Mar 27,2023 01:30
వర్షాలకు ఎండిపోయిన మొక్కజొన్న పైరు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: గత పది రోజుల క్రితం కురిసిన వర్షం కొందరు రైతులకు ఊరట కలిగించగా మరి కొందరికి అపార నష్టాన్ని కలిగించింది. డెల్టా ప్రాంతంలో ఈ ఏడాది అధిక శాతం మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేశారు. జొన్న కంకి దశలో ఉండగా మొక్కజొన్న కండె దశలో ఉంది. సాధారణంగా నవంబర్‌ నెల నుంచి జనవరి నెలాఖరు వరకు మొక్కజొన్న పంటను సాగు చేస్తుంటారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో సాగు చేసిన పైరు కండె దశలో ఉంది. గింజ పలుపోసుకునే స్థాయిలో ఉంది. అదే రీతిలో జనవరి నెలలో సాగుచేసిన పైరు కండె ఏర్పడే దశకు చేరుకున్న సమయంలో కురిసిన వర్షానికి తేమ శాతం అధికమై తట్టుకోలేక పైరు చనిపోయిందని రైతులు వాపోతున్నారు. భట్టిప్రోలు మండలంలో అద్దేపల్లి, ఐలవరం, కోనేటిపురం, రాచూరు, పల్లెకోన గ్రామాలలో లేత దశలో ఉన్న పైరు వర్షానికి గురై నిలువునా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశామని, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా ఈ విధంగా దెబ్బతిన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటను పరిశీలించి ఆదుకోవాలని కోరుతున్నారు.