Sep 06,2023 22:48

బూర్జ మండలం అల్లెనలో ఇంజిన్‌తో వరి పంటకు నీరు పెడుతున్న రైతులు

      బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఇక పుష్కలంగా వర్షాలు పడతాయని రైతులు ఆశించారు. వానలతో ఎండిన పొలాలు తడుస్తున్నాయని ఆశలు పెట్టుకున్నారు. ఇంజిన్లు పెట్టుకునే వ్యయ ప్రయాసలు తప్పుతాయని భావించారు. వరుణుడి చూపు ఒక వైపే అన్నట్లు వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. బుధవారం జిల్లాలో పలు మండలాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని మండలాల్లో చినుకు చుక్క రాల్లేదు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఇంజిన్లు పెట్టుకుని పంటను బతికించుకుంటున్నారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: 
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో బుధవారం పలు చోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి. జిల్లాలో సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి సరుబుజ్జిలి మండలంలోని విజయరామపురంలో గరిష్టంగా 124.75 మి.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షం పడిన రెండో ప్రాంతంగా నమోదయింది. మెళియాపుట్టిలో 95.25 మి.మీ వర్షపాతం నమోదయింది. పలాసలో 94.25 మి.మీ, బూర్జ మండలం కొల్లివలసలో 64 మి.మీ, మందస మండలం హరిపురంలో 70.5 మి.మీ, పాతపట్నంలో 59 మి.మీ, ఇచ్ఛాపురం మండలం అరకభద్రలో 30 మి.మీ వర్షం కురిసింది. సోంపేట మండలం కొర్లాంలో 24.5 మి.మీ, ఎచ్చెర్లలో 21.25 మి.మీ, ఆమదాలవలస మండలంలో 13.75 మి.మీ, ఎల్‌ఎన్‌పేటలో 10.25 మి.మీ వర్షం పడింది.
ఆ మండలాల్లో చినుకు చుక్క కరువు
జిల్లాలో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసినా కొన్ని మండలాల్లో చినుకుచుక్కా రాల్లేదు. కొత్తూరు, నరసన్నపేట, పొందూరు, జి.సిగడాం, సారవకోట, పోలాకి, కవిటి తదితర మండలాల్లో సున్నా వర్షపాతం నమోదయింది.
ఒక మండలంలో ఒక ప్రాంతంలో మోస్తరు వర్షం పడినా మరో చోట సున్నా వర్షపాతం నమోదయింది. ఉదాహరణకు బూర్జ మండలం కొల్లివలసలో 64 మి.మీ వర్షం పడగా, బూర్జ మండలం కేంద్రంలో చినుకు చుక్క పడలేదు. కొన్ని మండలాల్లో నామమాత్రంగానే వర్షం పడింది. గార 0.5 మి.మీ, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళిలో చెరో 0.25మి.మీ వర్షపాతం నమోదయింది.
ఆ మండలాలు గట్టెక్కుతాయా?
ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు అత్యంత తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మండలాలను ఎంతవరకు గట్టెక్కిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. జిల్లాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే కొన్నిచోట్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలు ఎండిపోవడంతో కవిటిలో పొలాలను పశువుల మేతకు వదిలేశారు. పంటలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న జాబితాలో కంచిలి మండలం మొదటి స్థానంలో ఉంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి బుధవారం వరకు నమోదైన వర్షపాతంలో 46.6 శాతం లోటు కనిపిస్తోంది.
అదేవిధంగా ఇచ్ఛాపురంలో 45 శాతం, కవిటిలో 48 శాతం, సోంపేటలో 36 శాతం, నందిగాంలో 28.5 శాతం, సారవకోటలో 26.8 శాతం, టెక్కలిలో 18.5శాతం లోటు ఉంది. వరి పంట ఎండిపోతుండటంతో రైతులు ఇంజిన్ల సాయంతో నీటిని తోడి పంటలను బతికించుకుంటున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలూ కలిపి 4 లక్షల 37 వేల 165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 3,67,643 ఎకరాల్లో (84శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 3,39,588 ఎకరాల్లో (85శాతం) సాగైంది. మరో నాలుగైదు రోజులు వర్షా లు పడితే వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కొచ్చని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.