
- ''ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు సమంగా వ్యాక్సిన్లను అందించినపుడే వైరస్‌ల కొత్త వేరియంట్లకు అడ్డుకట్ట వేయగలం. తమ వ్యాక్సిన్ అవసరాలు తీరిపోయాయి కాబట్టి తమ దగ్గరున్న వ్యాక్సిన్ మేటలు నిరుపయోగమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పేద దేశాలకు, అవసరమైన వారికి వ్యాక్సిన్లను అందజేయాల''ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు చేసిన విజ్ఞప్తులను ధనిక దేశాలు ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
''కోవిడ్ అనేది ఒక పెద్ద మార్కెట్. ఇది భూగ్రహమంత పెద్దది. మొదటిగా ప్రతి మనిషీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలి. కాదు..కాదు! నీవు బూస్టర్‌గా మూడవ డోసు తీసుకుంటేనే సంపూర్ణ రక్షణ లభిస్తుంది. వచ్చే ఏడు ఇంకో స్పెషల్ డోసు అవసరపడవచ్చు! ఆశ్చర్యపోవడం అమాయక ప్రజల వంతు!! 800 కోట్ల ప్రజానీకమనే అతి పెద్ద మార్కెట్ మా వంతు!!'' నాలెడ్జ్ ఎకాలజీ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థకు డైరెక్టరుగా ఉన్న జేమ్స్‌కోవ్ 'మదర్‌బోర్డ్' అనే సంస్థతో మాట్లాడుతూ అన్న మాటలివి.
ఒక పక్క ధనిక, పెట్టుబడిదారీ దేశాలు తమ ప్రజలకు 3వ డోసు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తూ 2021 డిసెంబరు 31 నాటికే 76 శాతం ప్రజానీకానికి పూర్తి డోసులను అందించగలిగాయి. అదే సమయానికి పేద దేశాల్లో కేవలం 8.1 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్లు అందుకొన్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. డిసెంబరు 2021 నాటికి కనీసం 40 శాతం ప్రజానీకానికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందించాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) లక్ష్యానికి సుదూరంగా 92 దేశాలున్నాయి. ధనిక దేశాలు తమ అవసరానికి మించి వ్యాక్సిన్లను గుట్టలు గుట్టలుగా పోగేసుకోకుండా ఉన్నట్లయితే సెప్టెంబరు 2021 నాటికే 40 శాతం ప్రపంచ ప్రజానీకానికి కోవిడ్ వ్యాక్సిన్లను అందించగలిగే వారమని డబ్ల్యు.హెచ్.ఒ డైరెక్టర్ జనరల్ డా|| టెడ్రోస్ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లపై మేథోసంపత్తి హక్కులను ఇతరులకు పంచకుండా తమ దగ్గరే ఉంచుకొన్న ధనిక దేశాలు వ్యాక్సిన్‌ను సమయానికి వినియోగించుకోలేకపోయాయి. ఇంకో 'వేవ్' వస్తుందనే భయమూ, తమ దగ్గర డబ్బున్నదనే అహంకారంతో అవసరం లేకపోయినా ప్రభుత్వ నిధులను ప్రైవేటుకు దోచిపెట్టడం ద్వారా ఈ వ్యాక్సిన్ గుట్టలు ఆయా దేశాల్లో లెక్కకు మించి పేరుకుపోయాయి. నిరుపయోగంగా పడి ఉన్న లక్షలాది డోసుల వ్యాక్సిన్ల కాలపరిమితి (ఎక్పైరీ డేట్) దగ్గరపడుతున్న సమయాన పేద దేశాలకు దానం చేయడం జరిగిందని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ వ్యాక్సిన్ సరఫరా విభాగాధిపతి ఎట్లెవా కడెల్లి యూరోపియన్ పార్లమెంటుకు తెలియచేశారు. పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించే బాధ్యతను తీసుకొన్ని 'కోవాక్స్' అనే సంస్థ ఎక్సైపైరీ డేట్ దగ్గర పడుతున్న సుమారు 10 కోట్ల డోసులను తిరస్కరించిందని కూడా తెలుస్తోంది. ఇలా గొప్పగా వితరణ చేసిన మరిన్ని కాలం చెల్లిన 1 కోటి 50 లక్షల డోసులను నిర్వీర్యం చేయగా మరిన్ని కోట్ల డోసులు నిరుపయోగం కాగా చాలా దేశాలు వాటిని తిరస్కరించాయి. ''ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు సమంగా వ్యాక్సిన్లను అందించినపుడే వైరస్‌ల కొత్త వేరియంట్లకు అడ్డుకట్ట వేయగలం. తమ వ్యాక్సిన్ అవసరాలు తీరిపోయాయి కాబట్టి తమ దగ్గరున్న వ్యాక్సిన్ మేటలు నిరుపయోగమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పేద దేశాలకు, అవసరమైన వారికి వ్యాక్సిన్లను అందజేయాల''ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు చేసిన విజ్ఞప్తులను ధనిక దేశాలు ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. తమ పేదరికం కారణంగా వ్యాక్సిన్లను నిల్వ చేసే సౌకర్యాలను సమకూర్చుకోలేకపోవడం, వైద్య, ఆరోగ్య సదుపాయాల మౌళిక వసతుల లేమి, వ్యాక్సిన్లను అత్యంత త్వరగా తమ ప్రజానీకానికి అందించగలిగే శిక్షితులైన మానవ వనరుల కొరత పేద దేశాలను పట్టి పీడిస్తున్నాయనీ వారికి ఇతోధికంగా సాయం చేయాలని పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది.
