Apr 20,2023 19:55

ఉపాధి పని చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
వేసవిలో రోజూ 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. భగ్గుమనే ఎండల్లోనే ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్నారు. వారు వడదెబ్బతో విలవిల్లాడుతున్నారు. ఉపాధి పనులు చేసే ప్రాంతంలో కనీసం టెంట్లు, తాగడానికి నీటి వసతిని కూడా కల్పించడం లేదని కూలీలు మండిపడుతున్నారు. ఎండలోనూ కష్టపడి పని చేస్తున్నా కూలి డబ్బులు అందక కొన్ని చోట్ల ఆందోళనకు దిగుతున్నారు.
ప్రభుత్వం ప్రతేడాది ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం నెరవేర్చడం లేదు. ప్రతేడాది కూలీలకు వేసవిలో అందించే భత్యానికి ఈసారి మంగళం పాడారు. ఎర్రటి ఎండలో పని చేస్తున్న కూలీలు కొద్ది సేపైనా సేద తీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది. కానీ ఎక్కడా వాటిని ఏర్పాటు చేయలేదు. ఎండలో మాడిపోతున్నారు. దీనికి తోడు కనీసం తాగునీటి వసతిని కూడా కల్పించడం లేదు. తాగడానికి కనీసం నీరు లేకుండా ఎండల్లో పని చేయడం వల్ల ఎండదెబ్బకు గురై అనేకమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పని చేసే ప్రాంతంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స చేసేందుకు ప్రథమ చికిత్స కిట్లను ఈ మధ్యనే ప్రభుత్వం అందించింది. ఉపాధి కూలీలకు తాగునీటితో పాటు ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా అధికారులు ఇంతవరకు ఎక్కడా వీటిని అందించిన దాఖలాలు లేవు.
ఉపాధి వైపే మొగ్గు...
వేసవిలో చేసేందుకు పనులు లేకపోవడంతో రైతులు, ఇతర వర్గాల వారందరూ ప్రస్తుతం ఉపాధి హామీ పనులపై మొగ్గు చూపుతున్నారు. మరో పక్క ఉపాధి పని దొరకక, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ఉపాధిని కాదని ఆదోని మండలంలో అనేక గ్రామాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పని ప్రాంతాల్లో అసౌకర్యాలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని పనికొచ్చిన ఆ కూలీల ప్రాణాలను మాత్రం ప్రమాదంలో పడేస్తున్నాయి.
టెంట్లు ఎత్తేశారు...
పని చేసే చోట కూలీలకు నీడ కల్పించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం తొమ్మిది వేలకు పైగా టెంట్లు కేంద్రం అందజేసింది. ప్రస్తుతం వాటిలో ఒక్క టెంటు కూడా కనిపించడం లేదు. కూలీలు పని చేసే ప్రాంతాల్లో చెట్ల కింద సేద తీరుతున్నారు. చెట్లు, వేరే ఆసరా లేని చోట కూలీలు ఎండలోనే భోజనం చేస్తున్నారు. టెంట్లు లేకపోవడంతో కూలీలు పని తొందరగా ముగించుకుని ఇంటిబాట పడుతున్నారు.
నీటి తిప్పలు...
ముదురుతున్న ఎండలకు తగట్టు దాహమేస్తోంది. శరీరంలో ఉన్న నీరు నిర్జలీకరణమవుతోంది. దానికి తోడు పని చేసే స్థలాల్లో తాగునీటి వసతి లేకపోవడంతో ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. ఉపాధి కూలీలకు ప్రభుత్వం రోజుకు రూ.5 చొప్పున కూలితోనే కలిపి ఇస్తుంది. కానీ కూలి డబ్బులు సకాలంలో రాకపోవడంతో అధికారులూ చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం కూలీలు ఇళ్ల నుంచే క్యాన్లలో నీళ్లు పట్టుకొచ్చినా వచ్చిన అరగంటలోపే వేడెక్కుతున్నాయి. వేడి నీటినే తాగాల్సి వస్తోంది.
మెడికల్‌ కిట్లు ఇచ్చారు...పరికరాలు మరిచారు...
పని చేసే చోట కూలీలకు ఎప్పుడైనా.. ఏదైనా ప్రమాదం జరగొచ్చు అనే ఉద్దేశంతో మెడికల్‌ కిట్లు అందజేశారు. గత ఆరు సంవత్సరాలుగా గడ్డపారాలు, గంపలు తదితరుల పరికరాలను అందించలేదని ఉపాధి కూలీలు తెలిపారు.