May 22,2022 06:57

చేనేత చీరల తయారీకి వినియోగించే 80వ నంబరు నూలు ధరలు 2014 డిసెంబరు నాటికి రూ.2100 ఉండగా మే 2022 నాటికి రూ.3200కు పెరిగింది. ఈ ధరపై 5 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. నూలు ధరలు ఈ విధంగా పెరగడంతో సహకార సంఘాలు, చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు ఈ ధరలకు నూలు కొని, వస్త్ర ఉత్పత్తి చేయించలేక ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫలితంగా చేనేత కార్మికులకు పూర్తి కాలం పని లభించటం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత కార్మికులు అర్థాకలితో, పస్తులతో దయనీయ స్థితిలో బతుకున్నారు.

     కొద్ది మంది ఎగుమతిదారుల ప్రయోజనం కోసం 130 కోట్ల భారతీయులపై మోడీ ప్రభుత్వం విపరీతమైన భారాలను మోపుతున్నది. పత్తి, నూలు ఎగుమతులను భారీగా ప్రోత్సహించడంతో, దేశీయ జౌళి రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది.
    దేశీయ జౌళి రంగానికి అవసరమైన పత్తి, నూలు లభ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వస్త్ర మిల్లులు, హోజరి మిల్లులు మూతపడే స్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రజలకు అవసరమైన వస్త్ర లభ్యత తగ్గింది. వస్త్ర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
    పత్తి, నూలు అవసరమైన మేరకు లభ్యం కాకపోవటంతో, నూలు మిల్లులు మూతపడుతున్నాయి. అవసరమైన నూలు లభ్యం కాకపోవడంతో పవర్‌ మగ్గాలు వస్త్ర ఉత్పత్తి నిలిపి వేస్తున్నాయి. పత్తి, నూలు ఎగుమతిని నిలిపివేయాలని, దేశీయ వస్త్ర రంగానికి అవనరమైన పత్తి, నూలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ, దేశంలోనే కాటన్‌ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన మరియు హోజరి వస్త్ర ఉత్పత్తిదారులు ఈ నెల 16, 17 తేదీలలో సమ్మె చేసి పరిశ్రమను పూర్తిగా మూతపెట్టారు. దీంతో లక్షలాది కార్మికులు, రెండు రోజుల పాటు ఉపాధి లేక నష్టపోయారు. కోట్లాది రూపాయల ఉత్పత్తి నిలిచిపోయింది. మోడీ ప్రభుత్వానికి బడా పెట్టుబడిదారులు, ఎగుమతిదారుల ప్రయోజనం తప్ప, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడాలని, ఆ పరిశ్రమలలో ఉపాధి పొందుతున్న కోట్లాది మంది కార్మికుల ఉపాధిని కాపాడాలని ఆలోచన ఏ కోశానా లేదని దీనిని బట్టి అర్థం అవుతుంది.
      చైనా, జపాన్‌...భారతదేశంలో పత్తి, నూలు కొనుగోలు చేసి తమ దేశంలో వస్త్రాలను ఉత్పత్తి చేసి... వాటిని భారత్‌కు ఎగుమతి చేస్తున్నాయి. వస్త్ర రంగానికి సంబంధించి చైనా ఎప్పుడూ ముడి సరుకుల ఎగుమతులు చేయలేదు. మన దేశం పత్తి, నూలు వంటి ముడి సరుకులు ఎగుమతి చేయడం ద్వారా దేశంలో నూలు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా వస్త్ర ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వస్త్ర ఎగుమతిదారుల జాబితాలో గతంలో చైనా తర్వాత రెండవ స్థానంలో ఉండే భారతదేశం ఇప్పుడు ఐదవ స్థానానికి దిగజారింది. అతి చిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఇండోనేషియా, వియత్నాం కంటే మనం వెనక స్థానంలో వున్నాం. ఈ పరిస్థితి దేశానికే అవమానకరం. కాటన్‌ టెన్స్‌టైల్స్‌ రంగానికి కావలసిన పత్తి వంటి ముడి సరుకు మన దేశంలో సమృద్ధిగా లభిస్తోంది. పైగా వస్త్ర తయారీకి కావలసిన నిపుణులైన కార్మికులు అందుబాటులో వున్నారు. అయినప్పటికి వియత్నాం లాంటి చిన్న దేశాల కంటే, ఎగుమతులలో దేశం వెనుకబడిపోవడం మన పాలకులు అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణం.
    మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నూలు ధరలు విపరీతంగా పెరగడంతో డ్రస్‌ మెటీరియల్‌ అద్దకం కోసం వినియోగించే ముప్పయ్యవ నంబర్‌ కాటన్‌ వస్త్రం ధర రూ. 33 నుంచి రూ.50 వరకు పెరిగింది. అదే విధంగా దుప్పటి అద్దకం కోసం వినియోగించే ఇరవయ్యవ నెంబరు కాటన్‌ వస్త్రం అందుబాటులో లభించడం లేదు. ఫలితంగా డ్రస్‌ మెటీరియల్‌ ధరలు, దుప్పట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి వినియోగదారులపై పెనుభారం పడుతున్నది.
    చేనేతలో వినియోగించే నూలు ధరలు 50 శాతం వరకు పెరిగాయి. ఉదాహరణకు చేనేత చీరల తయారీకి వినియోగించే 80వ నంబరు నూలు ధరలు 2014 డిసెంబరు నాటికి రూ.2100 ఉండగా మే 2022 నాటికి రూ.3200కు పెరిగింది. ఈ ధరపై 5 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. నూలు ధరలు ఈ విధంగా పెరగడంతో సహకార సంఘాలు, చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు ఈ ధరలకు నూలు కొని, వస్త్ర ఉత్పత్తి చేయించలేక ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫలితంగా చేనేత కార్మికులకు పూర్తి కాలం పని లభించటం లేదు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకు గతంలో రూ.90 లభించిన వంట నూనె ధర రూ.150కు పెరిగింది. అదే విధంగా కందిపప్పు, మినప్పప్పు, మిగతా అన్ని రకాల నిత్యవసర సరుకుల ధరలు 50 శాతానికి మించి పెరిగాయి. పూర్తికాలం పని లభించకపోవడం, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత కార్మికులు అర్థాకలితో, పస్తులతో దయనీయ స్థితిలో బతుకున్నారు.
    ఇదిలా ఉండగా రాష్ట్రంలోని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చేనేత కార్మికులు అందరికి 40 శాతం ధర రాయితీతో నూలు అందిస్తాం అన్న పథకం ఆచరణకు నోచుకోలేదు. ఇక సహకార సంఘాల పరిస్థితి సరేసరి. గత మూడు సంవత్సరాలుగా సహకార సంఘాలకు ఇవ్వవలసిన రిబేటు బకాయి, నూలు సబ్సిడీ, వడ్డీ రాయితీ చేనేత కార్మికులకు ఇవ్వవలసిన త్రిఫ్ట్‌ ఫండ్‌ బకాయిలను విడుదల చేయలేదు. ఈ బకాయిలు చేనేత సహకార సంఘాలు నాబార్డు వద్ద తీసుకున్న రుణం కంటే అధికంగా ఉన్నాయి. ఫలితంగా చేనేత కార్మిక సంఘాలు వడ్డీ భారంతో నష్టాలపాలు అవుతున్నాయి. సహకార సంఘాల వస్త్ర ఉత్పత్తులను కొనుగోలు చేసి, మార్కెటింగ్‌ చేసే బాధ్యతతో ఏర్పాటైన ఆప్కో సంస్థ చేనేత ప్రాథమిక సహకార సంఘాల ఉత్పత్తులలో కనీసం 5 శాతం కూడా కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన వస్త్రాలకు కూడా సంవత్సరం అయినా సొమ్ము చెల్లించడం లేదు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకుండా పవర్‌ మగ్గాల వస్త్రాలను ఆప్కో యథేచ్ఛగా కొనుగోలు చేస్తున్నది.
    సహకార సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలను విడుదల చేయాలని ఉన్నతాధికారులను, మంత్రిగారిని, చేనేత ప్రతినిధులను కలిసి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి గారికే స్వయంగా వివరిద్దామంటే ఆయన అపాయింట్‌మెంటే కరువైపోయింది.
ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్నే కాక, దేశీయ వస్త్ర రంగాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టి కోట్లాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బ తీస్తున్నాయి.
 

/ వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం
మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సెల్‌ : 9440423417 /
సజ్జా నాగేశ్వరరావు

సజ్జా నాగేశ్వరరావు