Oct 01,2023 22:41

వర్షపు నీరు కాదు.. మురుగు..
ప్రజాశక్తి- సోమల:
సోమల -నంజంపేట మార్గమధ్యంలోని జీడి రేవుల వంక (సరస్వతీపురం) వద్ద రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించకపోవడంతో గ్రామంలోని మురుగునీరు మొత్తం రోడ్డుపైకి వచ్చి మురుగు నీటి వల్ల ఏర్పడిన పెద్దపెద్ద గోతులలో నిల్వ చేరుతోంది. దీంతో వాహనదారులకు నడిచి వెళ్లే వారికి ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా వర్షం పడినప్పుడు గోతులలో నీరు పూర్తిగా నిండిపోయి నడిచి వెళ్లే వారికి ఇబ్బందికరంగా మారుతోంది. వాహనాలు కూడా ఎక్కడ లోతైన గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితులలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. నంజంపేట పంచాయతీ వారు మురుగునీటి కాలువలను నిర్మించి గ్రామంలోని మురుగునీరు ప్రధాన రహదారిపైకి రాకుండా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.