ప్రజాశక్తి-వేటపాలెం: పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ భూమి యొక్క ఉష్ణోగ్రత, పెరుగుదల నియంత్రించే కార్యక్రమం, ఖనిజ సంపద వినియోగం, ఇంధన వాడకం, మొక్కల పెంపకం, వృక్ష సంపద వినియోగం, రీసైక్లింగ్ అయ్యే వస్తువుల వినియోగం, విద్యుత్ వినియోగం విషయాలలో తీసుకోవలసిన, అవలంబించవలసిన విధానం, భాధ్యతను తెలియజేశారు. విద్యార్థులతో ప్రమాణం చేయించి, రాబోయే కాలంలో వారు పెద్దయ్యాక తీసుకోవలసిన జాగ్రత్తలు, నిర్ణయాలను నిర్దేశించారు. విద్యార్థులు ప్రమాణం చేస్తూ నీటిని పొదుపుగా వినియోగిస్తామని, రీసైక్లింగ్ వస్తువులు వినియోగిస్తామని, మొక్కల పెంపకం, వృక్ష సంపదను కాపాడతామని, ఇంధన వినియోగం తగ్గించి ఆరోగ్య సూత్రంగా సైకిల్ వాడకం, విద్యుత్తు వినియోగంలో పొదుపు, చేతి గుడ్డ సంచులు వినియోగిస్తామని, ఆహార వినియోగంలో ధరణిపై పండిన వస్తువులను పొదుపుగా వినియోగిస్తూ, శాఖాహారులుగా ఉంటూ భూమి పరిరక్షణకు పాటుపడతామని ప్రమాణం చేస్తూ, కట్టుబడి ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఎస్‌విఎల్ ప్రసాద్, మస్తాన్‌రెడ్డి, శేఖర్, సేవక్ సుబ్రహ్మణ్యం, లక్ష్మి, మౌనిక పాల్గొన్నారు.










