Oct 18,2023 16:28

ప్రజాశక్తి - మండవల్లి
   గ్రామంలోని ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేవిధంగా గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామని కానుకొల్లు సర్పంచి నాగదాసి థామస్‌ తెలిపారు. గ్రామంలోని పల్లెకారుల బజారులో బుధవారం డ్రయినేజీలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో డ్రయినేజీలను క్లీన్‌ చేయించి, బ్లీచింగ్‌తో పాటు దోమల మందులు కూడా పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే స్థానిక ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామంలో డ్రయినేజీ నిర్మించుకోవడంతోపాటు, సీసీ రోడ్లు కూడా నిర్మించుకోగలిగామని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రత్నకుమారి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.