'మనం మనుషులం.. బంధాలు, బాధ్యతలు, బలహీనతలనే బలమైన తాళ్లతో ముడివేయబడిన సామాన్య జీవులం! అన్నీ సమకూరినపుడు మిడిసిపడుతూ, ఏమీ లేనప్పుడు మనల్ని మనం నిందిస్తూ జీవితాన్ని గడిపే అల్పసంతోషులం.
మన స్వార్థం కంటే పదిమంది సుఖం కోరడం గొప్పది. కుటుంబం మీద ప్రేమ కంటే దేశం మీద మమకారం గొప్పది. ఆశ అనే ఒక్కో మెట్టూ దాటుకుంటూ విశాలవిశ్వం వైపు మన ఆలోచనలు ప్రసరించాలి. నీకూ నాకూ మధ్య దూరం.. కొన్ని వేల మైళ్లే కావచ్చు. కానీ నిన్నూ నన్నూ ముడివేసిన ప్రేమపాశం బలమైనది! కొత్త ఆశలతో, కోరికలతో భార్యగా నా జీవితంలో అడుగుపెట్టిన నిన్ను ఒంటరితనమనే మహారణ్యంలో వదిలేసి రావడం అన్యాయంగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. దేశం కోసం చీకటి తెరలను చీల్చుకుంటూ నేను కాపలా కాస్తుంటే.. నా కోసం అనంత దుఃఖాన్ని మనసులో నింపుకుని, ఆశగా నువ్వు ఎదురుచూస్తూ ఉండొచ్చు. అయినా.. మన ఎడబాటు గుండె నిబ్బరాన్ని పెంచాలి. ఒంటరితనం మనోధైర్యాన్ని కలిగించాలి. మనకోసం మనమనే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. దేశమంతా ఒకటనే భావన గుండెల్లో నింపుకోవాలి. త్వరలోనే కలుస్తా.. నీ ఒడిలో తలవాల్చుకుని నా గుండె భారాన్ని దించుకుంటా..!' కవితాత్మకంగా వున్న ఉత్తరాన్ని చదువుకుని, దీర్ఘంగా నిట్టూర్చింది వసుంధర.
'ఫోనులో ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఉత్తరాల్లో అయితే మనసంతా కుమ్మరించెయ్యొచ్చు!' అన్న భర్త మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది. 'ఎవరన్నారోగానీ నిజంగా ఉత్తరాలు దూరాలను కలిపే దారాలే. ఎప్పటికప్పుడు తనలో కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి!' అనుకుంటూ.. అందుకే గుండెభారాన్ని గుప్పెడు అక్షరాలుగా మోసుకొచ్చిన ఉత్తరాల వైపు అపురూపంగా చూసింది వసుంధర.
తన పెళ్ళికి ముందు జరిగిన విషయం గుర్తొచ్చింది వసుంధరకు. 'చూడమ్మా.. అబ్బాయి నీకు సరిజోడు. చూడ్డానికి చక్కగా ఉంటాడు. నీకు తప్పకుండా నచ్చుతాడు. కాకపోతే సైన్యంలో పనిచేస్తున్నాడు. వచ్చేనెలలో పెళ్లి చేసుకుంటాడు. కొన్నిరోజులుండి వెళ్ళిపోతాడు. కట్నకానుకలు వద్దన్నారు. కాలికి బలపం కట్టుకుని తిరిగినా అటువంటి సంబంధం ఈ పేదతండ్రి చూడలేడు. ఆపైన నీ ఇష్టం..!' తండ్రి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది వసుంధర. 'కట్నాలూ కానుకలూ వద్దన్నారని బంగారంలాంటి పిల్లని అర్ధాయుష్షు వాడికిచ్చి దాని గొంతు కోస్తారా? ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నాం. కాలం కలిసిరాక దాని నుదుటిబొట్టు రాలిపోతే దాన్ని ఎదురుగా పెట్టుకుని, ఈ జీవితాన్ని ఎలా గడపగలమో ఆలోచించారా?' మనసులోని మాట కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది వసుంధర తల్లి.
'నేను పొలం పనులు చేసుకునేవాడినని తెలిసే మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్ళిచేశాడు కదా! పొలం గట్టున నడిచేటప్పుడు ఏ పామో కరిస్తే, నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ కరెంటు వైరో తగిలి చనిపోతే ఎవర్ని నిందిస్తాం? రైతుగా నేను నా కుటుంబం కోసం కష్ట పడుతున్నా. సైనికుడిగా అబ్బాయి దేశం కోసం కష్టపడుతున్నాడు. నా దృష్టిలో ఇద్దరికీ పెద్ద తేడా లేదు..!' అన్నాడు.
ఈ సంబంధం వసుంధర తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా తండ్రీ కూతుళ్లు ఇష్టపడి మరీ సంబంధాన్ని కలుపుకున్నారు.
