
ప్రజాశక్తి -వడ్డాది:బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. దీంతో, విజయరామరాజుపేట ప్రధాన రహదారి జలమయం అయ్యింది. విజయరామరాజుపేట మీదుగా అనకాపల్లి, విశాఖ, నర్సీపట్నం, మాడుగుల తదితర ప్రాంతాలకు ప్రయాణీకులు, వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ వర్షానికి రోడ్డు గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఈ రహదారి గోతులు పూడ్చాలని వాహనదారులు, ప్రయాణీకులు కోరుతున్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం భారీగా వర్షం కురిసింది. రబీ సాగులో భాగంగా పడ్డాది, చిన్నప్పన్నపాలెం, పోలేపల్లి తదితర గ్రామాల్లో రైతులు వేసిన వరి పంటను కోతలు కోసి పొలాల్లో విడిచిపెట్టారు. వందల ఎకరాల్లో పండి కోతలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కశింకోట : కశింకోట మండలంలో బుధవారం వర్షం కురుసింది. వాతావరణం మార్పు వల్ల రెండు రోజులుగా భారీ వర్షం, చిరు జల్లులు కురుస్తుండగా, బుధవారం కూడా వర్షం పడింది. వర్షం వల్ల పలు చోట్ల నీరు చేరింది. ఈ వర్షం వల్ల మామిడి పంటకు నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు తెలిపారు. కోటవురట్ల:మండల వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేని భారీ వర్షం కురియడం తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వెంకటాపురం, కొడవటిపూడి వద్ద రోడ్లు చెరువులను తలపించాయి. మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మండల పరిషత్ కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గొలుగొండ:
మండలంలో పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్లపై చేరి చెరువులను తలపించాయి. ఏఎల్ పురం బస్టాండ్‌లో వర్షపు నీరు నిలవడంతో బురదమయంగా మారింది.