
ప్రజాశక్తి - భీమవరం రూరల్
వయోవృద్ధులను ఇబ్బంది పెట్టేవారికి ఇబ్బందులు తప్పవని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి భవనంలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల గౌరవంగా ఉండం పిల్లలకు నేర్పించాలన్నారు. వయోవృద్ధులు వచ్చేతరానికి ఆదర్శమన్నారు. అనంతరం వయోవృద్ధులను కలెక్టర్ సన్మానించి మెమోంటో, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి జిసిహెచ్.ప్రభాకర్, అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ దుర్గాప్రసాద్, భీమవరం డివిజన్ సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ అధికారి చంధ్రాజీ, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిట్టి వెంకయ్య, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.రామచంద్రరావు పాల్గొన్నారు.
ఆకివీడు : పెంచి పెద్ద చేసి మన జీవితానికి ఉన్నత మార్గాన్ని చూపిన తల్లిదండ్రుల సేవలో జీవితాన్ని ధన్యం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం లయన్స్ క్లబ్ సహకారంతో స్థానిక లయన్స్ హాలులో ఆకివీడు మండల సర్ ఆర్థర్ కాటన్ వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎంవి.సూర్యనారాయణరాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో మహేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వృద్ధులకు సేవలందించేందుకు వైద్య సిబ్బంది ఇంటింటికి వస్తుంటారని, వారి సేవలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. సభలో సంఘ అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య మాట్లాడుతూ తమ సంఘాన్ని స్థాపించి 13 ఏళ్లయిందన్నారు. ఈ కాలంలో సుమారు వంద సదస్సులు నిర్వహించామని చెప్పారు. ప్రతి సదస్సులను వంద మందికి భోజనాలు, దుప్పట్లు, బట్టలు అందిస్తున్నామన్నారు. ఎండి మస్లే వుద్దీన్‌బాషా వర్థంతి సందర్భంగా ఆయన కుమారుల సహకారంతో 50 మంది పేద మహిళలకు చీరలు, 50 మంది పురుషులకు పంచెలు, వంద మందికి భోజనాలు అందించారు. అనంతరం ఆరుగురు వృద్ధులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివి.కృష్ణంరాజు, ఆదర్శ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోటుపల్లి శ్రీనివాస్, కోశాధికారి జిక్కి అహ్మ ద్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆక్వా అధ్యక్షులు గుర్రం అరవింద్, వైద్య ప్రముఖులు మహేష్ వర్మ, డాక్టర్ బిలాల్, మాధవి, దాత రియాజుద్దీన్ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ :వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు, చట్టాలు కట్టుబడి ఉన్నాయని, వారికి ఉచిత న్యాయ సహాయం అవసరమైతే మండల న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని నరసాపురం సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్యనాయుడు, సంస్థ సభ్యులు యర్రంశెట్టి దేవేంద్ర ఫణికర్, సీనియర్ న్యాయవాది నారిన శ్రీనివాసరావు, అసోసియేషన్ అధ్యక్షులు ఎ.హరినాధకృష్ణ పాల్గొన్నారు.
పాలకొల్లు :సమాజంలో వివిధ సేవలు చేసిన వృద్ధులను ఆదుకోవడం కనీస ధర్మమని వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ చెప్పారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద రాహుల్ సామాజిక సేవ సంస్థ అధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంద మంది వృద్ధులకు పండ్లు, దుప్పట్లు ఆయన చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు గుణ్ణం నాగబాబు, డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీ, టౌన్ ప్రెసిడెంట్ చందక సత్తిబాబు, జోగి వెంకటేశ్వరరావు, జోగి వడ్డికాసులు పాల్గొన్నారు.