Apr 10,2023 20:11

క్షతగాత్రులను పరామర్శిస్తున్న జడ్జి కె.రత్నకుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : నెహ్రూ నగర్‌లోని కొత్తపేట మహిళా మండలి వృద్ధాశ్రమం గోడ ఆదివారం కూలడంతో వృద్ధురాలు, వాచ్‌మెన్‌ కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ వైవిఎస్‌బిజి పార్థసారధి స్పందించారు. ఆశ్రమాన్ని పరిశీలించి ఘటనపై వివరాలు ఇవ్వాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్నకుమార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆశ్రమాన్ని రత్నకుమార్‌ సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. ఆశ్రమంలోని వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆశ్రమంలోని వారిని సురక్షిత భవనంలోకి మార్చాలని సూచించారు. పరిశీలనలో ఆశ్రమ డైరెక్టర్‌ పోతురాజు వెంకట్‌, న్యాయసేవాధికార సంస్థ ప్యానల్‌ న్యాయవాది కట్టా కాళిదాసు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోర్టులో పని చేస్తూ కోవిడ్‌ కాలంలో చనిపోయిన ముళ్లపూడి శ్రీనివాస్‌ కుటుంబీకులు వస్త్రాలను ఆశ్రమంలోని వృద్ధుల కోసం సమకూర్చగా వాటిని జడ్జి కె.రత్నకుమార్‌ ద్వారా అందించారు.