
ప్రజాశక్తి - భీమవరం
ఐదేళ్లలోపు వారికి వ్యాధినిరోధక టీకాలు తప్పక వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయించడమే జాతీయ 'ఆరోగ్య మిషన్' ఇంద్రధనస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. గతనెల ఏడో తేదీ నుంచి 12 వరకూ మొదటి విడతలో భాగంగా రొటీన్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండో విడతగా ఈనెల 11 నుంచి 16 వరకూ, మూడో విడతగా వచ్చేనెల తొమ్మిదో తేదీ నుంచి 14 వరకూ టీకా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ డి.మహేశ్వరరావు, డిసిహెచ్‌ఎస్ డా.సూర్యనారాయణ, ఐసిడిఎస్ పీడీ బి.సుజాతారాణి, డిఐఒ డాక్టర్ దేవసుధ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.