ప్రజాశక్తి-అనకాపల్లి
వస్తు, సేవల్లో లోపాలపై ప్రశ్నించాలని తూనికలు కొలతలు శాఖ అసిస్టెంట్ కమిషనర్ పివి.రంగారెడ్డి సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం తూనికల్లో తేడాలు, కొలతల్లో మోసాలు, వినియోగదారుల రక్షణ చట్టం తదితర అంశాలపై పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రంగారెడ్డి మాట్లాడుతూ ఎంఆర్‌పి ధరల కంటే ఎక్కువకు విక్రయించడం, తూకాల్లో అరిగిపోయిన రాళ్ళను వినియోగించడం, డిజిటల్ తూనిక యంత్రాల్లో తప్పుగా నమోదు చేయడం, నికర బరువు కన్నా తక్కువ ఉండడం అనే అంశాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్యాకేజీ లేబుల్‌పై గరిష్ట ధర, ఫోన్ నెంబర్, ఇ-మెయిల్ అడ్రస్ ఉండాలన్నారు. రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో వినియోగదారుల హక్కుల రక్షణపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐవిఎస్‌ఎస్ శ్రీనివాసరావు, కన్జ్యూమర్ రైట్స్ సేఫ్ గార్డింగ్ సొసైటీ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
కొలతల్లో మోసాలు గుర్తించాలి : డిఎస్‌ఒ ప్రసాద్
కొలతలు నాణ్యతలో జరిగే మోసాలను గుర్తించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి కెవిఎస్‌ఎం ప్రసాద్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులతో పాటు కార్యకర్తలు కొనుగోలుదారులకు జరిగే మోసాల పట్ల నిఘా పెట్టాలన్నారు. అనంతరం వినియోగదారుల ఫోరం నాయకులను పౌర సరఫరాల శాఖ సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు ఎవి.రమణయ్య, సత్యనారాయణ, ఏఎస్‌ఓ కళ్యాణి, సిఎస్‌డిటిలు అప్పలనాయుడు, రాజేశ్వరి, లీల, చందన, రేఖ తదితరులు పాల్గొన్నారు.