***
మొదటిరాత్రి పాలగ్లాసుతో వచ్చిన వసుంధరను మంచంపై కూర్చోబెట్టి, నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు అభినవ్. కొంత సమయం తర్వాత 'నువ్వు నన్ను నిజంగా ఇష్టపడే పెళ్ళి చేసుకున్నావా?' అన్నాడు.
'అంటే..?!' అర్థంకానట్లు అడిగింది.
'నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ''పెద్దయ్యాక నువ్వేమవుతావు?'' అనడిగితే తడుముకోకుండా ''నేను సైనికుణ్ణవుతా!'' అని చెప్పాను. పిల్లలంతా అదోలా చూశారు. టీచరు మాత్రం ''మంచి నిర్ణయం తీసుకున్నావు. నిర్ణయాలు తీసుకోవడం వేరు... నిలబడడం వేరు! ఎన్ని ఇబ్బందులొచ్చినా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడినపుడే మనిషి జన్మకు సార్ధకత..'' అన్నారు భుజం తడుతూ. పెద్దయ్యాక నేను కోరుకున్నట్లే సైనికుడ్ని అయ్యా. ఈ మధ్య ఎన్ని సంబంధాలు చూసినా సైన్యంలో చేస్తున్నానని ఎవరూ పిల్లనిచ్చే ధైర్యం చేయలేదు. అనుకోకుండా కుదిరిన సంబంధమిది. అందుకే అడుగుతున్నాను..!' అన్నాడు.
'దేశానికి అన్నదాత రైతే అయినా, ఆయనకీ ప్రాణదాత సైనికుడంటూ నా తండ్రి మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు. దేశానికి నిజమైన ఖ్యాతీ, కీర్తీ మీరేనంటూ పొగిడాడు. నా తండ్రి మామూలు రైతు. ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ కష్టపడడం తప్ప ఆయనకు మాయా మర్మం తెలియదు. కానీ మీ విషయంలో చాలా ఉన్నతంగా ఆలోచించాడు. బహుశా.. భరతమాతకి అన్నదాత, ప్రాణదాతలు ఇద్దరూ రెండుకళ్లని ఆయన భావన కావచ్చు. అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను!' అనగానే..
'ఒక సైనికుడు తన జీవితాన్ని పణంగా పెట్టి, సరిహద్దుల్లో కాపలా కాస్తాడు. అతని జీవితం మీద ఆధారపడి దేశమంతా నిశ్చింతగా ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపే మాకు అమ్మ, అక్క, అన్న, చెల్లి అనే బంధాలు. ఒక్కసారి గడపదాటి బయటకు అడుగుపెడితే దేశమంతా నా కుటుంబం అవుతుంది. అందరూ నాకు బంధువులవుతారు. భారతీయుణ్ణి అనే భావం తప్ప.. కులం, మతం, జాతి ఏవీ మా మనసుల్లో ఉండవు' అన్నాడు అభినవ్. కాసేపటి తర్వాత మళ్ళీ తనే 'నేను సైన్యంలో చేరతానంటే మా అమ్మానాన్న చాలా బాధపడ్డారు. విడిగా ఉన్నప్పుడు అందరూ దేశభక్తులే! దేశం గురించీ దాని గొప్పదనాన్ని గురించీ గంటలసేపు మాట్లాడతారు. కానీ దేశం కోసం పనిచేస్తానంటే మాత్రం వ్యతిరేకిస్తారు. నా మాటలు విన్న నా స్నేహితులూ ''వీడు గొప్ప దేశభక్తుడురా!'' అంటూ ఆటపట్టించారు. అయినా అవేమీ నేను పట్టించుకోలేదు. పుట్టిన గడ్డ కోసం ప్రాణం పోయినా ఫర్వాలేదనే ఆలోచన నన్ను ఆ దిశగా అడుగులు వేయించింది. ఒకర్ని తప్పుపట్టడం కాదుగానీ.. మరిగే రక్తంతో భారతమాతకి తిలకం దిద్దకుండా, జవసత్వాలు ఉడిగిపోయాక దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడం నామట్టుకు నాకు నచ్చదు..' అని చెప్పాడు అభినవ్.
అనవసరమైన వాటికోసం వెంపర్లాడే అందరి యువకుల్లా కాకుండా తనకున్న శక్తిని, యుక్తిని దేశ సంక్షేమం కోసం వాడాలని తపనపడుతున్న అభినవ్ ఆ క్షణంలో వసుంధరకు నిజమైన వీరుడిలా అనిపించాడు. వెంటనే వసుంధర 'భార్యగా మీ మనసెరిగి ప్రవర్తిస్తాను. దగ్గరున్నా దూరంగా ఉన్నా మన ఆత్మలెప్పుడూ కలిసే ఉంటాయి!' అంది. ఆనాటి నుండి ఏడు రాత్రులు మధుర వ్యాపకాలతో గడిచిపోయాయి. ఎనిమిదోరోజు 'దేశం మీద యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి... తొందరగా రావలసింది!' అని వచ్చిన టెలిగ్రాం అందుకుని వెళ్ళిపోయాడు అభినవ్. ఎదురుచూపులతో ఎనిమిది నెలలు గడిచిపోయాయి.
