Jul 18,2021 12:21

వాలే చినుకులో
ఆశగా తడిశాను
బురద సాలుల్లో
నారుగా మురిశాను

ఎండిన కలలని తడుపుతూ
వడివడిగా దున్నుకుంటున్నాను
ఎండలు మండిస్తాయో
వానలు ముంచేస్తాయో
కళ్ళనిండా మేఘాలు
నిండి ఉన్నాయి
గుండెనిండా ధైర్యం
పిండుకున్నాను
కాసింత ఉరుములు భయపెడతాయి
కాసిన్ని పిడుగులు
కూల్చేస్తాయి

కాళ్లు మట్టిపెళ్ళల్లో
ఉదయించందే
మనసు కుదుటపడదు
రెప్పల వాకిట్లో
తెప్పలుగా కదిలే దృశ్యాల వెంట
ఆకు పచ్చని కలలు
ఊరటనిస్తాయి
ఊపిరి పోసినా
ఊపిరి తీసినా
మట్టిని నమ్ముకునే
రైతు జీవితం ముగుస్తుంది
 

గవిడి శ్రీనివాస్‌
70192 78368