్క శాతం వార్షిక పన్ను వేసినా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. అవి పై ఖర్చులకు సరిపోతాయి. ప్రజల ఆరోగ్య సంరక్షణ, అవసర మైన ఆహార పదార్థాల ప్రజాపంపిణీ, మంచి విద్యను ప్రభుత్వమే అందించాలి. సమసమాజం రానంతకాలం మహమ్మారులు వస్తూనే ఉంటాయి. వచ్చినా ఎదుర్కోవడం ఆ సమాజంలోనే సాధ్యమవుతుంది.
                                                                                                          సంభాషణ : ఎం. రాజారావు

వ్యాక్సిన్‌.. ఎప్పుడు ? ఎక్కడీ ఎలా ?



ప్లేగు ఎలా వస్తుంది ?

వ్యాక్సిన్‌.. ఎప్పుడు ? ఎక్కడీ ఎలా ?


      ప్లేగు 'ఎర్సీనియా' అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దానికి ఎలుక స్థావరం. ఎలుక రక్తం పీల్చే ఈగల వల్ల మనుషులకు ఇది సోకుతుంది. జ్వరం, ఒళ్లునొప్పులు, శరీరం మీద చీముగడ్డలు వచ్చి, వారం రోజుల్లో రోగి చనిపోతాడు. అప్పటి ప్రజలకు, వైద్యులకు వ్యాధులకు గల కారణం అసలు తెలియదు. మత ప్రచారకులు ప్రజల పాపాలకు దేవుడు వేసే శిక్ష అనుకునేవారు. దైవ ప్రార్థన తప్ప వేరేగతి లేదని అనుకునేవారు. కొన్ని ఊళ్లల్లో యూదు జాతివారు మంచినీటి బావులలో విషం కలుపుతున్నారని ప్రచారం చేసి, వారిని చంపేశారు.

 

డాక్టర్‌ ఎస్‌.సుధాకర్‌,

Doctor S.Sudhakar
గౌరవాధ్యక్షులు
ప్రజారోగ్యవేదిక, ఆంధ్రప్రదేశ్‌