Jun 16,2021 06:54

    పది, ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలు తప్పనిసరిగా జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది. పరీక్షల తేదీలను తరచూ మార్చుకుంటూ పోతోంది. పరీక్షల అంశం కోర్టుకు చేరడంతో పదో తరగతి పరీక్షలనూ వాయిదా వేసింది. వాటి నిర్వహణపై జూలైలో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానానికి తెలిపింది. దీనినిబట్టి జూలై వరకు పరీక్షలు జరిగే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు విద్యార్థులకు సమస్యగా మారింది. పరీక్షలకు చదవాలో.. లేక కొత్త తరగతులకు సిద్ధపడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
    పరిస్థితులన్నీ బాగుండి వుంటే నేటికి నూతన విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభమై వుండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నూతన విద్యాసంవత్సరం నేటికీ ప్రారంభం కాలేదు. జూన్‌ 30వ తేదీ వరకూ వేసవి సెలవులను పొడిగించిన ప్రభుత్వం జూలై 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలన్న ఆలోచనలో వుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కాలంలో రాష్ట్రంలో సుమారు 600 మంది వరకూ ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పాఠశాలకు హాజరు కావడం, పరిషత్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనడం, నాడు-నేడు ఫేజ్‌-1 విధుల నిర్వహణలో, సర్కారీ పథకాల అమలులో పాల్గొనడం వలన వీరంతా కోవిడ్‌ బారిన పడి చనిపోయారు. ఇక విద్యార్థులకు సైతం కరోనా సోకింది. పైగా థర్డ్‌ వేవ్‌ ముప్పు వారిని మరింత కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలను మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది.
   దేశంలో ఇప్పటికీ మెజారిటీ రాష్ట్రాలు పదవ తరగతి, +2 బోర్డు పరీక్షలు రద్దు చేశాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారు. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. సకాలంలో నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు కూడా పరీక్షలు వాయిదా వేస్తూ పోతే 2021-22 విద్యా సంవత్సరం కూడా ఆలస్యం అవుతుంది. క్లాసులు మొదలై, సిలబస్‌ సగంలో వుండగానే పరీక్షలు ముందుకొస్తాయి. ఒకవైపు పరీక్షల ఒత్తిడి. మరోవైపు పూర్తికాని సిలబస్‌. టెన్త్‌ విద్యార్థులు రెండు విధాలా నలిగిపోతారు.
    ఇక ఇంటర్‌ పరీక్షలను మన రాష్ట్రంలో వాయిదాలు వేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో సిబిఎస్‌ఇ ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీంతో సిబిఎస్‌ఇ విద్యార్థులు ప్రస్తుతం జెఇఇ, నీట్‌పై తమ దృష్టినంతా పూర్తిగా కేంద్రీకరించి సిద్ధం అవుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలపై ఇంకా స్పష్టతే రాలేదు.
   పరీక్షలు నిర్వహించేట్లయితే కనీసం 20 రోజులు ముందుగానే టైమ్‌ టేబుల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పదవ తరగతి పరీక్షలు, ఇంటర్‌ మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తంగా 30 రోజులు అవసరమవుతాయి. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు పరీక్షల షెడ్యూల్‌ ఇచ్చినా జూలై నెల చివరలో ప్రారంభమై, ఆగష్టు మొదటివారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. పరీక్షల అనంతరం జవాబు పత్రాల వాల్యుయేషన్‌, టాబ్యులేషన్‌ను ఆగమేఘాల మీద చేసినా...ఫలితాలు ప్రకటించడానికి కనీసం నెల రోజులు పైగానే సమయం తీసుకొంటుంది. అంటే సెప్టెంబర్‌ నెలలో విద్యార్థుల ఫలితాలు వచ్చే పరిస్థితి. ఈలోపు ఇంటర్‌ విద్యార్థులు జెఇఇ మెయిన్స్‌, నీట్‌ పరీక్షల ప్రిపరేషన్‌లో ఉండాల్సి వస్తుంది. జాతీయ స్థాయి పరీక్షల పోటీలో మన విద్యార్థులు వెనకబడిపోతారు.
    ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు అప్పుడే 2021-22 విద్యా సంవత్సరానికి జూనియర్‌ ఇంటర్‌ అడ్మిషన్లు కూడా ప్రారంభించాయి. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి.
 

