Dec 12,2022 23:57

వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న సర్పంచ్‌ తదితరులు

ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట

'పింఛను కోసం వృద్ధురాలి ఎదురుచూపు' శీర్షికన ఈ నెల 6న ప్రజాశక్తి ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. బాధిత వృద్ధురాలు సలాది గంగమ్మకు పింఛను మంజూరు చేసి సోమవారం అందజేశారు. 30 రూపాయలు నుండి రూ.2500 పింఛను వరకు 42 సంవత్సరాలుగా వృద్ధురాలు గంగమ్మ పింఛను పొందుతున్నారు. సాంకేతిక కారణాలతో ఎనిమిది నెలలుగా ఆమెకు పింఛను నిలిపి వేశారు. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయంపై ప్రజాశక్తి కథనాన్ని ప్రచురించింది. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గునూరు మల్లు నాయుడులు వృద్ధురాలు గంగమ్మను పరామర్శించి ఆమెకు పింఛను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసిన విషయం విధితమే. పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్‌ వృద్ధురాలికి పింఛను మాన్యువల్‌గా అందం చేయాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం స్థానిక సర్పంచ్‌ గులజాన శ్రీను, ఇందిరా క్రాంతి పథం ఏపిఎం బాలరాజు వృద్ధురాలుకు రూ.2500 నగదు, నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు. ఆగిపోయిన పెన్షన్‌ పునరుద్ధరణ జరగడంతో వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శరగడం సత్యవతి, కార్యదర్శి అమర పిన్ని వరలక్ష్మి, కోశాధికారి సెలప రెడ్డి సత్యవేణి, సీసీ గణేశ్వరరావు వెంకట్రావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.