సీతంపేట: పాలకొండలో గల గిరిజన బాలురు పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనం నిర్మించాలని కోరుతూ స్థానిక గిరిజనసంక్షేమాధి కారి ఎం.శ్రీనివాసరావు, ఎటిడబ్ల్యు జి మంగవేణికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం వినతిని అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పాలకొండ గిరిజన బాలురు పోస్టుమెట్రిక్ హాస్టల్ విద్యార్థులు సొంత భవనం లేక వేర్వేరు భవనాల్లో నివసిస్తున్నార న్నారు. కనీస మౌలికసదుపాయలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం, ఐటిడిఎ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. ప్రస్తుతం 215 మంది విద్యార్థులు రెండు భాగాలుగా వేర్వేరు భవనాల్లో ఉంటున్నారని తెలిపారు. ఈ భవనాల్లోకనీసం తాగునీరు, మరుగుదొడ్లు, స్నానానికి నీరు కూడా లేకపోవడం తో విద్యార్థులు చాలా అవస్థలకు గురవుతున్నార న్నారు. అధికారులు సందర్శించిన ప్రతిసారి హెచ్‌డబ్ల్యులతో మాట్లాడి పోవడమే తప్ప తమ గోడు వినే పరిస్థితి లేదని విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. వెంటనే సొంత భవనం నిర్మించడానికి స్థలం, నిధులు కేటాయించి భవనం పనులు పూర్తిచేయాలని, హాస్టల్ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించి, వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపై సీతంపేట డిడి, పార్వతీపురం డిడితో ఫోను ద్వారా మాట్లాడించగా కొంతమంది విద్యార్థులను మరొక ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో ఉన్నామని పార్వతీపురం డిడి తెలిపారు. కనీసం తాత్కాలిక భవనమైన కేటాయించి అందరి విద్యార్థులకు ఒకే చోట హాస్టల్ ఏర్పాటు చేసేలా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హెచ్.సింహా చలం కమిటీ సభ్యులు ఎన్.హరి పాల్గొన్నారు.