                                               గత సంవత్సరం లానే పరీక్షలు రద్దు చేయాలి

    పదో తరగతి పరీక్షలు నిర్వహించకుంటే ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్లకు ఇబ్బంది అవుతుందనేది ప్రభుత్వం వాదన. కానీ గత ఏడాది కూడా కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసినప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. ఏటా మాదిరిగానే ఆర్‌జియుకెటి ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు చేపట్టింది. అలాగే,
   ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండా ఎంసెట్‌ అడ్మిషన్లు నిర్వహించలేమన్న వాదన లోనూ అర్థం లేదని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంటర్‌ మార్కులకు వెయిటేజి రద్దు చేసి ఎంసెట్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా అడ్మి షన్లు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈసారికి ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. పోనీ ఈ పరీక్షల వల్లనే ఉద్యోగులు వస్తాయా అంటే అదీ లేదు. సింహభాగం ఉద్యోగాలకు ప్రత్యే కంగా నిర్వహించుకునే పోటీ పరీక్షలలో సాధించే మెరిట్టే ప్రాతిపదిక.
    కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేసింది. పదో తరగతి విద్యార్థులకు నవంబర్‌ నుంచి, ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి తరగతుల నిర్వహించింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఏప్రిల్‌ 19 నుంచి వేసవి సెలవులు ప్రకటించగా, హైస్కూల్‌ స్థాయి విద్యార్థులకు ఏప్రిల్‌ 30 వరకూ తరగతులు నిర్వహించారు. సిలబస్‌ను కూడా తగ్గించి పాఠ్యాంశాల బోధనకు అవకాశం కల్పించారు. ఇంటర్‌ వారికి మాత్రం కొంతకాలం క్లాసులు జరిపి, కరోనా కేసులు పెరగడంతో విద్యా సంస్థలను పూర్తిగా మూసేసింది. పది, ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలు తప్పనిసరిగా జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది. పరీక్షల తేదీలను తరచూ మార్చుకుంటూ పోతోంది. పరీక్షల అంశం కోర్టుకు చేరడంతో పదో తరగతి పరీక్షలనూ వాయిదా వేసింది. వాటి నిర్వహణపై జూలైలో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానా నికి తెలిపింది. దీనినిబట్టి జూలై వరకు పరీక్షలు జరిగే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు విద్యార్థు లకు సమస్యగా మారింది. పరీక్షలకు చదవాలో.. లేక కొత్త తరగతులకు సిద్ధపడాలో.. తెలియక అయోమయానికి గురవు తున్నారు. ఫలితంగా జాతీయస్థాయి పోటీలో మనవాళ్లు వెనుకబడిపోతా రని తల్లిదండ్రులు, విద్యా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
 

                                                         విద్యార్థులలో తీవ్ర ఒత్తిడి

    గతంలో కాలేజీ, క్లాసులు, స్టడీ అవర్‌, ట్యూషన్లు...అంటూ రోజంతా తీరికలేకుండా ఉండే విద్యార్థులు ఇప్పుడు ఇళ్లకే పరి మితం అయ్యారు. తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఉంటున్న ప్పటికీ ఆటపాటలు, స్నేహితులతో సరదా కబుర్లు కరువై మానసిక ఉల్లాసాన్ని కోల్పోతున్నారు. కాసేపు స్మార్ట్‌ ఫోన్లు, టీవీ, కంప్యూటర్‌తో కాలక్షేపం చేద్దామనుకుంటే.. 'పరీక్షలు ఉన్నాయి..చదువుకో!' అంటూ తల్లిదండ్రులు గదమా యిస్తున్నారు. అయితే ఎప్పుడు జరుగుతాయో తెలియని పరీక్ష లకు ఎన్నాళ్లు చదవాలి?, చదివిన సిలబస్‌నే మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు చదువుతూ ఉండాలి! అంటూ పిల్లలు విసుక్కుంటు న్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.
     ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవిక దృష్టితో ఆలోచించి... గత సంవత్సరం లానే రాష్ట్రంలో 10వ తరగతి, ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలను రద్దు చేయాలి. 10వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంత్సరంలో సమ్మెటివ్‌ పరీక్షలు-1 ను నిర్వహించారు వాటిని ఆధారంగా చేసుకొని విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడం ద్వారా విద్యార్థులందరినీ పాస్‌ అయినట్లుగా ప్రకటించాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఒత్తిడికి గురిచేయకుండా మంచి నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యా నిపుణులు కోరుతున్నారు.


/ వ్యాసకర్త ఎ.పి.యు.టి.ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి
సెల్‌ : 94907 62412 /
ఎస్‌.పి. మనోహర్‌ కుమార్‌

ఎస్‌.పి. మనోహర్‌ కుమార్‌