కోవిడ్ వ్యాక్సిన్లపై ఉన్న మేధో సంపత్తి హక్కులను సవరించడం ద్వారా అందరికీ సమంగా వ్యాక్సిన్లను పింపిణీ చేయగలిగే అవకాశాలను బిల్‌గేట్స్ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల సాధ్యపడకపోగా, కాలం చెల్లడానికి సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్లను పేద దేశాల మొహాన పడేసి తామే గొప్ప దానశీలురమని ఊదరగొడుతున్నారు.
ప్రపంచపు తొలి పేటెంట్లు లేని, ఓపెన్ సోర్స్ వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో అందరికీ అతి త్వరగా అందించాలనే ఉద్దేశ్యంతో 'కార్బివాక్స్' అనే వ్యాక్సిన్‌ను అమెరికన్ ప్రొఫెసర్లు డా|| పీటర్ హోటెజ్, మారియా ఎలినా బొటాజీ రూపొందించగా, నిధుల కొరత వలన వారు తమ వ్యాక్సిన్‌ను ఆశించినంతగా అందరికీ అందించలేకపోతున్నారు. వారు తమ పరిశోధన అభివృద్ధికి తగిన నిధులందించమని జి-7 దేశాలను పలుమార్లు అభ్యర్ధించినా కూడా ప్రోత్సాహకర ఫలితాలను పొందలేకపోయామనీ, తమ ప్రాజెక్టుకు సరయిన సమయంలో నిధులు లభించి ఉంటే ఎక్కువ శాతం ప్రపంచ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించగలిగేవారమని తద్వారా ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చేవే కావని కూడ వాపోయారు. ఒరిజినల్ కోవిడ్-19 వేరియంట్‌పై 90 శాతం, డెల్టాపై 80 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని క్లినికల్ ట్రయళ్లలో రుజువైన దరిమిలా భారత ప్రభుత్వం హైదరాబాద్‌కి చెందిన బయోలాజికల్-ఇ కంపెనీకి 30 కోట్ల డోసులు తయారీకి ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ 7 డాలర్లు కాగ కార్బివాక్స్‌ను బయోలాజికల్-ఇ కంపెనీ ఒక్క డాలరుకు మాత్రమే అందిస్తోంది. రికాంబినెంట్ ప్రొటీన్ సబ్ యూనిట్ టెక్నాలజీ మీద ఆధారపడి రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఎం.ఆర్.ఎన్.ఎ టెక్నాలజీ వంటి వాటికంటే సులువుగా తయారు చేసుకోవచ్చనీ, ఇన్ని ప్రయోజనాలున్న వ్యాక్సిన్‌ను పెట్టుబడిదారీ దేశాల లాభాపేక్ష కారణంగా సరైన సమయంలో అందించలేకపోయామనీ, ఇప్పటికైనా ఇటువంటి వ్యాక్సిన్లను ప్రోత్సహించాల్సిన అవసరముందని ప్రజారోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఎటువంటి పేటెంట్లూ లేని ఈ కార్బివాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సరైన సమయంలో తగిన సహకారం అందలేదు. ఇంకోపక్క లాభాపేక్షే పరమావధిగా కల్గిన పెద్ద పెద్ద మందుల కంపెనీలకు ధనిక దేశాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి వ్యాక్సిన్లను అభివృద్ధి చేయకముందే కోట్లాది డోసుల ముందస్తు ఆర్డర్లు ఇచ్చాయి. బైడెన్ ప్రభుత్వం ఆగస్టు 2021లో తన బూస్టర్ ప్రణాళికను ప్రకటించగానే మోడర్నా కంపెనీ అమ్మకాలు 2022లో అమాంతం 35 శాతం మేరకు పెరుగుతాయని అంచనా వేశారు. ప్రజలు కట్టిన పన్ను డబ్బుతో, ప్రభుత్వాలిచ్చిన నిధులతో పరిశోధనలు చేసి రూపొందించిన వ్యాక్సిన్ల కంపెనీలకు కోట్లాది డాలర్లు తెచ్చిపెడుతున్నాయి. కేవలం ఒక్క 2021వ సంవత్సరంలోనే టాప్ కంపెనీలయిన ఫైజర్-బయాన్‌టెక్ మరియు మోడర్నా కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ల అమ్మకాల ద్వారా నిమిషానికి 64,961 డాలర్లు, సెకనుకు 1088 డాలర్లు అంటే మొత్తంగా 34 బిలియన్ డాలర్ల లాభాలను పొందగా, మోడర్నా కంపెనీ పంపిణీ చేసిన మొత్తం వ్యాక్సిన్లలో కేవలం 0.2 శాతం అల్పాదాయ దేశాలకు చేరాయి. ఫైజర్-బయాన్‌టెక్ ఒక్క శాతం కన్నా తక్కువగా ఆయా దేశాలకు పంపిణీ చేసింది.
2021 సంవత్సరంలో జరిగిన అతి భయంకరమైన దుస్సంఘటన వ్యాక్సిన్ అసమానతే. కనీసం 2022లో అయినా పరిస్థితులు మెరుగుపడి కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచ ప్రజానీకం అంతటికీ వారి అవసరాలను బట్టి సమానంగా అందించాలి. అప్పుడే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎమర్జెన్సీ విభాగాధిపతి మైకేల్ రేయాన్ చేసిన అభ్యర్ధన సాకారమయ్యేనా? 'పెట్టుబడి' మానవ కల్యాణం కోసం తన లాభాపేక్షను వదులుకుంటుందా?
పి. దక్షిణామూర్తి
/ వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అధ్యక్షుడు /