Aug 09,2023 22:14

టీకా సర్టిఫికెట్‌ అందజేస్తున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి-కొమరాడ : తట్టు, రుబెల్లా తదితర వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడమే మిషన్‌ ఇంధ్ర ధనుష్‌ కార్యక్రమం లక్ష్యమని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు తెలిపారు. మండలంలో సోమినాయుడువలసలో మిషన్‌ ఇంధ్ర ధనుష్‌ టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. టీకా అర్హుల జాబితా వివరాలు, ఏ టీకాలు వేశారో పరిశీలించారు. ఈ వివరాలను వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా చేర్చిన యూవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. తద్వారా అవసరమైన సందర్భాల్లో టీకా పూర్తయిన వారికి సర్టిఫికెట్‌ను ఇచ్చే వీలుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ బుధవారం వైద్య సిబ్బంది టీకా వేసిన పిల్లలు, గర్భిణుల ఆన్‌లైన్‌ నమోదును పరిశీలించారు. తద్వారా జనరేట్‌ అయిన టీకా సర్టిఫికెట్‌ను అక్కడ టీకా కేంద్రంలో గర్భిణీకి అందజేసి, వాటి ఆవశ్యకతను తెలియజేశారు. పూర్తి స్థాయి టీకాలు వేసిన పిల్లలకు కూడా టీకా ధ్రువపత్రాన్ని అందజేయవచ్చన్నారు. సోమవారం ప్రారంభమైన మిషన్‌ ఇంధ్ర ధనుష్‌ కార్యక్రమాన్ని ఈ శనివారం వరకు కొనసాగించాలన్నారు. గతంలో ఏ కారణం వల్లనైనా టీకా వేయబడని పిల్లలకు ఈ కార్యక్రమంలో టీకా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ జయగౌడ్‌, ఎఎన్‌ఎం స్వాతిముత్యం, సిహెచ్‌ఒ జయంతి, అంగన్వాడీ సిబ్బంది లత, ఆశా కార్యకర్త ఉన్నారు.