***
నేడో రేపో బయటకు వచ్చే పొట్టలోని బుజ్జాయిని తడుముకుంటూ భర్త రాసిన ఉత్తరాన్ని చూస్తూ జ్ఞాపకాల్ని నెమరేసుకోసాగింది వసుంధర. క్షణమొక యుగంలా ఎనిమిది నెలలు గడిచిపోయాయి. ధైర్యానికీ దైన్యానికీ మధ్య చిగురుటాకులా వణికిపోయింది వసుంధర. యుద్ధఛాయలు కనబడుతున్నాయని సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఆ వార్త టీవీలో చూసినప్పటి నుండీ వసుంధరలో ఆందోళన ఎక్కువైంది. భర్తకు ఏమవుతుందోననే ఆదుర్దా ఆమెను కుదురుగా ఒకచోట నిలబడనీయకపోవడం చేత గదిలో అటూ ఇటూ నడవసాగింది. ఆ రోజు సాయంత్రం నుంచి ఆకాశంలో అగ్నిపర్వతాలు పేలినట్లు ఎడతెగని ఉరుముల చప్పుడు. ఏ సమయం ఎలా ఉంటుందోనని ప్రసవానికి అన్ని ఏర్పాట్లూ చేసి ఉంచాడు వసుంధర తండ్రి. అర్ధరాత్రి దాటిన తర్వాత నొప్పులు మొదలయ్యాయి. తెలతెలవారుతుండగా 'కేర్'మన్న ఏడుపుతో ఇంటిల్లపాదీ ఆనందంలో మునిగితేలారు.
***
తెల్లవారింది.. రాత్రి కురిసిన వర్షానికి అతలాకుతలమైన సంసారాన్ని సరిచేసుకుంటున్నారు ఊరివాళ్ళు. వాకిట్లో కూర్చుని వీధివైపు చూస్తున్న వసుంధర తండ్రికి సైకిల్ మీద ఆయాసపడుతూ వస్తున్న పోస్ట్‌మ్యాన్ కనిపించాడు. 'టెలిగ్రాం' వచ్చిందని ఇచ్చి వెళ్ళిపోయాడు.
తండ్రి తెచ్చిచ్చిన టెలిగ్రాం చూసి కూప్పకూలిపోయింది వసుంధర. 'యుద్ధంలో అభినవ్ నేలకొరిగాడు!' అనే సందేశం చూసి కన్నీరుమున్నీరైంది.
'పుడుతూనే తండ్రిని మింగాడు!' అని పసిగుడ్డును తిట్టుకుంటున్న తల్లిదండ్రుల్ని చూసి ఆశ్చర్యపోయింది వసుంధర. కాసేపటి తర్వాత తల్లిదండ్రుల్ని వారిస్తూ 'అవును.. నా భర్త చెప్పింది నిజమే! కొందరు దేహం కోసం కష్టపడితే, మరికొందరు దేశం కోసం కష్టపడతారు! ఇద్దరూ మట్టిలోనే కలిసిపోతారు. కానీ దేశం కోసం కష్టపడ్డవాణ్ణే గౌరవిస్తారు! గుండెల్లో పెట్టుకుంటారు. దేశాన్ని ప్రేమించడమంటే దేశమిచ్చిన సౌకర్యాలను అనుభవించడమే కాదు.. అవసరమైతే దేశం కోసం మన ప్రాణంతో సహా అన్నింటినీ వదులుకోవాలనే సందేశాన్నిచ్చాడు నా భర్త. అందుకే దేహం కంటే దేశం గొప్పది. ప్రాణాలు కోల్పోయిన వీరుడికి నేను వీరపత్నిని. ఇప్పుడే పుట్టిన ఈ పసికందుకు నేను వీరమాతను. ఒక దేహం నేలకొరిగితే వందలాది దేహాలు దేశ సేవ కోసం పుట్టుకొస్తాయి. విభిన్న జాతులు, మతాలు కలగలిసిన దేశమనే ఈ వసుధైక కుటుంబానికి మరో వీరసైనికుణ్ణి బహుమతిగా అందిస్తాను..!' అంది స్పష్టంగా, నిర్భయంగా.
* జడా సుబ్బారావు (రంజని - రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథల పోటీ-2019లో నాల్గవ బహుమతి పొందిన కథ)