ప్రజాశక్తి-భట్టిప్రోలు (వేమూరు): వేమూరు మండలం చావలి గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలేము రాజ్ సుమారు 106 మంది వృద్ధులకు కళ్లజోళ్లు అందజేశారు. ఇటీవల గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం 106 మందికి వైద్య చికిత్సలు అవసరమయినట్లు గుర్తించగా వారికి చికిత్సలు చేయించిన అనంతరం శనివారం ఈ కళ్లజోళ్లు అందజేసినట్లు షాలేమురాజు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఇప్పటికే ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని అన్నారు. వాటిలో అవసరమైన వారికి కూడా శస్త్ర చికిత్సలు చేశారని, వీరందరికీ త్వరలోనే కళ్లజోళ్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు, పలు రకాలుగా ఆపదలో ఉన్న వారిని నిరంతరం ఏదో రూపంలో ఆదుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఏపీ ఇన్ఛార్జి యన్నం సురేష్, నాని, సురేష్, ముసలయ్య, సాంబయ్య, అశోక్, మున్నేశ్వరరావు తదితరులు ఉన్నారు.