Oct 01,2023 21:57

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ట


ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌ : కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏలూరు జిల్లా ఆరోగ్యపరంగా సంక్లిష్టంగా మారింది. ఒక పక్క గోదావరి పరివాహక ప్రాంతం, కొల్లేరు ఉండగా, ఎక్కువ భాగం మెట్ట, అటవీ గిరిజన ప్రాంతాలున్నాయి. దీంతో వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రధానంగా సీజనల్‌ వ్యాధులకు మూల ప్రాంతాలుండటం, సిబ్బంది సర్దుబాటులో ఇతర జిల్లాలకు తరలిపోవడంతో వ్యాధులను అదుపు చేయడం కొంత కష్టంగా మారుతోంది. రెండు నెలలుగా వైరల్‌ జ్వరాలతోపాటు, సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ట ఇటీవల బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో వైదుల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్టు ఆమె 'ప్రజాశక్తి' ముఖాముఖిలో తెలిపారు.
ప్రశ్న : జిల్లాలో పెరుగుతున్న వ్యాధుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆగస్టులో ఇంటింటా సర్వే చేయించాం. మలేరియా, టైఫాయిడ్‌ అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిధులు వెచ్చించి మందులు అందుబాటులో ఉంచాము. 50 చోట్ల ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకున్నాము.
ప్రశ్న : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు తీరు ఎలా ఉంది?
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 25 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. పెదపాడుమండలం కలపర్రులో ట్రయల్‌ రన్‌ నిర్వహించాం. అన్ని కార్యక్రమాల మాదిరిగా కాకుండా శిబిరాల్లో స్పెషలైజేషన్‌ వైద్యులు పరీక్షలు నిర్వహించి, మందులిస్తారు. ఆపరేషన్‌లు, అత్యవసర సేవలకు కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. చికిత్స అనంతరం క్షేత్రస్థాయి సిబ్బంది ఫాలోఅప్‌ చేస్తారు. ఇప్పటికే ఇంటింటి సర్వేలో షుగర్‌, బిపి, ఇతర వ్యాధులు గుర్తించాం. రోగి నమోదు నుంచి 104 ద్వారా రోగి వైద్యుని సంప్రదించాల్సిన రోజు, సమయం.. ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తారు. ఇలా ప్రతివ్యక్తికీ సమగ్ర వైద్యం అందిస్తున్నాం. శిబిరాల వద్దే ఇసిజి కూడా తీసి గుండె వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తున్నాం.
ప్రశ్న : ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఎంత వరకు సఫలీకృతమైంది.
ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తోంది. విలేజ్‌ క్లినిక్‌ సిబ్బంది, ప్రత్యేక వైద్య బృదం ఇంటింటికీ వెళ్లి వైద్యం అందిస్తున్నారు. దీన్ని మరింత పటిష్టవంతంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టాం.